పీఠాలెక్కినోళ్లంటే పదవుల్లో ఉన్నవాళ్లని అర్థం. పదవులంటే మంత్రి పదవులే కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పదవుల్లో ఉన్నవారే. ప్రజాప్రతినిధిగా ఉండటమంటే పదవిలో ఉన్నట్లే లెక్క. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారంతా గొప్పవారు కాదు. సంపూర్ణ జ్ఞానవంతులు కాదు. వారికి అన్ని తెలుసని అనుకోకూడదు. కాని వారు అనుకుంటారు తమకు అన్ని తెలుసునని. నిజానికి సామాన్యులకు తెలిసిన విషయాలు కూడా వారికి తెలియవు. ఏ రంగంలో ఉండేవారు ఆ రంగంలో రాణించాలంటే కొంత నేర్చుకోవాలి. నిజానికి కొంత కాదు. నిరంతరం నేర్చుకోవాలి. కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారికి చట్ట సభల గురించి ప్రాథమిక విషయాలు తెలియాలి. సభలో ఎలా వ్యవహరించాలి? ఎలా మాట్లాడాలి? తెలియాలి. విధివిధానాలు తెలుసుకోవాలి. అందుకే ఎన్నికలు కాగానే పార్టీల తరపున, ప్రభుత్వాల తరపున కొత్తగా ఎన్నికైన ప్రజాపత్రినిధులందరికీ (ఎంపీలు, ఎమ్మెల్యేలు) మూడు రోజులో, నాలుగు రోజులో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం నిర్వహించే శిక్షణ తరగతులకు అన్ని పార్టీల కొత్త ప్రజాప్రతినిధులు హాజరవుతారు. పార్టీలు నిర్వహించే శిక్షణ తరగతులకు ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవుతుంటారు. సీనియర్లు, చట్టసభల్లో అనుభవాలతో తలపండినవారు క్లాసులు తీసుకుంటారు. ఒక్కోసారి రిటైర్డు లేదా పదవుల్లో ఉన్నతాధికారులు కూడా కొన్ని అంశాలు బోధిస్తారు.
తాజాగా నాగార్జున సాగర్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. నిజానికి ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులేక ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించాలి. కాని ఆయన తన నరిపాలన ఏడాది పూర్తికావొస్తున్న దశలో నిర్వహించారు. చాలాకాలం క్రితమే కేంద్రంలో ఎంపీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అధికారంలో ఉన్న భాజపా కూడా తన సభ్యులకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించింది. ఇందులో లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైన ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఇందులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రజాప్రతినిధులకు ఉపయోగపడే అనేక విషయాలు తెలియచెప్పారు. అయితే ఈ శిక్షణ తరగతుల వల్ల ప్రజాప్రతినిధులు ఏమైనా నేర్చుకుంటున్నారా? అంటే శూన్యమనే చెప్పాలి. పీఠాలెక్కిన తరువాత పాఠాలు నేర్చుకునేదేమిటి? అనే భావన ప్రజాప్రతినిధుల్లో ఉంది. చట్టసభల్లో ఎలా మసలుకోవాలో, ఎలా మాట్లాడాలో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ప్రజాసమస్యలపై లేదా చర్చనీయాంశాలపై అధ్యయనం చేసి సభకు రారు. కేవలం అరిచి గోల చేయడానికి, సభా కార్యక్రమాలు జరగకుండా చూడటానికే సభకు వస్తారు.
ఏపీ శిక్షణ తరగతుల్లో వెంకయ్య నాయుడు చాలా మంచి విషయాలు చెప్పారు. చట్ట సభల్లో ఉన్న గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని, ఉద్దండులైన పార్లమెంటేరియన్లు (చట్టసభల సభ్యులు) ఎలాంటి ప్రసంగాలు చేశారో, వారు ప్రజా సమస్యలను ఎలా ఫోకస్ చేశారో అధ్యయనం చేయాలన్నారు. తన ఎదుగుదలకు ఇలాంటి అధ్యయనం దోహదం చేసిందన్నారు. సభల్లో హుందాగా ఉండాలని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా వ్యవహరించాలిగాని సభ వాయిదా పడేవిధంగా అరిచి గోల చేయకూడదని అన్నారు. సభ వాయిదా పడేలా చేసినందువల్ల అది ప్రభుత్వానికే లాభమని, ప్రజా సమస్యలపై జవాబులు చెప్పకుండా తప్పించుకునే అవకాశం దానికి దొరుకుతుందని చెప్పారు.. సభ వాయిదా పడేలా వ్యవహరించడమంటే, సభా కార్యక్రమాలు సజావుగా జరగకుండా చేయడమంటే ప్రభుత్వానికి సహకరించినట్లేనన్నారు. ఇది వాస్తవమే. చట్టసభలు సజావుగా జరగకపోవడంవల్ల ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగడంలేదు.పార్లమెంటు, అసెంబ్లీ సెషన్లు పూర్తిగా జరగని సందర్భాలు చాలా ఉన్నాయి. సభలు జరగకపోతే చర్చ జరగకుండానే కొన్ని బిల్లులు ఆమోదం పొందినట్లుగా ప్రకటిస్తారు. ఇలా అనేక బిల్లులు గిలిటెన్ అవుతుంటాయి.
చట్ట సభల్లో తమ సమస్యలు వినిపించడానికే ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. కాని వారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం కృషి చెయ్యడానికి బదులుగా గందరగోళం సృష్టించి సభను వాయిదా వేయించి ఇళ్లకు వెళుతున్నారు. ఒక్క రోజు పార్లమెంటు నిర్వహణకు కోట్లు ఖర్చవుతే, అసెంబ్లీకి లక్షల్లో ఖర్చవుతుంది. మొత్తం సమావేశాల నిర్వహణకు ఎన్ని కోట్లు ఖర్చవుతున్నాయో తెలుసుకుంటే బాధ కలుగుతుంది. ప్రజా సమస్యలు చర్చకు రాని సభల నిర్వహణకు ఇంత ఖర్చు అవసరమా అనిపిస్తుంది. సభ్యులు ప్రజాసమస్యలను ప్రస్తావించినా, ప్రస్తావించకపోయినా, గోల చేసినా, గందరగోళం సృష్టించినా ఏం చేసినా సరే వారి అలవెన్సులు వారికి వస్తాయి. వారి జీతాలు వారికి వస్తాయి. కాని అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఏపీ శిక్షణ తరగతుల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సినిమా నటి రోజా మొదటి వరుసలోనే కూర్చుని వెంకయ్య నాయుడు, ఇతరలు ప్రసంగాలను చిరునవ్వుతో విన్నారు.
ఆమెకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఇంత విన్నతరువాత కూడా ఆమె అసెంబ్లీలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలని శిక్షణ తరగతుల్లో చెబితే ఆమె అలవోకగా బూతులు మాట్లాడారు. వీరంగం వేశారు. ముఖ్యమంత్రిని సైతం దుర్భాషలాడారు. ఆమె తీరు చూసి వైకాపా ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయారు. ఇలాంటివారు శిక్షణ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నట్లు? రోజా ఒక ఉదాహరణ మాత్రమే. చట్టసభల్లోని గ్రంథాలయాలను ఎవ్వరూ ఉపయోగించుకోవడంలేదనేది వాస్తవం. అటువైపు కూడా వెళ్లనివారు చాలామంది ఉన్నారు. ఈ విషయం అనేకసార్లు స్పీకర్లు, ఇతర నాయకులు చెప్పారు కూడా. చాలామంది ప్రజాప్రతినిధులు ‘రూల్స్ బుక్’ చదవరు. నిబంధనలు తెలుసుకోరు. బడ్జెటును ఎంతమంది అధ్యయనం చేస్తున్నారు? బడ్జెటుపై గట్టిగా మాట్లాడమంటే నోరెళ్లబెట్టే ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేకమంది ఉన్నారు. ఒకప్పుడు చట్టసభల్లో కొందరు ప్రతిపక్ష నాయకుల ప్రసంగాల కోసం, చర్చల కోసం ముఖ్యమంత్రులు, అధికారపక్షం నాయకులు ఎదురుచూసేవారు. వారి విమర్శలను పాఠాలుగా భావించేవారు. ప్రతిపక్ష నాయకుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించేవారు. ఇప్పుడు అంత స్పోర్టివ్‌నెస్ ఉందా? అలాంటి వాతావరణం ఎక్కడైనా కనబడుతోందా?
శిక్షణ తరగతుల్లో ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామిక విలువలు గురించి అధికారంలో ఉన్నవారే గొప్పగా బోధిస్తుంటారు. క్లాసులు తీసుకోవడానికి ఇది బాగానే ఉంటుందిగాని ఆచరణలో అంతా రివర్సే. టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విషయాలు బోధించారు. ప్రజాస్వామ్య విలువలపై పాఠాలు చెప్పారు. కాని టీఆర్‌ఎస్ వ్యవహారశైలి, వ్యక్తిగతంగా కేసీఆర్ వైఖరి ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు కూడా ఈ కోవలోకే వస్తారు. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని కేసీఆర్ బోధించారు. కాని ఆయన ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి? ఇతరులకు బోధించే ముందు తాను ఆదర్శంగా ఉండాలి కదా…! తొలి తరం నాయకుల మాటలు, చేతలు ఒకే విధంగా ఉండేవి. కాని ఇప్పుడు మాటలు వేరు. చేతలు వేరు. ‘ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్న ఆత్రయే మాటను నిజం చేస్తున్నారు. చట్ట సభలను చట్టుబండలు చేస్తున్న మన ప్రజాప్రతినిధులకు ఎన్ని శిక్షణ తరగతులు పెట్టినా ఏం ప్రయోజనం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించే విధానం ప్రారంభమైందని కొందరు నాయకులు చెప్పారు. వైఎస్ హయాంలో జరిగిన శిక్షణ తరగతుల్లో అప్పటి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ ‘చాలామంది సభ్యులు సభలో అరుపులు కేకలతో హడావుడి చేయాలని చూస్తారు. అరుపులు, కేకలు బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులకు భాగం కాకూడదు’ అని చెప్పారు. అరుపుల కంటే తెలియనిదానిని నింపాదిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే సభ్యులకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది’ అన్నారు. కాని ఇప్పటి సభ్యులు నేర్చుకోవడానికి ఎంతమాత్రమూ ఇష్టపడటంలేదు.
మేనా