బస్సు కన్నా, రైలు భద్రం అనుకుంటారంతా. అందులో నిజం కూడా వుండవచ్చు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారికన్నా, రైలు ప్రమాదాలలో చనిపపోయే వారి సంఖ్యే ఎక్కువ వుంటుంది. భారతీయ రైళ్ళలో రోజుకి 1.0 కోట్ల మంది ప్రయాణం చేస్తుంటారు. కానీ రైలు ప్రమాదాల్లో సగటున ఏటా 300 నుంచి 400 మంది చనిపోతుంటారు. ఈ సంఖ్య కూడా ఎక్కువే. అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించ వచ్చు. అభివృధ్ధి చెందిన దేశాలలో ఈ ప్రమాదాలను దాదాపు నివారించగలిగారు. మన దేశాన్ని మాత్రం ఈ ప్రమాదాలు వెంటాడుతూనే వున్నాయి.
ఈ మధ్య ఒకే రోజు కొన్ని నిమిషాల తేడాలో ఒకే రాష్ర్టం(మధ్యప్రదేశ్)లో రెండు రైళ్ళు ఘోరమ్రాదాలకు గురయ్యాయి. ఒకటి: ముంబయి వెళ్ళే జనతా ఎక్స్‌ప్రెస్. రెండు: వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్‌ప్రెస్. మనుషులు 30 మందివరకూ చనిపోతే, వందల సంఖ్యలో గాయపడ్డారు. కారణం? కాస్సేపు ప్రకృతి మీదకు తోసి వేశారు. వరదల కారణంగా పట్టాలు కొట్టుకు పోయాయి. అయితే వరదలు రైళ్ళు వచ్చినంత వేగంగా రావు. కుండ పోతగా వర్షంగా కురియాలి, నదులూ, వాగులూ నిండిపోవాలి, కట్టలు తెగిపోవాలి. అయితే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు, ఈ వరద నీటి కారణంగా తక్షణప్రమాదం ఎక్కడెక్కడ పొంచి వుందీ అన్నది ‘విపత్తు నిర్వహణ’(డిజాస్టర్ మేనేజ్ మెంట్) లో కీలకం. కానీ ఈ పనిని చేయటంలో ఇటు రైల్వేశాఖ, అటు రాష్ర్ట ప్రభుత్వం కూడా అలసత్వం చూపించింది.
దేశం మొత్తం మీద మార్చాల్సిన రైలు పట్టాలు 15 వేల కిలోమీటర్ల వరకూ వున్నాయి. ఇవి ఇప్పటికీ ఎలా నిలిచాయో ఆశ్చర్యం కూడా. ఈ పట్టాల మీదకు రైళ్ళ కన్నా, ముందు నీళ్ళు వచ్చేస్తే, ప్రమాదం ఎంత తీవ్రమో ఊహించుకోవచ్చు. ఇక రైలు వంతెనల పరిస్థితి కూడా ఇంతకు మించి గొప్పగా లేదు. ఎందుకంటే, నిర్మించి వందేళ్ళు దాటి పోయిన వంతెనలు దేశ వ్యాపితంగా 35 వేల వరకూ వున్నాయి. వీటిని పునర్మించుకోవాల్సిన అవసరం వుంది. వీటి మీదనే రైళ్ళు తిరిగేస్తున్నాయి. మనదేశంలో రైళ్ళ ట్రాఫిక్ అంతా, ఇంతా కాదు. ప్రతీ రోజూ 16 వేళ రైళ్ళు తిరుగుతుంటాయి. అందుకే ప్రపంచం మొత్తం మీద జరిగే రోడ్డు ప్రమాదాలలో 15 శాతం ఇండియాలో జరుతున్నాయి
ప్రమాదాల్లో మరణించేవారిలో ప్రయాణికులతో పాటు, రైల్వే సిబ్బంది కూడా వుంటున్నారు. వీరిలో గ్యాంగ్ మ్యాన్ లు అధికంగా వుంటారు. సగటున ఒక గ్యాంగ్ మ్యాన్ రైలు ప్రమాదంలో చనిపోతున్నారంటే ఆశ్చర్యంగా వుండవచ్చు కానీ, ఇది నిజం. రైల్వే ట్రాక్స్‌లో తన పనిలో తాను నిమగ్నమయినప్పుడు రైళ్ళ రాకపోకలను గమనించక పోవటం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరగుతుంటాయి. అలాగే ప్రమాదకరమైన వంతెనల వద్ద గస్తీ తిరిగే సిబ్బంది చేతుల్లో కనీసం వాకీ, టాకీలు లేక పోవటం వల్ల, సమాచారాన్ని చేరవేయటం కుదరటం లేదు.
అలాగే రైల్వే ప్రమాదాలన్నవి రైళ్ళు పట్టాలు తప్పటం వల్లా, పట్టాలు కొట్టుకోవటం వల్లా, బోగీల్లో అగ్నిప్రమాదాలు సంభవించటం వల్లా, ఎదురెదురుగా వచ్చి ఢీకొనటం వల్లా జరుగుతుంటాయి. అయితే అన్నిటికన్నా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద జరిగే ప్రమాదాలు కూడా గణనీయంగానే వుంటున్నాయి. రైల్వేల భద్రత మీద సిఫారసులు చేసిన కోకోడ్కర్ కమిటీ, ఈ లెవెల్ క్రాసింగ్స్ అనే వి వుండకూడదని తేల్చి పారేసింది. ఇవి వున్న చోట వంతెనలు కిందనుంచో,పైనుంచో నిర్మించటం అనివార్యం అని కూడా చెప్పింది. కానీ దేశం మొత్తం మీద, ఈ లెవెల్ క్రాసింగ్స్ 50 వేల వరకూ వున్నాయి. వీటిలో మనిషి కాపలా లేని (అన్ మాన్డ్) లెవెల్ క్రాసింగ్స్ 17వేల వరకూ వున్నాయి. వీటన్నిటినీ పునర్మించుకోవటం ఎలా వున్నా, కనీసం ఈ 17 వేల క్రాసింగ్స్‌లో కాపలా పెట్టుకునే స్థితిలో కూడా భారతీయ రైల్వేలు లేవు.
అలాగే సిగ్నలింగ్, అలాగే ఢీకొనే పరిస్థితి వచ్చినప్పుడు రైళ్ళు తమంతట తాము ఆగిపోయే కొలిజన్ అలార్మింగ్ సిస్టమ్‌ను ఇంకా మనం ప్రవేశ పెట్టుకోలేక పోయాం. కానీ వేగవంతమైన రైళ్ళు మన పట్టాల మీద ప్రవేశ పెట్టుకోవాలన్న ఆకాంక్షను, విధిగా తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతీ రైల్వే మంత్రీ చేస్తూనే వుంటారు. నిజానికి కకోడ్కర్ కమిటీ శిఫారసులను అమలు చేస్తే, భద్రతకు భద్రతా, ఆదాయానికీ ఆదాయం, రెండూ వుంటాయి. ఉదాహరణకు లెవెల్ క్రాసింగ్స్ ను తీసివేస్తే, రైల్వేల వేగాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎలా చూసినా మొత్తం మన రైల్వేలను ఆధునీకరించుకుని, భద్రతను పెంచుకోవటానికి లక్ష కోట్ల రూపాయిల వరకూ అవుతుందని, కకోడ్కర్ కమిటీ అంచనా. ఇప్పటికయినా రాజకీయాలను అవతల పెట్టి, కేంద్రం రైల్వేలను మెరుగు పరిచే ప్రయత్నానికి పూనుకోవాల్సి వుంది.
సతీష్ చందర్