మరో రెండు సంవత్సరాల్లో దర్శకుడిగా భారతి రాజ 40 సంవత్సరాల కెరీర్ ను పూర్తి చేసుకోబోతున్నారు. ఇన్ని దశాబ్దాల పాటు దర్శకుడిగా కెరీర్‌ను కొనసాగించిన అరుదైన దర్శకుల్లో భారతి రాజ ఒకరు. సంచలన సినిమాలతో దక్షిణాది సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన భారతి రాజకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన కొంతకాలం కిందటే తన 50వ సినిమాను పూర్తి చేశాడు! 200లో ఆయన దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘‘బొమ్మలాట్టం’’ (తెలుగులో కాళిదాస్) భారతిరాజ దర్శకత్వం వహించిన 50వ సినిమా!
మరి 50వ సినిమా పూర్తి చేయడానికి భారతి రాజకు దాదాపు ముప్పై సంవత్సరాల సమయం పట్టింది! మరి ఇదే సమయంలో భారతి రాజతో పాటు కెరీర్ మొదలు పెట్టిన దక్షిణాదిలోని ఇతర లెజెండరీ దర్శకులు తమ కెరీర్లో వంద మార్కును చేరుకొన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. భారతి రాజకు కాస్తా అటు ఇటుగా కెరీర్ మొదలు పెట్టి.. తమ తమ శైలిల్లో సినిమాలు తీసిన వారు సెంచరీలు కొట్టేశారు! అయితే భారతి రాజ మాత్రం హాఫ్ సెంచరీకే పరిమితం అయ్యారు.
మరి రాసి విషయంలో భారతి రాజ మిగతా వారికన్నా కాస్త తక్కువగా అనిపించినా… వాసి విషయంలో మాత్రం భారతి రాజకు తిరుగులేదు. ఆయన తీసిన 50 సినిమాల్లో చాలా వరకూ ఆణిముత్యాలే! అంతేనా.. ఈ 50 సినిమాలతోనే భారతి రాజ సాధించిన మరిన్ని ఫీట్లున్నాయి. అలాంటి వాటిలో ఒకటి.. ఆయన నటీనటులను ఇంట్రడ్యూస్ చేసిన విధానం.
భారతి రాజ సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ప్రత్యేకతలుంటాయి. గ్రామీణ తమిళ నాడును.. అక్కడి ప్రజల జీవనశైలిని అందమైన కథలుగా.. ఆకట్టుకొనే కథనాలుగా వివరించిన విధానాల గురించి చెప్పాలంటే లెక్కలేనన్ని విషయాలు చెప్పవచ్చు. భారతి రాజ దర్శకత్వ ప్రతిభ గురించి.. ఆయన కథలను మలిచిన విధానం గురించి.. వాటితో ఇండస్ట్రీపై తన ముద్ర వేయడం గురించి ఎంతైనా వివరించవచ్చు. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే.. మరో విధంగా కూడా భారతి రాజను ప్రస్తావించాలి.
అదేమిటంటే… దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులను, దర్శకులను పరిచయం చేసిన ఘనత భారతి రాజది. తమ నటనతో.. గ్లామర్‌తో.. దర్శకత్వ ప్రతిభతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ఎంతోమందిని భారతిరాజ తెరకు పరిచయం చేశాడు. తద్వారా వాళ్లకంటూ ఒక గుర్తింపును ప్రసాదించాడు. అలా భారతిరాజ పుణ్యాన కెరీర్ ప్రారంభించిన వారిలో చాలా మంది దక్షిణాదిలో స్టార్లుగా ఎదిగారు! వారు అలా ఎదగడంలో వారి ప్రతిభది ఎంత పాత్ర ఉందో.. దాన్ని గుర్తించిన భారతి రాజది కూడా అంతే పాత్ర అవుతుంది.
బాలనటిగా గుర్తింపు ఉన్న శ్రీదేవిని ‘‘పదహారేళ్ల వయసు’’ తమిళ వెర్షన్ తో హీరోయిన్ ను చేసింది భారతిరాజ. ఆ తర్వాత ఆమె తమిళ, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్గా కొనసాగించిన వైభవాన్ని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు.
తమిళ విలక్షణ నటుడు ఎమ్ఆర్ రాధకు ఇద్దరు కూతుర్లు. వారిలో చిన్నమ్మాయి నిరోష చాలా యాక్టివ్. ఎక్స్ ప్రెసివ్… ఆ కుటుంబాన్ని ఎరిగిన వారంతా… ఆ చిన్నమ్మాయి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే బాగా రాణించగలదు అనేది తమిళ ఇండస్ట్రీ జనాల అభిప్రాయం. మరి అందరి దృష్టి చిన్నమ్మాయి మీద ఉంటే.. భారతి రాజ పెద్దమ్మాయిని గమనించాడు. ఆమెలో మంచి నటి ఉందని గుర్తించాడు.
ఆ అమ్మాయికి కూడా ఆ విషయంపై అవగాహన, నటించగలనన్న కాన్పిడెన్స్ లేకపోయినా.. భారతి రాజ తనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. అలా భారతిరాజ చేత ఇంట్రడ్యూస్ కాబట్టి ఎమ్ ఆర్ రాధ పెద్ద కూతురు రాధిక. ‘‘తూర్పుకు వెళ్లే రైలు’’ సినిమా తమిళ వెర్షన్ తో భారతిరాజ రాధికను ఇంట్రడ్యూస్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి, నటుడు హరిప్రసాద్, నటుడు సుధాకర్‌లు చెన్నైలో రూమ్ మేట్లుగా ఉన్న సమయంలో… అందరూ కలిసి నటనలో శిక్షణ తీసుకొంటున్న సమయంలో… అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్న సమయంలో… మిగిలిన వారిద్దరికన్నా మొదట అవకాశం వచ్చింది సుధాకర్ కే! మొదట్లో తమిళ హీరోగా తర్వాత తెలుగులో స్టార్ కమేడియన్‌గా రాణించిన సుధాకర్‌ను కూడా తూర్పు వెళ్లే రైలు తమిళ వెర్షన్‌తో ఇంట్రడ్యూస్ చేశారు భారతిరాజ.
