పబ్లిసిటీ కోసం ఖర్చు చేసే పొలిటికల్ లీడర్స్‌లో నెంబర్ వన్ పొజిషన్‌లో నిలిచేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. అసలంటూ రాజకీయాల్లో 'పబ్లిసిటీ'కే బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ని అభివర్ణించవచ్చు. స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీ పగ్గాల్నీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్నీ దక్కించుకున్న చంద్రబాబు, దాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు అప్పట్లో చేసిన పబ్లిసిటీ 'ఖర్చు' వివాదాస్పదమయ్యింది.
చంద్రబాబు తర్వాత ఆయన్ని మించిపోయారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పనిచేసినన్నాళ్ళూ, పబ్లిసిటీ కోసం ఆయన చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోవడం కోసమంటూ ప్రభుత్వాలు పబ్లిసిటీ స్టంట్లు చేయడం అనే ప్రక్రియ, అలా తెలుగు నాట ప్రారంభమయ్యిందని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. తర్వాత్తర్వాత చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇదే పంథాని అనుసరించాయి.
ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పబ్లిసిటీలో ఒకరితో ఒకరు పోటీ పడ్తున్నారు. సంక్షేమ పథకాలు చివరి లబ్దిదారుడి దాకా చేరడంలేదుగానీ, పబ్లిసిటీ మాత్రం ఓ రేంజ్‌లో జరుగుతోంది. రుణమాఫీ చేసేశామని ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ పబ్లిసిటీ చేసుకుంటోంటే, రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడంలేదాయె. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ఇదే పరిస్థితి. రాష్ట్రాల్లోనే ఈ స్థాయిలో ప్రభుత్వాలు పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తోంటే, కేంద్రం తక్కువేమన్నా తింటుందా.?
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్స్ విషయంలో నరేంద్రమోడీ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రధాని అయ్యాకా ఆయన అదే పంథాలో పరుగులు పెడ్తున్నారు. మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్నాక, ప్రధాని నరేంద్రమోడీ బీభత్సమైన పబ్లిసిటీ స్టంట్లకు తెరలేపారు. కరువొస్తే రైళ్ళలో నీళ్ళను తరలించారట. వరదలొస్తే విమానాల్లో సహాయక చర్యల్ని పర్యవేక్షించారట. తగిన సహాయం అందజేశారట. ఏదీ, ఎక్కడ.? విశాఖకు హుద్‌హుద్ తుపాను వస్తే, కేంద్రం ఆదుకున్నదేదీ.?
పబ్లిసిటీ పేరుతో ప్రభుత్వాలు చేసే ప్రతి ఖర్చూ ప్రజలకు చెందినదే. కోట్లు, వందల కోట్లు సైతం వెచ్చిండానికి ప్రభుత్వాలు వెనుకాడడంలేదు. ఆ పబ్లిసిటీ ద్వారా పెరిగే పొలిటికల్ ఫాలోయింగ్ అలాంటిది మరి.! ఖజానా నుంచి ఖర్చు చేయడమంటే, జనం జేబులకు చిల్లులు పెట్టడమే కదా.! జనం జేబులకు చిల్లులు పెట్టి, ప్రభుత్వాలు పబ్లిసిటీ చేసుకోవడం.. అదిరింది కదూ.! ఎవడబ్బ సొమ్మనీ.. అంటూ ప్రజలు నిలదీసేదాకా ప్రభుత్వాలు పబ్లిసిటీ పిచ్చితో, జనం జేబులకు చిల్లులు పెడుతూనే వుంటాయి.