ప్రజాస్వామ్యంలో మూడో స్తంభంపై ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈ అనుమానాలు ఇప్పటివి కావు. ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే “కోర్టు ధిక్కారం” కింద శిక్షార్హం అవుతుందని చాలామంది వాటిపై మాట్లాడేందుకు, చర్చ చేసేందుకు భయపడుతున్నారు.
కోర్టులపై మాజీ న్యాయమూర్తులో, న్యాయశాస్త్ర నిపుణులో అప్పుడప్పుడు ఏవో వ్యాఖ్యానాలు చేయడం మినహా మొత్తం న్యాయవ్యవస్థను ప్రజలు ప్రశ్నించిన సందర్భాలు లేవు. న్యాయవ్యవస్థ మొత్తాన్ని, దాని అస్తిత్వాన్ని ప్రశ్నించడం కూడా ఆరోగ్యకరం కాదు.
ఈ వ్యవస్థపై ప్రజల్లో ఇంకా గౌరవం ఉందికాబట్టే నేరం చేయాలంటే సమాజంలో కాస్తో, కూస్తో భయం ఉంది. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు చూసినప్పుడు ఈ భయం ప్రజల్లో తొలగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రత్యేకించి గత రెండురోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు పట్ల, దాని తీర్పుల పట్ల వస్తున్న వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చూస్తున్నప్పుడు ప్రజాస్వామ్య మూడో స్థంభం పటిష్టతపై భయాలు కలుగుతున్నాయి. ఈ స్థంభం కూడా బలహీనపడుతోందా అనే అనుమానం ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఉండాల్సిన స్థానంలో భయం మాత్రమే ఉంది. నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. అందుకు తప్పు పట్టాల్సింది న్యాయవ్యస్థనే కానీ వేరెవరినీ కాదు. న్యాయవ్యవస్థలో ఉన్న కొందరు న్యాయమూర్తులు ఈ వ్యవస్థ పతనానికి కారణం అవుతున్నారనే అనుమానాలూ, ఆరోపణలూ వస్తున్నాయి.
“మన గొప్ప దేశంలో ఎవరిని జడ్జీలుగా ఎవరు ప్రతిపాదిస్తారో, ఎందుకు ప్రతిపాదిస్తారో, చివరకు కొందరి పేర్లు ఎందుకు రాలిపోతాయో, కొందరు భాగ్యవంతుల పేర్లు ఎందుకు రాలిపోవో బ్రహ్మకు కూడా అంతుబట్టదు” అని సాక్షాత్తూ న్యాయశాస్త్ర ఉపాధ్యాయుడు మాడభూషి శ్రీధర్ (మే 19, 2017 సాక్షి) ఓ సందర్భంలో అన్నారు అంటే ఈ వ్యవస్థలోకి వస్తున్న వారు ఎవరో, ఈ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఎందుకు పోతోందో ఆలోచించవచ్చు.
న్యాయవ్యవస్థలోని వ్యక్తులు మానవాతీతులేం కారు. ఇతర వ్యవస్థలోని వ్యక్తుల్లాంటివారే. వారిలో ఉండే తెలివి, ఉద్రేకాలు, ఉత్ప్రేరకాలు, ఆకర్షణలు, బలహీనతలు, బలం, నిబ్బరం తదితర లక్షణాలన్నీ న్యాయవ్యవస్థలోని వ్యక్తుల్లో కూడా ఉంటాయి. ఇతర వ్యవస్థల్లోని వ్యక్తుల్లాగే న్యాయవ్యవస్థలోని వ్యక్తులు కూడా పొరపాట్లు చేయవచ్చు. ప్రలోభాలకు, వత్తిళ్ళకు గురికావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకో వచ్చు. రాగద్వేషాల ప్రభావం కూడా ఉండవచ్చు.
మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చెప్పినట్టు న్యాయమూర్తుల్లో “యాక్టివిస్టులు” ఉన్నారు. పదవీవిరమణ తర్వాత కొన్ని పదవులు (అసైన్మెంట్స్) అంగీకరించేవారు ఉన్నారు. బహుమతులు స్వీకరించేవారు, విందులు, వినోదాలకు హాజరయ్యేవారు ఉన్నారు.
భారత దేశ అత్యున్నత న్యాయస్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తి తీరుపై నలుగురు న్యాయమూర్తులు బహిరంగ విమర్శ చేశారంటే (జనవరి 18, 2018) న్యాయవ్యవస్థలో లోపాలు లేక కాదు. ఆ లోపాలను సరిదిద్దుకోవాలే గానీ, లోపాలు చూపించిన వారిపై, లేదా విమర్శ చేసిన వారిపై ధిక్కార నేరం మోపడం సరికాదు.
