సినిమా రివ్యూ: జాగ్వార్‌

రివ్యూ: జాగ్వార్‌ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: చన్నాంబిక ఫిలింస్‌ తారాగణం: నిఖిల్‌ కుమార్‌, దీప్తి సతి, జగపతిబాబు, రావు రమేష్‌, రమ్యకృష్ణ, సంపత్‌ రాజ్‌, ఆదిత్య మీనన్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు…

రివ్యూ: జాగ్వార్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: చన్నాంబిక ఫిలింస్‌
తారాగణం: నిఖిల్‌ కుమార్‌, దీప్తి సతి, జగపతిబాబు, రావు రమేష్‌, రమ్యకృష్ణ, సంపత్‌ రాజ్‌, ఆదిత్య మీనన్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు
కథ: విజయేంద్ర ప్రసాద్‌
సంగీతం: తమన్‌
కూర్పు: రూబెన్‌
ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
నిర్మాత: అనితా కుమారస్వామి
మాటలు, కథనం, దర్శకత్వం: ఏ. మహాదేవ్‌
విడుదల తేదీ: అక్టోబరు 6, 2016

ఎవరైనా సీనియర్‌ హీరో కొడుకునో లేదా పెద్ద ఫ్యామిలీకి చెందిన కుర్రాడినో హీరోగా లాంఛ్‌ చేయాలి అనగానే వెంటనే రివెంజ్‌ డ్రామా కథొకటి రాసి పారేస్తుంటారు ఎందుకో మరి? బహుశా అలాంటి కథలో అయితేనే మాస్‌కి కావాల్సిన అన్ని మసాలాలు గుప్పించడానికి, హీరోకి తెలిసిన అన్ని విద్యలు చూపించడానికి స్కోప్‌ ఉంటుందనేమో, లేదా ఇలాంటి కథ అయితే రిస్క్‌లు లేకుండా సేఫ్‌గా గట్టెక్కే అవకాశాలు ఎక్కువనేమో! 'జాగ్వార్‌' అంటూ పేరు ట్రెండీగా పెట్టినా… ఇది మనకి బాగా తెలిసిన 'నాన్నా పులి' అంతటి పురాతన కథ. తండ్రిని మోసం చేసిన వారిపై పగ తీర్చుకోవడానికి వచ్చిన కొడుకు శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది బేసిక్‌ లైన్‌. 

కేవలం కొత్త హీరోలే కాకుండా అడపాదడపా మన సీనియర్‌ హీరోలు సైతం ఈ రివెంజ్‌ ప్లాట్‌తో బాక్సాఫీస్‌పైకి ఒక రాయేసి చూస్తుంటారు. కాకపోతే ఎస్టాబ్లిష్డ్‌ హీరో అయితే కథలో విషయం తక్కువైనప్పటికీ తన ఇమేజ్‌ సాయంతో దానికి బలాన్నిస్తాడు. లేదా ఆల్రెడీ పెద్ద స్టార్‌ హీరో కొడుకైతే ఫాన్స్‌ అండదండలతో ఇలాంటి కథతో ఎలాగో ఒకలా బండి లాగించేస్తాడు. కానీ ఈ నిఖిల్‌ గౌడకి మన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడనే ఐడెంటిటీ తప్ప మరింకేమీ లేదు. ఇలాంటి ఒక ఆర్డినరీ స్క్రిప్ట్‌ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే స్కిల్స్‌ కూడా లేవు. 

ధూమ్‌ మాదిరిగా స్లిక్‌ లుక్‌ ఇవ్వడానికి దర్శకుడు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ, ఒక్కసారి యాక్షన్‌ మోడ్‌ నుంచి బయటకి వచ్చి, హీరో ముఖానికి ఉన్న మాస్క్‌ తీయగానే మళ్లీ పాత చింతకాయ వాసన గుప్పుమంటుంది. కనీసం కామెడీ బాగున్నా ఎంతో కొంత ఎంజాయ్‌ చేయవచ్చు కానీ, కిడ్నాప్‌ చేసిన వాడి పెయింటింగ్‌ని ఒక కుక్క గీసి చూపించడమే కామెడీ అనుకోండని చెప్పే సినిమాలో ఇక కామెడీపై ఆశలు పెట్టుకుని ఏం లాభముంటుంది? హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ మొత్తం ఫస్ట్‌ హాఫ్‌ని గెంటడానికో సాకులా కనిపిస్తుంది తప్ప ఆకట్టుకునే లక్షణమే లేదు. ఒక్కసారి అసలు కథ ఏంటనేది తెలిసాక ఇక హీరోయిన్‌ తెరపై కనిపించదంటేనే తనదో కరివేపాకు పాత్ర అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరో హీరోయిన్ల కంటే వాళ్లు లేని సన్నివేశాల్నే ఆసక్తిగా తిలకిస్తాం. అన్ని డబ్బులు పోసి జగపతిబాబుని పెట్టుకుని కూడా అతడిని సరిగ్గా వాడుకోకపోవడం విడ్డూరం. తన పాత్రని ఎంత సీదాసాదాగా తీర్చిదిద్దినప్పటికీ జగపతిబాబు తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో తాను ఉన్న సీన్స్‌ అన్నిటినీ డామినేట్‌ చేసాడు. 

