క్షరము కానిది అక్షరం అన్నది ఎప్పటి నుంచో వినిపించే సంగతి. అలాంటి అక్షరం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి జనాలకు మార్గదర్శనం చేసి, ఆ తరువాత తరువాత కార్పొరేట్ స్థాయికి ఎదిగి,
వేల కోట్ల వ్యాపారంగా మారిన ప్రింట్ మీడియా ఇప్పుడు దిక్కులు చూస్తోంది. విజువల్ మీడియాను తట్టుకుని, డిజటల్ మీడియాను ఢీకొని తన అస్థిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్న పత్రికా రంగం ఇప్పుడు అనుకోకుండా విరుచుకుపడిన కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన మార్పులకు తలవోంచి, పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఆధునికత-కాంపిటీషన్
వార్తాపత్రికలకు కష్టం ఇప్పుడు కొత్తగా వచ్చి పడలేదు. ఎనభయ్యవ దశకం నుంచి వార్తాపత్రికల ఆధునీకరణ ప్రారంభమైన దగ్గర నుంచే ఖర్చు అధికం కావడం ప్రారంభమైంది. ఎప్పడయితే ఆధునిక సాంకేతికత ను స్వీకరించి , రంగుల్లో ముద్రించడం, అలాగే పాఠకులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, శీర్షికలు, అందుకు అనుగుణంగా సిబ్బందిని, పేజీలను పెంచుకుంటూ వెళ్లడంతో ఖర్చు పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో నెట్ వర్క్ ను కూడా పెంచుకుంటూ వెళ్లారు. మూడు జిల్లాలకు ఓ రిపోర్టర్ స్థాయి నుంచి సెకండ్ క్లాస్ టౌన్ లకు కూడా ఇద్దరు ముగ్గురు రిపోర్టర్లను పెట్టుకునే స్థాయికి వెళ్లారు. అలాగే డ్రోన్ లను కూడా వాడే వరకు వెళ్లారు. ఇలా అన్ని విధాలా ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో సాక్షి రాకతో మరింత కాంపిటీషన్, ఖర్చులు పెరిగాయి.
ఆదాయమూ పెరిగింది
ఖర్చులతో పాటే ఆదాయమూ పెరిగింది. అడ్వర్ టైజ్ మెంట్ టారిఫ్ ను భయంకరంగా పెంచారు. కవర్ ప్రకటనల పేరిట కోట్లకు కోట్లు రోజుకు సంపాదించే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వాలు అనుకూలంగా వుంటే ఏదో వంకన కోట్లకు కోట్ల ప్రకటనల రూపంలో కట్టబెట్టడం అన్నది ఆనవాయతీగా మారింది. ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వాల మద్దతుతో వివిధ సంస్థల నుంచి పొందే ప్రకటనల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అలాగే ప్రభుత్వాల నుంచి తక్కువ ధరకు ఖరీదైన భూములు లభించడం అన్నది మరో అదనపు ప్రయోజనంగా మారింది. ఇలా అన్ని విధాల లాభసాటిగా వున్న పత్రికల వ్యాపారం ఇప్పుడు సంక్షోభంలో కూరుకుంది.
సవాలక్ష కారణాలు
ఒక్కసారిగా తెలుగునాట ప్రింట్ మీడియా సంక్షోభంలో కూరుకుపోవడానికి చాలా కారణాలు వున్నాయి. మూడు నాలుగు ప్రధానపత్రికలు మినహా మిగిలినవేవీ ఇప్పటికే నష్టాల్లో వున్నాయి. ఈ ప్రధాన పత్రికలు కూడా పలు అడ్డదారులు వాడుకుని, సరైన జీత భత్యాలు చెల్లించకుండా రకరకాలుగా డబ్బు ఆదా చేయడం అన్నది కొంత వరకు కలిసి వచ్చింది.
ఇలాంటి టైమ్ లో తెలుగుదేశం ప్రభుత్వం గద్దె దిగింది. దీంతో ఒక్కసారిగా ప్రధాన పత్రికలకు గొంతులో వెలక్కాయ పడిపోయింది. ఊ అంటే కవర్ ప్రకటనలు..ఆ అంటే కవర్ ప్రకటనలు ఇవ్వడం అన్న అలవాటు మాయమైంది. ఇదే కరోనా టైమ్ లో తెలుగుదేశం ప్రభుత్వం వుండి వుంటే, ప్రభుత్వం తీసుకునే చర్యలు అంటూ, రోజు విడిచి రోజూ ఫుల్ పేజీ ప్రకటనలతో ఊదరగొట్టేవి. పైగా వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రకటనల మీద ఖర్చు బాగా తగ్గించింది.
