120 డాలర్లు – 75 రూపాయలు, 55 డాలర్లు – 75
ఏంటి ఈ ఈక్వేషన్.? అక్కడికే వచ్చేద్దాం. ఒకప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 120 డాలర్లు. ఇప్పుడది కేవలం 55 డాలర్లు మాత్రమే. 120 డాలర్లకు బ్యారెల్ ముడి చమురుని దిగుమతి చేసుకున్నప్పుడూ, 55 డాలర్లకే ఆ ముడిచమురుని దిగుమతి చేసుకుంటున్నప్పుడూ మన దేశంలో లీటర్ పెట్రోల్ రేటులో మాత్రం ఛేంజ్ రాలేదు. ఎందుకిలా.? ఇదే మరి, 'మాయ' అంటే.! అవును, ఇది నిఖార్సయిన నరేంద్రమోడీ మాయ.!
కేంద్ర మంత్రి కేజీ అల్ఫాన్సో (కొత్తగా పదవి వచ్చిందిలెండి) కాస్తంత ఎక్కువగా 'స్వామిభక్తి' ప్రదర్శించాలనుకున్నారు. పెట్రో ధరల విషయమై నోటికొచ్చిందేదో మాట్లాడేశారు. దౌర్భాగ్యం.. ఇలాంటోళ్ళు మనకు కేంద్ర మంత్రులు కావడమన్న అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యిందంటే ఆయనెంత సిల్లీగా పెట్రో ధరల గురించి మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు.
'పన్నులు కట్టగలిగేవారి మీదనే బారం మోపుతున్నాం.. పేదోడికి పెట్రోల్‌తో పనేంటి.?' అన్నది ఆయనగారి ఉవాచ. ఆర్థిక ఇబ్బందులతో పేదోడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడే పెట్రోల్ బాటిల్‌ని ఉపయోగిస్తాడని కేంద్ర మంత్రిగారు అనుకుంటున్నారా.? అబ్బే, అప్పుడూ ఆ అవసరం రాదు, చీప్‌గా కిరోసిన్ అందుబాటులో వుంటుంది కదా.! ఇలాంటి సెటైర్లు సోషల్ మీడియాలో పడ్తున్నాయి సదరు కేంద్రమంత్రిగారి మీద.
పెట్రో ధరలు.. అంటే, ఇక్కడ పెట్రోల్ అలాగే డీజిల్ ధరలన్నమాట. సామాన్యుడు ఎక్కే బస్సు, రైలు.. ఇవి డీజిల్ మీదనే నడుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌కి అనుగుణంగా డీజిల్ ధరలు తగ్గితే, చాలా వస్తువుల ధరలు తగ్గిపోతాయి. కారణం ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు తగ్గడమే. ఈ మినిమమ్ లాజిక్‌ని కూడా తెలుసుకోలేని కేంద్ర మంత్రిని ఏమనాలి.? మీరేమన్నా అనుకోండి, ఆయన సాక్షాత్తూ కేంద్రమంత్రిగారే.
అంతర్జాతీయ ముడిచమురు ధరలని బట్టే, మార్కెట్‌లో పెట్రోధరల్ని పెంచాల్సి వస్తోందన్నది కేంద్రమంత్రిగారి ఉవాచ. పైన ఈక్వేషన్ చెప్పుకున్నాం కదా. నాలుగో తరగగతి కుర్రాడు కూడా చెబుతాడు, అంతర్జాతీయ మార్కెట్‌లో 55 డాలర్లకు బ్యారెల్ ముడిచమురు కొంటున్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఎలా వుండాలో. దురదృష్టవశాత్తూ కేంద్రమంత్రిగారికి ఆ పాటి జ్ఞానం కూడా లేకపోయిందాయె. ఎందుకు వుంటుంది.? అక్కడంతా ఆయన మోడీ భజనలో మునిగి తేలడమే సరిపోతోంది కదా.!
చివరగా: ఖర్మ కాలి, ముడి చమురు ధర బ్యారెల్ 120 డాలర్లకు వెళితే, ఏంటి పరిస్థితి.? పెట్రోల్ ధర 200 టచ్ చేస్తుందా.? తప్పదు మోజుపడి మోడీని గెలిపించుకున్నాక, ఆయనగారు పెట్టే వాతలు భరించాల్సిందే.!