కరోనా విషయం చూస్తున్నాం కదా! వ్యాధిని నయం చేసుకోవాలే కానీ దాచుకుని కుళ్ళబెట్టుకోవడం మంచిది కాదు. న్యాయవ్యవస్థలో కనిపిస్తున్న, వినిపిస్తున్న లోపాల పట్ల కూడా కరోనా పరీక్షలు జరగాల్సిందే. అవసరమైతే న్యాయవ్యవస్థ “క్వారంటైన్”కు వెళ్లాల్సిందే. లేకపోతే 2018లో నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పినట్టు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
న్యాయమూర్తుల నియామకంలో డొల్లతనం కనిపిస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. న్యాయమూర్తుల నియామకం పారదర్శకంగా ఉన్నట్టు, నియామక ప్రక్రియ ఆరోగ్యకరంగా ఉందని ఎక్కువమంది అనుకోవడం లేదు. ఈ అభిప్రాయం విస్తృతం అవడం కానీ, బలపడడం కానీ మంచిది కాదు.
“సైకిలు దొంగను మూడు సంవత్సరాలు జైల్లో పెట్టి పోషిస్తాం కానీ న్యాయస్థానం సోఫా కొనుగోలులో వేలరూపాయలు భోంచేసి న్యాయమూర్తిని యువరానర్, మై లార్డ్ షిప్ అని సగౌరవంగా సత్కరిస్తామంటే దాన్ని రూల్ ఆఫ్ లా అని మాత్రం అనరు,” అని మాడభూషి శ్రీధర్ చేసిన వ్యాఖ్యానం సమర్ధనీయంగానే కనిపిస్తోంది.
న్యాయమూర్తులు కూడా ప్రజలలోనుండి వస్తున్నవారే. ప్రజలకు ఎలాంటి బలహీతనతలు, రుగ్మతలు ఉంటాయో అలాంటివి వీరికీ ఉంటాయి. న్యాయమూర్తులు మానవాతీతులైతే కాదు. న్యాయమూర్తుల్లో అవినీతిపరులు లేరా? ఎలాంటి ప్రలోభాలకు వారు లోనుకావడం లేదా వంటి మౌలిక ప్రశ్నలు ఇప్పుడు సమాజం సంధిస్తోంది.
గత వారంలోనే వలస కార్మికుల అంశంపై సుప్రీం కోర్టు ఒక రకంగా ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు మరోరకంగా తీర్పు ఇవ్వడం చూస్తే న్యాయస్థానాలు న్యాయమూర్తుల విచక్షణా జ్ఞానంపై ఆధారపడి కూడా ఉన్నాయని అర్ధమవుతుంది. నడిచివెళ్ళే వలస కార్మికులను ఎలా ఆపగలం? అసలు రోడ్డుమీద ఎవరు నడుస్తున్నారో, ఎవరు నడవడం లేదో చూడ్డమే మా పనా? అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తే రెండురోజుల తేడాతో “అంతమంది ప్రజలు నిస్సహాయులుగా రోడ్డుమీద నడుస్తుంటే కళ్ళకు కనిపించడం లేదా,” అంటూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు స్పందించింది.
ఈ వ్యాఖ్యలు కేవలం సదరు న్యాయమూర్తుల విచక్షణ మేరకు వచ్చినవే. అంటే న్యాయమూర్తుల విచక్షణలో, స్పందనలో వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? రోడ్డుమీద ఎవరు నడుస్తున్నారో, ఎవరు నడవడం లేదో చూడ్డమే మా పనా? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టును గౌరవించాలా? లేక నడిచి వెళుతున్న వారిని ఆదుకోవాలని చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టును గౌరవించాలా? దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఎవరిని గౌరవించాలి?
ఇప్పటికైనా మించిపోయింది లేదు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రధానంగా న్యాయమూర్తుల నియామకంలో ఏదో ఒక ప్రజాస్వామ్య విధానం రావాలి. జుడీషియరీ నియామకాల్లో లెజిస్లేచర్ లా ఎన్నికలో లేక ఎగ్జిక్యూటివ్ లా పరీక్షలో ఉండాలి. అంతే కాదు న్యాయవ్యవస్థ ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. అందుకు చర్చ జరగాలి.
న్యాయమూర్తుల నియామకానికి ఐఏఎస్, ఐపిఎస్ వంటి విభాగాలతో సమానంగా ఐ జె ఎస్ (ఇండియన్ జ్యూడిషియల్ సర్వీస్) వంటిది ఉండాలి. లేదా అందుకు సమానమైన ఇంకో విధానం ఉండాలి. ఒక ఆదర్శనీయమైన పారదర్శకమైన ప్రామాణికం ఉండాలి.
Facebook post from Dara Gopi