ఒరిజినల్ ఒకటే.. సీక్వెల్ ‘కథ’లే వేరు!

సీక్వెల్.. ఒక కొనసాగింపు సృజన. ఒకసారి చిత్రీకరించిన అద్భుతాన్ని మరోసారి కొనసాగించడం. సినిమాకు సంబంధించి సీక్వెల్ ఒక ప్రభావవంతమైన మాధ్యమం. ప్రత్యేకించి భారతీయ, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో సీక్వెల్ ప్రభావం ఇంకా ఇప్పుడిప్పుడే ఊపందుకొనే…

సీక్వెల్.. ఒక కొనసాగింపు సృజన. ఒకసారి చిత్రీకరించిన అద్భుతాన్ని మరోసారి కొనసాగించడం. సినిమాకు సంబంధించి సీక్వెల్ ఒక ప్రభావవంతమైన మాధ్యమం. ప్రత్యేకించి భారతీయ, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో సీక్వెల్ ప్రభావం ఇంకా ఇప్పుడిప్పుడే ఊపందుకొనే దశలో ఉంది. హాలీవుడ్‌లో ఎన్నో దశబ్దాల నుంచి సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. విదేశీ సినిమాల ప్రభావాన్ని కలిగిన భారతీయ దర్శకులు మనదగ్గర కూడా ఈ సీక్వెల్స్‌కు తెరలేపారు. దక్షిణాది వరకూ అలాంటి ప్రక్రియను పరిచయం చేసిన మొదటి వాళ్లలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ప్రస్తావించుకోవాలి. ‘‘మనీ’’ సినిమాకు ‘‘మనీ మనీ’’ అంటూ సీక్వెల్‌ను రూపొందించడంతో నిర్మాతగా ఆసక్తికరమైన అడుగు వేశాడు వర్మ. అయితే ‘మనీ మనీ’ హిట్ కాకపోవడం వల్లనేమో కానీ.. తెలుగులో ఈ సీక్వెల్స్‌కు అంతగా ఆదరణ దక్కలేదు. ఎన్నో హిట్ సినిమాలను రూపొందించిన  తెలుగు ఇండస్ట్రీలో ఆ హిట్ సినిమాకు కొనసాగింపులు తీయడానికి అవకాశం ఉన్నా.. సీక్వెల్స్ ఏవీ రాలేదు.

మరి ‘మనీ’కి సీక్వెల్ పార్ట్ వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయ్యాకా ఇప్పుడు చూసుకొంటే.. అనేక సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. వస్తున్నాయి. అనేక సినిమాలకు సీక్వెల్ ప్రతిపాదనలున్నాయి. కేవలం తెలుగు వరేక కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇప్పుడు సీక్వెల్స్ ఊపందుకొంటున్నాయి. ఒక్క సినిమా హిట్ అయ్యిందంటే దానికి కచ్చితంగా కొనసాగింపు ప్రతిపాదన రానే వస్తోంది. సినిమాలేవీ కల్ట్ హిట్స్ కాకపోయినా.. హిట్టైన సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకొనే ప్రయత్నంగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ పరంపరలో ఇప్పుడు ఎన్నో సినిమాలున్నాయి.

అయితే ఇలాంటి సినిమాల్లో కొన్నింటికి అసలు మొదటి వెర్షన్‌కూ రెండో వెర్షన్‌కు కొన్ని రకాల సంబంధాలు కట్ అవుతున్నాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసిన సందర్భంలో… దానికి ఆయా భాషల్లో ఎక్కడిక్కడ సదరు సబ్జెక్ట్‌కు సీక్వెల్స్ వస్తున్నాయి. ఒరిజినల్‌ను రూపొందించిన వాళ్లూ సీక్వెల్స్ రూపొందిస్తున్నారు. సదరు సబ్జెక్టును రీమేక్ చేసిన వారు కూడా ఒక కొనసాగింపు సినిమాను తీస్తున్నారు. మూలంగా ఉండే సబ్జెక్ట్ విషయంలో ఒకే పాయింట్‌పై ఆధారపడ్డ వీరు కొనసాగింపు వెర్షన్ విషయంలో మాత్రం ఎవరి రూటు వారిదిగా సాగిపోతున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్ అయ్యింది! 

ఉదాహరణకు ఇప్పుడు బాలీవుడ్‌లో ‘‘కిక్-2’’ సినిమాను రూపొందించబోతున్నారు. తెలుగులో హిట్ అయిన ‘కిక్’ను హిందీలో రీమేక్ చేశారు. సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ఆ యూనిట్టే ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తోంది. మరి ఒరిజినల్ ‘కిక్’ సినిమా రైటర్లు తెలుగు వాళ్లు. అయితే హిందీలో మాత్రం మనవాళ్ల ప్రస్తావన లేకుండానే సీక్వెల్ వెర్షన్ రెడీ అయిపోతోంది! అసలుకు హిందీలో ‘కిక్’ సినిమాకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి. అయితే కలెక్షన్ల పరంగా అది అద్భుతాలను సృష్టించింది. దీంతో ఇప్పుడు ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకొనే ప్రయత్నంగా ‘కిక్-2’ని రూపొందిస్తున్నారనుకోవాల్సి వస్తోంది. అంటే ఏదో ఒక కథ అల్లేసి.. కిక్-2 పేరుతో మార్కెటింగ్ చేయడం అన్నమాట! ఇక తెలుగులో కూడా ఒక ‘కిక్-2’ రెడీ అయ్యింది. దీనికీ హిందీ వెర్షన్ ‘కిక్-2’కి సంబంధం లేదు! తెలుగు ‘కిక్’, హిందీ ‘కిక్’ల కథ ఒకటే అయినా.. కొనసాగింపుల్లో మాత్రం ఎవరి కథ వారిదే! 

