ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగువాళ్లకి నచ్చే అంశాలు మూడే- సినిమా, రాజకీయం, కులం. ఈ త్రివేణీసంగమంలో సినిమా, రాజకీయం కబుర్లు పైకి కనిపించేలా ఓపెన్ గా మాట్లాడుకుంటునా మూడోదైన కులం ప్రస్తావన మాత్రం అంతర్వాహినిగా పారుతుంటుంది.
మనం ఏ రంగంలోనూ ఏమీ పీకలేకపోయినా “మనోడు” ఏ రంగంలోనైనా ఏదైనా సాధిస్తే చాలు అదొక తుత్తి..వాడే కనుక మనకి నచ్చని కులానికి చెందినవాడైతే “ఏడ్సాడులే”..అని అయిష్టత పెంచుకోవడం, ఇంకాస్త తీరికుంటే ద్వేషం కూడా పెంచుకోవడం. ఆ విజయం వల్ల అతనికో అమెకో వస్తున్న పేరుని, డబ్బుని, అవార్డుల్ని, ఆస్తుల్ని చూసి కుళ్లుకోవడం..ఇదే మన జాతిలో ఒక వర్గం చేసే పని.
నిజంగానే చచ్చేవరకు ఏ పనీ లేక తీరికగా కూర్చున్న జనాలే ఇలా కులాల ఈకలు పట్టుకుని పీక్కుంటూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఆ దరిద్రం వాళ్ల మెదళ్ల వరకు ఉంటే నష్టం లేదు. కానీ సోషల్ మీడియాలో కక్కుతున్నప్పుడే చిరాకొస్తుంది. అదొక అంటువ్యాధిలాగ తిన్నగా ఉన్నవాళ్ళని కూడా అంటుకుని బుర్రలు చెడగొడుతుంది.
ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు రజిత పతకం గెలుచుకున్న వెంటనే తెలుగువాళ్లు అత్యధికంగా గూగుల్ లో సర్చ్ చేసిన విషయం ఆమె కులమేమిటని. అప్పడు పాపం చాలామందికి సమాధానం దొరికినట్టు లేదు. అందుకే మళ్లీ తాజాగా ఐదేళ్ల తర్వాత టోక్యోలో ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నప్పుడు కూడా అదే పని చేసారట. ఈ వార్తని ఏకంగా జాతీయమీడియా ప్రకటించింది…అలా మన సిగ్గుమాలిన తనాన్ని దేశవ్యాప్తం చేసుకున్నాం.
పీవీ సింధు ఎన్ని మ్యాచులాడింది? ఎలా గెలిచింది? ఆమె వరల్డ్ వైడ్ ర్యాంక్ ఎంత? ఈ ప్రశ్నలు ఎవ్వడూ అడగలేదు గూగుల్లో. ఆమె కులం గురించిన సర్చ్ సడెన్ గా 700% పెరిగిందట నిన్నొక్కొరోజూను!
ఆమెది ఫలానా కులం కాబట్టి ఫలానా ముఖ్యమంత్రి ఫలానా నగదు బహుమతి ఇచ్చాడు. ఆమెది ఫలానా కులం కాబట్టి ఫలానా ముఖ్యమంత్రి ఆమెకేమీ ఇవ్వడు. ఆమెది ఫలానా కులం కాబట్టే ఆమెకి పద్మశ్రీ అవార్డు రావడానికి లాబీయింగ్ ఈజీ అయ్యింది. ఇవే సోది కబుర్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
సింధుకంటే నాల్రోజుల ముందు బాక్సింగులో మణిపూర్ కి చెందిన మీరా ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. మరి ఆమె కులాన్ని ఎవరూ సర్చ్ చెయ్యలేదెందుకో. ఎందుకంటే, ఆవిడ తెలుగావిడ కాదు కాబట్టి..బతికిపోయిందంతే.
సానా సతీష్ కుమార్