కొద్దికాలంగా మొబైల్ రంగాన్ని సునీల్ భారతి మిత్తల్ నడిపే ఎయిర్‌టెల్ (26 కోట్లు), సునీల్ సూద్ నడిపే ఓడాఫోన్ (20 కోట్లు), కుమార మంగళం బిర్లా నడిపే ఐడియా సెల్యులార్ (18 కోట్లు) ఏలుతున్నాయి. వారి ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ముకేశ్ అంబానీ రిలయన్సు జియో పేరుతో మూడేళ్లగా పోరాటం చేస్తున్నాడు. అత్యాధునికమైన టెక్నాలజీతో, భారతదేశమంతా విస్తరించిన నెట్‌వర్క్‌తో, అతి తక్కువ కాల్ రేట్లతో, అతి ఎక్కువ స్పీడుతో, నాణ్యతతో మార్కెట్‌ను వశపరుచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే అప్పులతో సతమతమవుతూ, కొత్తగా పెట్టుబడులు పెట్టలేని స్థితిలో వున్న ఆపరేటర్లు జియో మార్కెట్టులోకి వస్తే తాము కుదేలయిపోతామని భయపడుతున్నారు. అందువలన దాన్ని అడ్డుకుంటూ వచ్చారు. జియో తాము ట్రయల్ రన్ చేస్తున్నామంటూ 15 లక్షల మందికి ఫోన్లు యిచ్చి ఎలా పనిచేస్తున్నాయో చూడమంది. కానీ దానిలో 65% మంది సరిగ్గా పని చేయటం లేదని, కాల్స్ ఫెయిలవుతున్నాయని ఫిర్యాదు చేశారు. దానికి కారణం వుంది.
మన వద్ద ఎయిర్‌టెల్ కనక్షన్ వుంటే అవతలి వాళ్ల దగ్గర కూడా ఎయిర్‌టెల్లే వుండాలని లేదు కదా. ఓడాఫోన్ వుందనుకోండి. ఇద్దరు ఆపరేటర్ల మధ్య ఇంటర్‌కనక్షన్ వుంటేనే మన కాల్ అవతలివాళ్లకు వెళుతుంది. దాని కోసం యిద్దరు ఆపరేటర్ల మధ్య ఒక ఒప్పందం వుండాలి. మొదటి ఆపరేటరు సామగ్రి, యిన్‌ఫ్రాస్ట్రక్చర్ వినియోగించుకున్నందుకు రెండో ఆపరేటరు మొదటి ఆపరేటరుకు చార్జి చెల్లించాలి. కొత్తగా ఎవరైనా ఆపరేటరు మార్కెట్లోకి వస్తే సహజంగా ఆ కంపెనీ నుంచి వెళ్లే కాల్స్ కంటె వచ్చే కాల్స్ యిబ్బడిముబ్బడిగా వుంటాయి. అందువలన వాళ్లు పాతవాళ్లకు చెల్లించవలసిన చార్జిలకై ఎక్కువ ఖర్చవుతుంది. ఈ చార్జిలను ఇంటర్‌కనక్షన్ యూసేజ్ చార్జెస్ (ఐయుసి) అంటారు. రిలయన్సు జియో మార్కెట్లోకి కొత్తగా వస్తోంది కాబట్టి యీ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయసాగింది. రిలయన్సుకు మరింత సన్నిహితులైన ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 మార్చిలో ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) యీ చార్జీలను 20 పైసల నుండి 14 పైసలకు తగ్గించింది. ఈ ధరలను 2017-18 సం||లో మళ్లీ సమీక్షిస్తానంది. ఇది రిలయన్సు లబ్ధి కోసమే చేసిన మార్పు అని గ్రహించిన ఆపరేటర్లు జియో కస్టమర్లకు ఇంటర్‌కనెక్టివిటీ సరిగ్గా యివ్వలేదు. అందుకే జియో కస్టమర్లకు కాల్స్ ఫెయిలయ్యాయి.