ప్రకటనల ఆదాయం పక్కన పెడితే, వివిధ సంస్థల ద్వారా కూడా ప్రభుత్వ పెద్దలు ప్రకటనలను పత్రికలకు వచ్చేలా చూసేవారు. ఇప్పుడు అది మాయమైంది. దీనికి తోడు బడా కాంట్రాక్టు సంస్థల నుంచి దొడ్డిదారిన నిధులు బడా మీడియా సంస్థలకు అందేవన్న ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకు మీడియా సంస్థలకు ఈ విధంగా నిధులు వెనుక దారి నుంచి ప్రవహించేవన్న గుసగుసలు వున్నాయి. ఇప్పుడు అవి కూడా మాయమయ్యాయి.
ఇదిలా వుంటే గత అయిదేళ్లుగా మోడీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ప్రకటనలు ఇవ్వడం బాగా తగ్గించేసింది. దాంతో అట్నుంచి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది.
కరోనా టైమ్
ఇలాంటి టైమ్ లో కరోనా కల్లోలం విరుచుకుపడింది. ప్రపంచం మొత్తం సంక్షోభణ దిశగా పయనిస్తోంది. మార్కెట్ లు మొత్తం పతనం అవుతున్నాయి. దీంతో ఉత్పాదకత, మార్కెటింగ్, అమ్మకాలు అన్నీ తగ్గుతాయి. తదనుగుణంగా పత్రికలకు ప్రకటనలు తగ్గుతాయి. ఇటు ప్రభుత్వాల అండ లేకుండా, అటు కార్పొరేట్ ప్రకటనలు రాకుండా పత్రికలు మనజాలడం అన్నది అంత సులువు కాదు.
ఇదే టైమ్ లో దాదాపు నెలన్నర లాక్ డౌన్. పత్రికల అమ్మకంలో కౌంటర్ సేల్ ది కూడా అత్యంత కీలకం. ఆ కౌంటర్ సేల్ అన్నది పూర్తిగా ఆగిపోయింది. అదే సమయంలో మారుమూల పల్లెలకు పంపించడం అన్నది సమస్యగా మారింది. దీనికి తోడు వార్తా పత్రికల ద్వారా కరోనావ్యాపిస్తుంది అన్నది జనంలోకి బలంగా వెళ్లింది. ఇవన్నీ కలిసి ప్రతికల ప్రింట్ ఆర్డర్ ను తగ్గించేసాయి.
న్యూస్ ప్రింట్ సమస్య
ఇదిలా వుంటే ప్రధానపత్రికలకు న్యూస్ ప్రింట్ అన్నది కీలకం. భారీ సర్క్యులేషన్ కు తగినట్లు న్యూస్ ప్రింట్ అవసరం పడుతుంది. కానీ మన పత్రికలకు న్యూస్ ప్రింట్ దేశీయంగా కన్నా, విదేశాల నుంచే ఎక్కువ వస్తుంది. చైనా, రష్యా తదితర దేశాల నుంచి మన పత్రికలు నేరుగా దిగుమతి చేసుకుంటున్నాయి. మోడీ ప్రభుత్వం న్యూస్ ప్రింట్ పై దిగుమతి సుంకం కూడా భారీగా పెంచింది.
ఇలాంటి టైమ్ లో కరోనా కారణంగా న్యూస్ ప్రింట్ దిగుమతి ఆగిపోయింది. వున్న న్యూస్ ప్రింట్ నిల్వలు తరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అర్జెంట్ గా పత్రికలు అన్నీ పేజీలను తగ్గించాయి. పేజీలు తగ్గించడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కాదు. న్యూస్ ప్రింట్ ను ఆదా చేసుకోవాల్సిన అవసరం. తద్వారా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం. బతికి బాగుండి, కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత పరిస్థితులు చక్కబెడితే, అప్పుడు చూడొచ్చు.
డిజిటల్ కాంపిటీషన్
ఇలాంటి టైమ్ లో ఎప్పటికప్పుడు అనుక్షణం వార్తలు అందించే డిజిటల్ మీడియా జనాలకు దగ్గర కావడం ప్రారంభమైంది. వెబ్ సైట్ ల ద్వారా క్షణం క్షణం వార్తలు తెలిసిపోతున్నాయి. ఆరంభంలో వెబ్ సైట్లు అన్నీ గ్యాసిప్ లకు ప్రాధాన్యత ఇచ్చినా, ఇప్పుడు సీరియస్ మీడియాగా కన్వర్ట్ అవుతున్నాయి. చాలా వరకు అయ్యాయి కూడా. ఆదిలో ఈ మాధ్యమం మీద అంతగా దృష్టి పెట్టని ప్రింట్ మీడియా కూడా ఇప్పుడు అటు దృష్టి పెట్టింది. దాని వల్ల అదే మాధ్యమాన్ని అభిమానించేవారు ఎవరైనా వుంటే, వాళ్లు అదే మీడియా తాలూకా డిజిటల్ మాధ్యమం దగ్గర ఆగిపోవడం ప్రారంభమైంది.
మ్యాగ్ జైన్ లకు కాలంచెల్లు
ఇదిలా వుంటే దినపత్రికలు కాస్తయినా తట్టుకున్నాయి డిజిటల్ విప్లవాన్ని, కానీ వారపత్రికలు మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు స్వర్ణయుగాన్ని చూసిన స్వాతి లాంటి వారపత్రిక ఒక్కటే కాస్త తట్టుకోగలిగింది. ఆంధ్రభూమి వారపత్రిక ఏనాటి నుంచో కూనారిల్లుతూ వచ్చి, ఇప్పుడు మూత పడింది. ఆంధ్రజ్యోతి మద్దతుతో వస్తున్న నవ్య పత్రిక కు కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఈనాడు సంస్థ తమ పత్రికలు సితార, చతుర, విపుల లను ఎప్పుడో ఆపేసింది. ఇండియా టుడే తెలుగు ప్రచురణ అన్నింటి కన్నా ముందే ఆగిపోయింది.
జర్నలిస్ట్ లకు కష్టకాలం
ఇలా అన్ని విధాలా ప్రింట్ మీడియా ఇప్పుడు కార్నర్ అవుతుంటే దాని ప్రభావం జర్నలిస్ట్ ల మీద పడుతోంది. అసలే తెలుగు జర్నలిస్ట్ లకు సరైన జీత భత్యాలు లేవు. దీనికి తోడు ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగాలు తీసివేయడం ప్రారంభమైంది. దీనికి తోడు ప్రధాన దినపత్రికలను పక్కన పెడితే, ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు, అలాగే జిల్లాల వారీ నడిచే లోకల్ పత్రికలూ పూర్తిగా మూలన పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది జర్నలిస్ట్ లు జీవితాల మీద, జీతాల మీదా దారుణ ప్రభావం కనబర్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.
మొత్తం మీద డిజిటల్ యుగాన్ని తట్టుకున్న ప్రింట్ మీడియా కరోనాను తట్టుకోవడం మాత్రం కష్టంగానే కనిపిస్తోంది. చరిత్రలో కలిసిపోయిన చాలా వ్యవస్థల మాదిరిగా ప్రింట్ మీడియా కూడా ఇప్పడు కాకున్నా, మరికొన్నాళ్లకు అయినా కనుమరుగు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
అశుభంలోనూ శుభం
వార్తాపత్రికల ప్రాముఖ్యత తగ్గడం అన్నది ఓ శుభ పరిణామం కూడా,. దాదాపు నాలుగు దశాబ్దాల కాలంగా తెలుగునాట దినపత్రికలు చాలా వరకు ప్రభుత్వాలను భయపెడుతూ, శాసిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. కేసిఆర్ ప్రభుత్వం ఈ తరహా వ్యవహారానికి తెలంగాణలో అడ్డుకట్ట వేసి మూలన కూర్చోపెట్టింది. కానీ ఆంధ్రలో మాత్రం ఇంకా అదే తరహా నడుస్తోంది. ఇప్పుడు ఈ కరోనా దెబ్బకు పల్లెలకు ఈ పచ్చ పత్రికలు వెళ్లడం ఆగిపోయింది. ఇక వీళ్లు రాసే అడ్డగోలు రాతలు జనాలకు చేరడం ఆగిపోయినట్లే. ఇదే ఇలా కొనసాగితే జనాలను గొర్రెలను చేసి ఆడించే ప్రింట్ మీడియా ధోరణి ముగిసిపోతుంది.
చాణక్య
[email protected]