ఇక తమిళంలో హిట్ అయిన ‘సింగం’ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందిన హిందీ ‘సింఘం’కు అక్కడ కూడా కొనసాగింపు వెర్షన్ వచ్చింది. అయితే దానికీ ఒరిజినల్ ‘సింగం’ రూపకర్తలకూ… హిందీ సీక్వెల్ ‘సింఘం’కు ఏమాత్రం సంబంధం లేదు. అలా హిందీ వాళ్లు తమకు ఇష్టమైనట్టుగా సీక్వెల్‌ను రూపొందించేసుకొన్నారు. ‘సింగం’ పాత్ర అసలు సృష్టికర్తలు అయిన తమిళులు కూడా ‘సింగం-2’ తీశారు. అయితే దానికీ హిందీ సీక్వెల్ వెర్షన్‌కు సంబంధం లేదు! ఇక్కడ కూడా ఎవరి సీక్వెల్ వారిదే.

ఇప్పుడు ‘గబ్బర్ సింగ్-2’ అలియాస్ ‘సర్ధార్’ విషయంలో కూడా అదే జరుగుతోంది కదా. బాలీవుడ్ సినిమా ‘దబాంగ్’ను ఆధారంగా చేసుకొని ‘గబ్బర్‌సింగ్’ను రూపొందించారు. ఇప్పుడు గబ్బర్ సింగ్‌కు కొనసాగింపు సినిమాను తీస్తున్నారు. దీనికీ బాలీవుడ్ యూనిట్‌కు సంబంధం లేదు. బాలీవుడ్‌లో ఇప్పటికే ‘దబాంగ్-2’ వచ్చింది. అయితే సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందిన ఆ సినిమాకూ ఇప్పుడు తెలుగు వెర్షన్ దబాంగ్‌కు కొనసాగింపుగా పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న సినిమాకూ కథ, కథనాల విషయంలో ఎలాంటి సంబంధమూ లేదు! ఎవరి సీక్వెల్ వారిదే అన్నమాట!

మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేశాకా.. ఒరిజినల్ నిర్మాతలు దానికి సీక్వెల్ తీస్తే.. తొలి పార్ట్‌ను రీమేక్ చేసిన వారు సీక్వెల్‌ను కూడా రీమేక్ చేసేయడం ఇది వరకూ జరిగింది. హిందీలో ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ హిట్ అయ్యే సరికి దాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందించారు. ఆ తర్వాత హిందీలో ‘లగేరహో మున్నాభాయ్’ అంటూ సీక్వెల్‌రాగా.. దాన్ని కూడా తెలుగులో రీమేక్ చేశారు! సీక్వెల్ పార్ట్‌ను యథాతథంగా రీమేక్ చేస్తూ దానికి ‘శంకర్ దాదా జిందాబాద్’ అంటూ నామకరణం చేశారు. మరి నయా సీక్వెల్ యుగంలో మాత్రం ఈ తరహా ప్రక్రియ లేదు. హిట్టైన సినిమా సిగ్నేచర్‌ను ఉపయోగించుకొంటూ ఎవరికి వారు సినిమాలు తీసుకొంటూ పోతున్నారు.

ఈ తరహా విధానానికి మూల పురుషుడు ఎవరు అంటే.. దానికి మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ పేరును చెప్పాలి. ఎందుకంటే.. ఒక సినిమాను రీమేక్ చేసి.. ఒరిజినల్ వెర్షన్‌తో సంబంధం లేకుండా దానికి సీక్వెల్‌ను రూపొందించిన ఘనత ఈ దర్శకుడికి ఉంది. మలయాళంలో హిట్టైన ‘రామ్ జీ రావ్ స్పీకింగ్’ సినిమాను హిందీలో ‘హేరా ఫెరీ’గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ‘హేరాఫెరీ’కి సీక్వెల్‌గా ‘ఫిర్ హేరేఫెరీ’ అంటూ మరో హిట్ కొట్టాడు ఈ దర్శకుడు. ఒరిజినల్ వెర్షన్‌కు ఎలాంటి సీక్వెల్ లేకపోయినా.. దానికి తను ఒక కొనసాగింపు కథను అల్లాడు ప్రియదర్శన్. అలాంటి తీరుతోనే ఇప్పుడు అనేక మంది దర్శక, నిర్మాతలు చెలరేగిపోతున్నారు. ఎవరో సృష్టించిన పాత్రలను తాము ఆడిస్తూ.. కాసుల పంట పండించుకొంటున్నారు.