ఈ విషయమై జియో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ట్రాయ్‌పై ఒత్తిడి తెచ్చింది. అంతే జియోకు మరింత మేలు చేయడానికి అసలు చార్జీలే లేకుండా ఫ్రీ యింటర్‌కనెక్టివిటీ వుండాలని సూచిస్తూ ట్రాయ్ ఆగస్టులో ఒక కన్సల్టేషన్ పేపరు విడుదల చేసింది. 2017 తర్వాత చేయవలసిన సమీక్షను యిప్పుడే చేపట్టడం, చార్జీలను సాంతం ఎత్తివేయడం అన్యాయమని ఆపరేటర్లు భావించారు. తమ ఖర్చుతో తాము నిర్మించుకున్న సామగ్రి నుంచి సేవలు జియోకు ఉత్తినే అందించాలనడం ఏ విధంగా సమంజసమని వారి వాదన. తక్కువ ధరలతో జియో ప్రజల్లోకి దూసుకుపోతుంది. దానికి కాల్స్ చేసుకునేందుకు ఖఱ్చును వీరు భరించాలి. పైగా ట్రయల్ రన్ అంటే ఏకంగా 15 లక్షల మందికి సేవలందించడమేమిటి, యిది పూర్తి స్థాయి కమ్మర్షియల్ సర్వీసెస్ కాక మరేమిటి? లైసెన్సు రాకుండానే యింతమందికి ఎలా అందిస్తారు? అని ప్రశ్నలు సంధించారు.
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఏఐ) ప్రస్తుత దిగ్గజాల చేతిలోనే వుంది. జియో పట్ల ట్రాయ్ పక్షపాతం చూపుతోందని, దానికి అనుగుణంగా నిబంధనలు మారుస్తోందని వారు ఆ అసోసియేషన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దాని కాపీని డిపార్టుమెంట్ ఆఫ్ టెలికామ్ (డాట్)కు కూడా పంపారు. జవాబుగా జియో 'పాత వాళ్లు గూడుపుఠాణీ చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, తమకు తగినంత ఇంటర్-కనెక్ట్ యివ్వటం లేదని' ఆరోపించింది. తాము 15 లక్షల మందికి సేవలందించడం నియమనిబంధనలకు అనుగుణంగా వుందంటోంది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిస్తూ ట్రాయ్ 'కన్సల్టేషన్ పేపరులో వున్నవి సూచనలు మాత్రమే, అమలు చేయడానికి ఆరేడు నెలలు పడుతుంది' అంటోంది. జియో యీ డిసెంబరులో మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. అది జనాలకు చేరేసరికి యీ ఉచిత సర్వీసు అందివస్తుంది.
ఇలా ప్రభుత్వం యిస్తున్న మద్దతు ఒకవైపు. మరో వైపు వీలైనంత త్వరగా 10 కోట్ల మంది యూజర్ల లక్ష్యంగా రూ. 1.34 లక్షల కోట్లతో నెట్‌వర్కు ఏర్పాటు చేసుకుంది. 4 జి సేవలను వాణిజ్యపద్ధతిలో ప్రారంభిస్తోంది. మైక్రోమ్యాక్స్, పానాసోనిక్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని దాని యూజర్లతో పాటు, తన సిబ్బందికి 3 నెలల పాటు ఉచిత వినియోగం కల్పిస్తూ తన కస్టమర్ బేస్‌ను కోట్లలోకి తీసుకుపోతోంది. ఇది చూసి భయపడిన ఎయిర్‌టెల్, ఓడాఫోన్, ఐడియా సెల్యులార్ తమ డేటా చార్జీలను 67% వరకు తగ్గించాయి. జియో పోటీ తట్టుకునేందుకు వీటిలో రెండు విలీనం కావచ్చనే పుకారు కూడా వుంది. ఎయిర్‌సెల్, ఆర్‌కామ్, జియోలో విలీనం కావచ్చు. ఇలా సెల్‌ఫోన్ మార్కెట్లో చిన్న ఆటగాళ్లు మార్కెట్‌నుండి వైదొలగి, పెద్దవే మిగలవచ్చు. మరో నెలలో అతి పెద్ద స్పెక్ట్రం వేలానికి రాబోతోంది. దానిలో ముకేశ్ అంబానీతో పోటీ పడగల వారెవరూ కనబడటం లేదు. టెలికాం రంగంలో ముకేశ్ మోనోపలీకి యివన్నీ దారి తీస్తున్నాయి. మోనోపలీ ఏర్పడడం శుభసూచకం కాదు. పోటీదారులు లేకపోవడం చేత ఆ తర్వాత ధరలు పెంచినా, సేవల నాణ్యత తగ్గినా అడిగే దిక్కుండదు, వినియోగదారులకు ప్రత్యామ్నాయం వుండదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)