పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం మొదలైంది

ప్రస్తుతానికైతే సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నది భారత ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటన. కానీ, అనధికారికంగా యుద్ధం మొదలైపోయింది. ఈ యుద్ధం కార్గిల్‌ యుద్ధంలా కొన్ని రోజులపాటు జరిగి, ఆగిపోతుందా.? లేదంటే, పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందా.?…

ప్రస్తుతానికైతే సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నది భారత ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటన. కానీ, అనధికారికంగా యుద్ధం మొదలైపోయింది. ఈ యుద్ధం కార్గిల్‌ యుద్ధంలా కొన్ని రోజులపాటు జరిగి, ఆగిపోతుందా.? లేదంటే, పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందా.? యుద్ధ వార్తల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలిపోయాయి. 

దేశవ్యాప్తంగా మెజార్టీ ప్రజానీకం, పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధాన్ని ప్రకటించాలనే కోరుకుంటున్న మాట వాస్తవం. అయితే, యుద్ధం తదనంతర పరిణామాలపై కొంత ఆందోళన వుందన్నదీ వాస్తవం. కానీ, యుద్ధం అనివార్యంగా మారిపోయిందిప్పుడు. పదే పదే, పాకిస్తాన్‌ సైన్యం, తీవ్రవాదులు పురిగొల్పి దాడులు చేయిస్తుండడంతో, ఇంకా సయమనం పాటించడం చేతకానితనమే అవుతుందన్న నిర్ణయానికి భారత్‌ వచ్చినట్లే కన్పిస్తోంది. 

దౌత్యపరమైన యుద్ధం ఇప్పటికే ప్రకటించేశాం. ఆ యుద్ధంలో భారత్‌దే పైచేయి అయ్యింది. దౌత్య యుద్ధంలో పాకిస్తాన్‌ దాదాపుగా ఓడిపోయింది. అయినాసరే, సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం కాల్పులు ఆగడంలేదు గనుక, ముందస్తుగా తీవ్రవాదుల్ని ఏరిపారేసే కార్యక్రమం పీవోకేలో భారత్‌ చేపట్టింది. ఈ క్రమంలో కొందరు పాక్‌ సైనికులు కూడా చనిపోయారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇంకేముంది, పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తెరమీదకొచ్చారు. 'మేం సహనం పాటిస్తున్నాం, భారత్‌ మాపై దాడికి దిగితే ఊరుకోం..' అంటూ హెచ్చరికలు జారీ చేసేశారు. అంతర్జాతీయ సమాజం అన్నీ చూస్తోందని సెలవిచ్చారు నవాజ్‌ షరీఫ్‌. 

నిజమే, అంతర్జాతీయ సమాజం అంతా చూస్తోంది.. పాకిస్తాన్‌ తీవ్రవాదుల్ని ఎలా పెంచి పోషిస్తున్నదీ, పాకిస్తాన్‌ సైన్యం తీవ్రవాదులకి ఎంతగా మద్దతిస్తోన్నదీ అమెరికా తాజా హెచ్చరికలతోనే స్పష్టమయిపోయింది. వాస్తవానికి, అమెరికా నుంచి భారత్‌కి సపోర్ట్‌ లభించిన మరుక్షణమే 'సర్జికల్‌ స్ట్రైక్స్‌'ని భారత్‌ చేపట్టిందని భావించొచ్చు. అయితే, అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే చైనా, తాము పాకిస్తాన్‌కి యుద్ధంలో సహకరించబోమని చెప్పాక సర్జికల్‌ స్ట్రైక్స్‌ అనధికారికంగా ప్రారంభమయ్యాయనే వాదనలూ లేకపోలేదు. 

తాడో పేడో తేల్చుకునే పరిస్థితి బహుశా 'యుద్ధం తలెత్తినా' వుండకపోవచ్చన్నది రక్షణ రంగ నిపుణుల వాదన. కారణం, రెండూ అణ్వాయుధాల్ని కలిగి వున్న దేశాలే. పైగా, పలుమార్లు జరిగిన యుద్ధాల కారణంగా భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ చావు దెబ్బతిని వుండడంతో, ఇకపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకపోవచ్చు. ప్రధానంగా పీవోకేపైనే సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన దరిమిలా, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్‌ బుకాయించడానికీ అవకాశాలు తక్కువే. 

కొసమెరుపు: సరిహద్దుల్లోని రాస్ట్రాల ముఖ్యమంత్రులకు భారత హోంశాఖ 'సర్జికల్‌ స్ట్రైక్స్‌'పై సమాచారమివ్వడం గమనార్హం. అదే సమయంలో, ఈ రోజు మధ్యాహ్నం అఖిలపక్ష భేటీ నిర్వహించి, సర్జికల్‌ స్ట్రైక్స్‌తోపాటు పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ఓ ప్రకటన చేసే అవకాశం వుంది.