హీరో ప్రతీకారానికి వెనుక కారణం మొన్నామధ్య వచ్చిన రవితేజ సినిమా 'బెంగాల్‌ టైగర్‌'ని గుర్తు చేస్తుంది. విజయేంద్రప్రసాద్‌ రాసిన ఈ కథలో ఆ పాయింట్‌ అలా అనుకోకుండా కనక్ట్‌ అయిపోయిందని అనుకున్నా, దీనికి 'జాగ్వార్‌' అని పేరు పెట్టుకోవడం మాత్రం భలే కోఇన్సిడెన్స్‌! బాహుబలి రైటర్‌ ఒక నాసి రకం కథ రాసి ఇస్తే, టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఏమో పెద్ద సినిమాలకి రిజెక్ట్‌ అయిన ట్యూన్స్‌ ఇక్కడ ఇచ్చేసినట్టు అనిపించింది. తమన్‌ పాటలంటే ఒకట్రెండు అయినా ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంటాయి. కానీ ఈ పాటలు మాత్రం మ్యూజిక్‌ ఎవరు అంటూ మళ్లీ మళ్లీ పక్కవాళ్లని అడిగి కన్‌ఫర్మ్‌ చేసుకోవాల్సినట్టున్నాయి. మనోజ్‌ పరమహంస,  ఫైట్‌ మాస్టర్లు మాత్రమే దీనికి ఒక కళ తెచ్చారు. విజువల్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. సినిమాపై పెట్టిన ఖర్చులోనే నిర్మాతల పుత్ర వాత్సల్యం కనిపించింది. ఛేజ్‌ దృశ్యాలు, ఫైట్లు యాక్షన్‌ ప్రియులని ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ సీన్స్‌లో నిఖిల్‌ ఈజ్‌ చూపించాడు. మాస్క్‌ ధరించడం వలనో ఏమో మిగతా చోట్ల కంటే ఇక్కడ బెటర్‌ అనిపిస్తాడు. 

హీరో హీరోయిన్ల పరంగా వీక్‌గా ఉన్నా ప్యాడింగ్‌ విషయంలో ఏ లోటు చేయలేదు. అందరూ సీజన్డ్‌ ఆర్టిస్టులే కావడంతో సహకార తారాగణం సినిమాకి బోనస్‌ అయింది. రావు రమేష్‌, రమ్యకృష్ణ, ఆదర్శ్‌ తమ తమ పాత్రల్లో రాణించారు. దర్శకుడు కేవలం హీరో బిల్డప్‌ షాట్స్‌ మీద, అతడిని స్టయిలిష్‌గా ప్రెజెంట్‌ చేయడం మీదే ఫోకస్‌ పెట్టాడు. వాటిపై కంటే కథనం, వినోదం మీద శ్రద్ధ పెట్టినట్టయితే నిర్మాతలు పెట్టిన ఖర్చుకి ఎంతోకొంత గిట్టుబాటు అయ్యేది. ఖర్చంటే ఒకటి గుర్తొచ్చింది… విజువల్స్‌ రిచ్‌గా ఉండడం కోసం నేటివిటీతో సంబంధం లేకుండా, లోకల్‌గా జరుగుతోన్న కథని ఛేజ్‌ సీన్ల కోసం విదేశీ రోడ్ల మీదకి తీసుకెళ్లడం ఏం లాజిక్కో దర్శకుడికే తెలియాలి.

ఓవరాల్‌గా జాగ్వార్‌ బ్యాడ్‌ సినిమానా అంటే కాదు, చాలా సార్లు చూసేసిన సినిమాలా అనిపించే కొత్త సినిమా. నూటికి ఎనభై ఇలాంటి సినిమాలే వస్తున్నప్పుడు, వాటిలో కొన్ని సక్సెస్‌ కూడా అవుతున్నప్పుడు మళ్లీ మళ్లీ ఇలాంటివి ట్రై చేస్తున్నవారిని తప్పుబట్టి లాభం లేదు. బేషరతుగా రిజెక్ట్‌ చేయడం మొదలెడితే తప్ప బాక్సాఫీస్‌పై ఎవరికి వాళ్లు రాళ్లు విసుర్తూనే ఉంటారు. కొన్ని రాళ్లకి ఉట్టి తగిలితే, కొన్నిటికి ప్రేక్షకుల నెత్తి పగుల్తుందంతే. 

బోటమ్‌ లైన్‌: వృద్ధ వ్యాఘ్రం!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri