అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు దారుణంగా పతనమవుతున్నా, ఆ స్థాయికి తగ్గట్టుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల్ని పక్షానికోసారి సమీక్షిస్తున్నారు చాలాకాలంగా. ఈ క్రమంలోనే రేపు మరోమారు ధరలపై సమీక్ష జరగాల్సి వుంది. అయితే జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సి వున్నా, పన్నుల్ని పెంచడం ద్వారా, కంపెనీలకు లబ్ది కలిగించిన కేంద్రం, వినియోగదారుడికి ఎలాంటి లాభమూ లేకుండా చేసింది.
తాజాగా రేపటి సమీక్షలో కేంద్రం ఏం చేస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మీడియాలో విన్పిస్తోనన్న కథనాల్ని బట్టి చూస్తే లీటర్‌కి రెండు రూపాయల వరకు పెట్రోల్, డీజిల్‌పై రేట్లు తగ్గే అవకాశం వుంది. అయితే మరోమారు కేంద్రం, ఆయిల్ కంపెనీల లబ్ది గురించి ఆలోచిస్తే తగ్గుదల వుండకపోవచ్చు.
మరోపక్క, ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోధరల్ని కేంద్రం తగ్గించడం ఖాయం.. అనేవారూ లేకపోలేదు. అంతిమంగా అధికారంలో ఎవరున్నా రాజకీయ ప్రయోజనాలే ఆలోచిస్తారు గనుక, పెట్రో ధరలు తగ్గడం ఖాయమే.
ఇక, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన తీరుతో పోల్చితే, యాభై రూపాయల లోపే పెట్రోల్, డీజిల్ ధరలు వుండాల్సిన పరిస్థితి. కానీ, అంత భాగ్యం, సగటు భారతీయుడికి లేకుండా చేస్తోంది కేంద్రంలోని మోడీ సర్కార్. ఆయిల్ కంపెనీలకు లబ్ది చేకూర్చడం తప్పనిసరనీ, పన్నులు తగ్గిపోతే అభివృద్ధి కార్యక్రమాలు కష్టమవుతాయనీ.. ఇంకోటనీ.. సవాలక్ష కారణాలు చూపిస్తూ, వినియోగదారుడ్ని నిలువునా ముంచేస్తోంది కేంద్రం.