సాధారణంగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగానే ఉంటారు తప్ప మరోవిధంగా ఉండరు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామంటారుగాని అదీ వాస్తవం కాదు. ఎవరో కొందరు ఇందుకు మినహాయింపుగా ఉంటారుగాని ఎక్కువమంది పక్కా రాజకీయ నేతలే. మానసికంగా బాధపడుతున్న ఒక కుటుంబం ఓ రాజకీయ నాయకుడు తమకు మేలు చేశాడని, అద్భుతమైన ప్రయోజనం కలిగించాడని మెచ్చుకోవడం అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన పని చేసి ఓ కుటుంబం ప్రశంసలు పొందారు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.
ఈమధ్య యువరాజును కేంద్ర ప్రభుతంలో భాగమైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆకాశానికెత్తుతున్నాయి. రాహుల్ బాగా పరిణతి చెందిన నాయకుడిగా మారారని, కాంగ్రెసు అధికారంలోకి వస్తే ఆయనకు పరిపాలించే సామర్థ్యముందని ప్రశంసిస్తున్నాయి. నరేంద మోదీ ప్రభ మసకబారుతోందని శివసేన బహిరంగంగానే విమర్శిస్తోంది. సరే..ఇదంతా రాజకీయమనుకోండి.
ఈ నేపథ్యంలో రాహుల్‌కు ఓ కుటుంబం నుంచి ప్రశంసలు లభించాయి. దేశ ప్రజలందరికీ నిర్భయ కేసు ఇంకా గుర్తుంది. 2012 డిసెంబరులో అంటే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఓ యువతిపై (జ్యోతి సింగ్) నడుస్తున్న బస్సులోనే ఆరుగురు దారుణంగా అత్యాచారం చేయడం, ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లిపోయి సింగపూర్‌లోని ఆస్పత్రిలో చనిపోవడం తెలిసిందే.
వీరిలో ఒకడు మైనారిటీ తీరనివాడు కావడంతో మిగిలినవారికి సుప్రీం కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. వీరిలో ఒకడు చనిపోగా మిగిలినవారికి ఇంకా శిక్ష అమలు చేయలేదు. నిర్భయ చనిపోయినప్పుడు ఆమె తమ్ముడు పన్నెండో తరగతి చదువుతున్నాడు. అక్క దారుణ హత్యతో షాక్‌కు గురైన అతను డిప్రెషన్లోకి పోయాడు. కూతురును పోగొట్టుకున్న ఆ కుటుంబం పుట్టెడు విషాదంలో ఉన్నప్పుడు రాహుల్ అండగా నిలిచారు. నిర్భయ సోదరుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, మోటివేట్ చేసి అతను పైలట్ అయ్యేందుకు దోహదం చేశారు. 'రాహుల్ గాంధీ కారణంగానే నా కుమారుడు పైలట్ అయ్యాడు. అతనికో మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ఆయన అండగా అన్నారు' అని నిర్భయ తల్లి చెప్పారు.
నిర్భయ తమ్ముడు 2013లో స్కూలు చదువు పూర్తి చేశాక కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీలోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చేరాడు. వైమానిక దళంలోకి వెళ్లాలని రాహుల్ కుమారుడిని ప్రోత్సహించారని ఆశాదేవి చెప్పారు. అతను పైలట్‌గా శిక్షణ పొందినంత కాలం రాహుల్ ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం సడలిపోకుండా కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. రాహుల్ పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉంటూ ఓ వ్యక్తికి నిరంతరం కౌన్సెలింగ్ ఇవ్వడం చెప్పకోదగ్గ విషయమే. ఆయన అంత శ్రద్ధ చూపిన కారణంగానే నిర్బయ కుటుంబం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ప్రతి నాయకుడు అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేయడం కూడా ప్రజాసేవగానే భావించవచ్చు.