సుధాకర్ , రాధికలు ఆ సినిమాతో తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై చూపిన ప్రభావం ఎలాంటిదో వేరే చెప్పనక్కర్లేదు.
భారతిరాజ కు ధీటైన లెజెండ్ అనదగ్గ తమిళ దర్శకనటుడు భాగ్యరాజ్. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకొన్న భారతిరాజను ఇంట్రడ్యూస్ చేసింది కూడా భారతిరాజనే. తనకు అసిస్టెంట్ గా పనిచేసిన భాగ్యరాజ్కే చిన్న చిన్న వేషాలు ఇచ్చి తెరపైకి తీసుకొచ్చారాయన. ఆ తర్వాత భారతి రాజ దర్శకత్వం వహించిన ‘‘టిక్ టిక్ టిక్’’ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా భాగ్యరాజకు మంచి గుర్తింపు లభించింది. అక్కడ నుంచి ఆయన ప్రస్థానం ఊపందుకొంది.
మనివణ్ణన్ మనకు నటుడిగా మాత్రమే పరిచయం కానీ… తమిళంలో మాత్రం ఆయన దర్శకుడిగా కూడా ఫేమస్. ఈ దర్శకనటుడు కూడా భారతిరాజ సహాయకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వ్యేక్త. ఆయన చేత ఇండస్ట్రీకి పరిచయం కాబడ్డ సృజనకారుడే.
నటిగా అవార్డులు అందుకొన్న.. దర్శకురాలిగా కూడా అవార్డుల స్థాయికి ఎదిగారు రేవతి. దక్షిణ భారతంలోని ప్రతిభా వంతమైన నటీమణుల్లో ఒకరిగా గుర్తింపును కలిగిన రేవతిని ‘‘మంగమ్మగారి మనవడు’’ తమిళ వెర్షన్ ద్వారా భారతిరాజ హీరోయిన్ గా పరిచయం చేశారు.
తమిళనటుడు ఆర్.ముత్తురామన్ తనయుడు కార్తీక్. తెలుగు వాళ్లకు అర్థం అయ్యేలా పరిచయం చేయాలంటే కార్తీక్ ను ’’సీతాకోకచిలుక’’ సినిమా హీరోగా చెప్పాలి. ‘‘అన్వేషణ’’లో కూడా నటించాడని గుర్తు చేయాలి. అలాంటి కార్తీక్ ను ‘‘సీతాకోక చిలుక’’ సినిమా తమిళ వెర్షన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు భారతిరాజ.
తెలుగులో కూడా ఒకటైమ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన రాధ కూడా భారతి రాజ ద్వారా ఇదే సినిమా తమిళ వెర్షన్ తో ఇంట్రడ్యూస్ అయ్యింది.
‘‘నిళల్ గల్’’ రవి మనకందరికీ పరిచయమే. తమిళం నుంచి అనువాదం అయిన సినిమాలతోనూ… కొన్ని స్ర్టైట్ సినిమాలతోనూ ఈ క్యారెక్టర్ ఆర్టిస్టు మనకు పరిచయం. నీడలు అనే అర్థం వచ్చే ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న ఈ నటుడిని ఆ సినిమాకు దర్శకత్వం వహించి పరిచయం చేసింది భారతిరాజనే. ఇదే సినిమాలో రోహిణి అనే నటి పరిచయం అయ్యింది.
‘‘నెపోలియన్’’ హలో బ్రదర్ సినిమా విలన్ గా మనకు చిరకాలం గుర్తుండిపోతాడు. ప్రతిభావంతమైన ఈ నటుడిని ఇంట్రడ్యూస్ చేసింది ఈ దర్శకుడే!
ఇంకా.. పెద్దరికంతో తెలుగు వాళ్లకు పరిచయం అయిన సుకన్యను తెరకు పరిచయం చేసింది భారతిరాజ. నటిగానే కాకుండా పలు వివాదాలతో వార్తల్లోకి వచ్చిన రంజితకు తొలుత ఛాన్స్ ఇచ్చింది భారతి రాజనే. ‘‘సీతాకోక చిలుక’’ తెలుగు వెర్షన్ ద్వారా గుర్తింపును సంపాదించుకొన్న ముచ్చర్ల అరుణను పరిచయం చేసింది ఈ దర్శకుడే. మరి అంతా పాతతరం వారు.. ఒక స్థాయికి ఎదిగిన వారేనా అంటే.. ఈ తరం వారు కూడా ఉన్నారు.
ప్రియమణి, కార్తిక, రియా సేన్.. వీళ్లతో పాటు తనయుడు మనోజ్ భారతిరాజను కూడా తెరకు పరిచయం చేశారు భారతి రాజ. మరి తన సినిమాల ద్వారా నే కాకుండా.. ఇండస్ట్రీ కి ప్రతిభావంతులైన నటీమణులను అందించడం ద్వారా కూడా భారతిరాజ తన ముద్రను వేశాడు.