ఏ దేశంలోనైనా ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ నిర్ణయాల కారణంగా కొన్ని కంపెనీలు పుంజుకోవడమో, అభివృద్ధిలోకి రావడమో జరిగితే, మరి కొన్ని నష్టపోయే అవకాశమూ ఉంటుంది. చైనాలో నిన్నటి వరకు ఒక్క బిడ్డనే కనాలనే నిబంధన ఉండేది. తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఇద్దరు బిడ్డలను కనొచ్చని ప్రకటించడంతో పాపులర్ బ్రాండ్ కండోమ్‌లు తయారుచేస్తున్న కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలియి. అదే సమయంలో పిల్లలకు సంబంధించిన నాప్పీస్, పుష్ ఛైర్స్, బేబీ మిల్క్ తయారుచేసే కంపెనీల షేర్లు ఒక్కసారిగా తారాజువ్వల్లా పైకి లేచాయి.
చైనా ఆర్థిక మార్కెట్లలో ఛైల్డ్ కేర్ ఉత్పత్తులు (జుత్తు, చర్మ పరిరక్షణ ఉత్పతులు) తయారుచేసే కంపెనీలది పెద్ద వాటా. ఒక్క బిడ్డ నిబంధన సడలించిన వెంటనే హాంకాంగ్‌లోని స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ కంపెనీల షేర్లు 40 శాతం మేరకు పెరిగాయి. చైనా ప్రజలు జపాన్‌లోని ఒకోమోటో ఇండస్ట్రీస్ తయారుచేసే కండోమ్స్ ఎక్కువగా వాడతారు. ప్రభుత్వ నిర్ణయం తరువాత టోక్యోలోని ఈ కంపెనీ షేర్లు పది శాతం మేరకు పడిపోయాయి. హాంకాంగ్‌లో, చైనా మెయిన్ ల్యాండ్‌లో శిశువుల ఆహారం తయారు చేసే కంపెనీల షేర్లు పది శాతం మేరకు పెరిగాయి. జపాన్‌లో ఉన్న ఇలాంటి కంపెనీల షేర్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.
టోక్యోలోని బేబీ బాటిళ్లు తయారుచేసే పిజియన్ కార్ప్ షేర్ల ధరలు 10.7 శాతం పెరిగాయి. నాప్పీ తయారీ కంపెనీల షేర్లు 4 శాతం పెరిగాయి. చైనీయులు ఎక్కువగా జపాన్, ఇతర విదేశీ బ్రాండ్ల ఉత్పత్తులు వాడుతారు. పాల ఉత్పత్తులకు ప్రసిద్ధి పొందిన న్యూజీలాండ్‌లో చైనా ప్రభుత్వ నిర్ణయం ప్రభావం చూపింది. శిశువులకు పాలే కదా కీలక ఆహారం. శివువులకు అవసరమైన పాలు న్యూజీలాండ్ నుంచి చైనాకు దిగుమతి అవుతున్నాయి. గుడ్ బేబీ ఇంటర్నేషనల్ అనే కంపెనీ పిల్లలకు సంబంధించిన పుష్ ఛైర్స్, కారు సీట్లు మొదలైనవి తయారుచేస్తుంది. దాని షేర్ల ధరలు 7.4 శాతం పెరిగాయి. చైనా ప్రభుత్వ నిర్ణయం వివిధ దేశాల్లోని కంపెనీలను ప్రభావితం చేసిందట.
ఒక్క బిడ్డను మాత్రమే కనాలనే నిబంధన సడలించిన తరువాత దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చైనాలో ఏడాదికి ఎంతమంది పిల్లలు జన్మించే అవకాశం ఉంది? అని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక నుంచి ప్రస్తుత చైనా జనాభాకు అదనంగా వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏడాది 30 లక్షల నుంచి 60 లక్షల వరకు జత కావొచ్చని ఓ సంస్థ అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా అని తెలిసిందే. జనాభాను అరికట్టేందుకు 1979లో చైనా ప్రభుత్వం 'ఒక్క బిడ్డ మాత్రమే' అనే నిబంధన పెట్టింది. దీన్ని కఠినంగా అమలు చేసింది కూడా. 'కంటే ఒక్కరినే కనాలి. లేదా అసలు వద్దు' (ఒన్ ఆర్ నన్) అనేది చైనా పాలకుల విధానం.
2013లో ఈ నిబంధనకు కొద్దిగా సడలింపు ఇచ్చి ప్రభుత్వానికి రెండు లక్షల యువాన్లు చెల్లించి రెండో బిడ్డను కనాలి అని చెప్పింది. మరో బిడ్డ కావాలనే కోరిక ఉన్నవారు లేదా ఒక్క బిడ్డనే కని ఏవో కారణాల వల్ల కోల్పోయిన వారు ప్రభుత్వానికి డబ్బు చెల్లించి మరో బిడ్డను కన్నారు. కాని అందరికీ డబ్బు చెల్లించే శక్తి ఉండదు కదా….! ఒక్క బిడ్డ నిబంధన పర్యవసానం దారుణంగా ఉన్న సంగతి ఇప్పుడు గుర్తించింది. ఏమిటా దారుణం? జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి శ్రామిక శక్తి తగ్గిపోతుండటం. దీంతో ఇద్దరిని కనండి అంటూ నియంత్రణ ఎత్తేసింది.
2050 నాటికి జనాభాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు అరవై ఏళ్లు దాటినవారు ఉంటారు. ఇప్పుడు రెండో బిడ్డను కనడానికి వెసులుబాటు కల్పించినా ఎక్కువమంది ఇష్టపడటంలేదట. కారణం…? ఖర్చులు పెరిగిపోవడమే. మరో బిడ్డను కంటే ఆర్థిక భారం మీద పడుతుంది. చైనాలోనూ మగ పిల్లవాడికి ఇల్లు సమకూర్చాలని, ఆడపిల్లకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనే పరిస్థితి ఉందట. దీంతో జనం భయపడుతున్నారట. ఈ దేశంలో ఒక్క పిల్లవాడికి (లేదా పిల్లకు) ఏడాదికి అయ్యే ఖర్చు 40 వేల యువాన్లు. మరొకరిని కంటే ఇది రెట్టింపు అవుతుంది కదా. ఐదేళ్ల తరువాత ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది.