పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌.. పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌.!

పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అనబడే 'పిల్‌'ని రాజకీయ నాయకులు, తమ పబ్లిసిటీకి వాడుకోవడం అలవాటే. ప్రజల కోసమంటూ, ఎంతో గొప్ప హృదయంతో చాలా కేసుల్లో 'పిల్‌' దాఖలవడం మామూలే. వాటిని న్యాయస్థానాలు తిరస్కరించడమో, స్వీకరించడమో…

పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అనబడే 'పిల్‌'ని రాజకీయ నాయకులు, తమ పబ్లిసిటీకి వాడుకోవడం అలవాటే. ప్రజల కోసమంటూ, ఎంతో గొప్ప హృదయంతో చాలా కేసుల్లో 'పిల్‌' దాఖలవడం మామూలే. వాటిని న్యాయస్థానాలు తిరస్కరించడమో, స్వీకరించడమో జరుగుతూనే వుంటుంది. 'పిల్‌' విషయంలో అప్పుడప్పుడూ న్యాయస్థానాలు, పిల్‌ దాఖలు చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడమూ చూస్తూనే వున్నాం. ఏది పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌.. ఏది పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌.. అనే విషయమై న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలపైనా భిన్నాభిప్రాయూలు మామూలే. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ట్రాఫిక్‌ రామస్వామి అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన 'పిల్‌'ని మద్రాస్‌ హైకోర్టు కొట్టి పారేసింది. ఇది పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌లా లేదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌లా వుందంటూ న్యాయస్థానం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆమె ఫొటోల్ని విడుదల చేయమనడం ఎంతవరకు సబబు.? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్ని రోజులు చికిత్స పొందుతారో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. 

అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటుంది. జయలలిత ఆషామాషీ వ్యక్తి కాదు. ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో వుంటే, ప్రభుత్వ పరంగా కీలకమైన నిర్ణయాలు ఎలా జరుగుతున్నాయి.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 'వెంటిలేటర్‌ని కాస్సేపు తొలగించారు..' అని మొన్నీమధ్యన బులెటిన్‌ వచ్చింది. అది కూడా, ఆమె ఆసుపత్రిలో చేరిన పది రోజుల తర్వాత. అంటే, అప్పటిదాకా ఆమె వెంటిలేటర్‌పై వున్నారనే కదా అర్థం.? అదే నిజమైతే, ఆమె ముఖ్యమంత్రిగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో వున్నట్లే లెక్క. 

ప్రజల ఆందోళన కూడా ఇదే. మొత్తంగా తమిళనాడు అంతటా జయలలిత ఆరోగ్యంపై ఆందోళన వుంది. ఆసుపత్రి వర్గాలేమో, తీరిగ్గా 10 రోజుల తర్వాత చికిత్సకు ఆమె స్పందిస్తున్నట్లు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు గవర్నర్‌ కూడా కాస్త ఆలస్యంగానే జయలలిత ఆరోగ్యంపై స్పందిస్తున్నారు. అదే ప్రభుత్వం తరఫున ప్రకటన అనుకోవాలి. ఈ పరిస్థితుల్లో జయలిత ఆరోగ్యంపై స్పష్టత వచ్చేదెలా.? 'పిల్‌' సంగతెలా వున్నా, జయలలిత ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు, తమిళనాడులో జయలలిత ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసినవారికే కాదు, మొత్తంగా తమిళనాడులో ప్రతి ఒక్కరికీ వుంది. 

కానీ, జయలలిత గురించిన సమాచారం మాత్రం పూర్తిస్థాయిలో బయటకి పొక్కడంలేదు. అయితే, ఇదివరకటితో పోల్చితే, ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించడం కాస్త ఊరట అనుకోవాలంతే.