ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధినేత. ఆ అధినేతను భారతదేశానికి తీసుకొచ్చింది ఎగిరే శ్వేత సౌదం ఎయిర్‌ఫోర్స్ వన్. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, మూడు రోజుల భారత పర్యటనను ముగించుకుని, సౌదీ అరేబియాకి పయనమయ్యారు కాస్సేపటి క్రితం.
ప్రధాని మోడీ ఘనంగా వీడ్కోలు పలకడంతో, పాలం వైమానిక స్థావరం నుంచి ఒబామా, ఎగిరే శ్వేత సౌధం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సౌదీకి బయల్దేరారు. వెళుతూ వెళుతూ, భారత సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి నమస్కరించి, ఆ తర్వాత తనదైన స్టయిల్లో చేతిని గాల్లో ఊపి అశేష భారతావనికి బైబై చెప్పేశారు. వాస్తవానికి ఒబామా భారత పర్యటనలో తాజ్‌మహాల్‌ని సందర్శించాల్సి వున్నా, పర్యటనను కుదించుకున్నారు. ఇటీవలే మరణించిన సౌదీ రాజు అంత్యక్రియల్లో ఒబామా దంపతులు పాల్గొననున్నారు.
ఇక, భారత పర్యటన తనకు చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొంటూ, భారత్‌కి అమెరికా భాగస్వామి.. అంటూ చాలా ‘పెద్ద స్నేహహస్తం’ అందించారు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని కొనియాడడం, అమెరికా ప్రజలకు యోగాను పరిచయం చేసింది భారతదేశమేనని చెప్పడం.. ఇవన్నీ భారత్ అమెరికా మధ్య మైత్రీ బంధం పెరిగిందనడానికి నిదర్శనాలుగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.