భయంకరమైన లాభాలు కళ్ల చూసారు బాహుబలి నిర్మాతలు. ఇక సినిమాను సమర్పించిన దర్శకేంద్రుడికి లాభాల్లో ఎంతో అంత వాటా వుండే వుంటుంది. పైగా ఇద్దరు నిర్మాతలు పైవాళ్లు కాదు.
ఒకరు అల్లుడి వరుస మరొకరు మేనల్లుడి వరుస. అందుకే ఈ ఇద్దరు కలిసి తమ బావ వరుస అయిన కోవెలమూడి ప్రకాష్ ను దర్శకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రకాష్ తో బయటి ప్రొడ్యూసర్లు రెండు సినిమాలు నిర్మించారు. రెండూ డిజాస్టర్లే. రెండు డిజాస్టర్ల తరువాత మరే బయటి నిర్మాత సాహసం చేస్తాడు ప్రకాష్ తో సినిమాకు. అందుకే ఈసారి బంధువులు అయిన బాహుబలి నిర్మాతలు రంగంలోకి దిగారు. నలభై కోట్లో ప్రకాష్ తో ఓ సినిమా ప్లాన్ చేసారు.
శర్వానంద్ ఎప్పుడో డేట్లు ఇచ్చాడు. అందువల్ల ఆ సినిమాను ప్రకాష్ డైరక్షన్ లో చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నలభై కోట్ల సినిమా అంటే బాహుబలి పేరుచెప్పి, శర్వా పేరు చెప్పి మార్కెట్ చేయడం పెద్ద కష్టం కాదు.
కాస్త కష్టమైనా బాహుబలి లాభాలతో పోల్చుకుంటే ఇది ఎంత? అయినా గురుపుత్రుడి కోసం, తన నిర్మాతల కోసం రాజమౌళి సలహా సహకారాలు వుండే అవకాశం వుంది కూడా.ఈ సినిమా హిట్ అయితే ప్రకాష్ డైరక్టర్ గా సెటిల్ అయిపోతారు.
శర్వా ప్రస్తుతం యువి వాళ్లకి ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు సుధీర్ వర్మ డైరక్షన్ లో ఓ సినిమా చేయాలి. మరి యువి సినిమా తరువాతో, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా తరువాతో ప్రకాష్ తో సినిమా వుంటుంది.