చంద్రబాబు, వైఎస్ జగన్‌ని విమర్శిస్తే.. వైఎస్సార్సీపీ నేతలు స్పందిస్తారు. వైఎస్ జగన్, చంద్రబాబుపై మండిపడితే టీడీపీ ఎదురుదాడికి దిగుతుంది. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు.. ఇలా ఏ పార్టీని తీసుకున్నా, తమపై వచ్చే విమర్శలకు సమాధానమిస్తూ ఎదురుదాడి చేయడం సహజాతి సహజం. రాజకీయాల్లో ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం వుండాలి. విమర్శలకు స్పందన కూడా వుండి తీరాలి. అది లేకపోతే, అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది.?
మరి, పవన్‌కళ్యాణ్ విషయంలో ఎందుకలా జరగదు.! సమాధానం సింపుల్.. ఆయన రాజకీయం చేయడు.. పవనిజం చూపిస్తాడు. పవనిజం అంటే అభిమానులు ఫీలయ్యేది కాదు. ఇదో ఇజం.. వెరైటీ ఇజం. రాజకీయాల్లో వున్నా, సినిమాల్లో వున్నా, పవన్‌కళ్యాణ్ రూటే సెపరేటు. ఆయనంతే, ఆయన ఏక్ నిరంజన్. పవన్‌కళ్యాణ్‌కి సంబంధించి ఏ విషయమైనా ఆయనే మాట్లాడాలి.
పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం విషయమే తీసుకుందాం. అసలు ఆ సినిమా పరిస్థితేంటో తెలియదు. దర్శకుడు డాలీ పెదవి విప్పడు. నిర్మాత శరద్‌మరార్ స్పందించడు. అఫ్కోర్స్, పవన్‌కళ్యాణ్ మూడ్ ఏంటో వారికే అర్థం కానప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు.? సినిమాల్లో పవన్‌కళ్యాణ్ 'ఇజం' ఇలాగే వుంటుంది. అదే పవనిజం.. అనుకుంటే, ఏం చేయగలం.!
సినిమాల్లో ఏం చేసినా చెల్లిపోతుందని పవన్‌కళ్యాణ్ అనుకుంటుంటారు. ఎందుకంటే, ఏం చేసినా ఆయనకు స్టార్డమ్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద అతని సినిమాలకు డోకా ఏమీ లేదు. హిట్టయినా, ఫట్టయినా.. తదుపరి సినిమాకి అంచనాలు ఆకాశాన్నంటేలానే వుంటాయి. దటీజ్ పవన్‌కళ్యాణ్. చూసీ చూసీ నిర్మాతకు విసుగొస్తే ఇంకో హీరోని చూసుకుంటాడు. దర్శకుడూ తన దారి తాను చూసుకోడానికి వీలుంటుంది. పవన్‌కళ్యాణ్‌కి ఎటూ సినిమాలే చేయాలని వుండదు గనుక, చేస్తే చేస్తాడంతే. అందుకే సినీ రంగంలో ఆయన ఏక్ నిరంజన్ అయ్యాడు మరి.
రాజకీయాల్లోనూ అలాగే వుంటానంటే ఎలా.? పవన్‌కళ్యాణ్‌ని నిన్నటిదాకా కాస్త సమర్థించిన వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఇప్పుడు ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్తున్నారు. మామూలుగా అయితే మీడియా పవన్‌కళ్యాణ్ వద్దకు వెళ్ళి ఏంటి స్పందన.? అని అడిగెయ్యాలి. కానీ, అక్కడున్నది పవన్‌కళ్యాణ్ కదా. ఆయన చిక్కడు దొరకడంతే. మౌనం అర్ధాంగీకారం.. అంటారు. ఈ లెక్కన, విమర్శలన్నిటినీ పవన్ నిజమేనని ఒప్పుకున్నట్లే భావించాలేమో.
చిత్రమేంటంటే, ఇక్కడ అభిమానులూ పవన్‌కి మద్దతుగా మాట్లాడేందుకు ముందుకు రావడంలేదు. ఎందుకొస్తారు.? ఎలా వస్తారు.? అసలు పవన్ 'ఇజం' ఏంటో వాళ్ళకైనా తెలిస్తే కదా.! ఈ కష్టం పగవాడిక్కూడా వద్దు మొర్రో.. అనుకుంటున్నారు కొందరు అభిమానులు. షరామామూలుగానే పవనిజంలో ఊగిపోయే ఇంకొందరు అభిమానులు మాత్రం, 'మా ఏక్ నిరంజన్ ఏం చేసినా గ్రేటే..' అంటూ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తూనే వున్నారు.
ఏక్ నిరంజన్.. ఏక్ దిన్ కా వండర్.. ఆ ఏక్ దిన్.. ఎప్పుడన్నది ఆయనకి మాత్రమే తెలుసు. ఎనీ డౌట్స్.?