మ్యాగీ నూడుల్స్ ఆరోగ్యానికి హానికరమనంటూ కొన్ని చోట్ల అవి నిషేధానికి గురయ్యాక… నూడుల్స్ ప్రియుల్ని ఊరడించే వార్త వచ్చింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్‌దేవ్ బాబా తన పతంజలి బ్రాండ్ నుంచి సరికొత్త నూడుల్స్ వస్తాయని ప్రకటించారు. మైదాతో కాకుండా మరో ఆరోగ్యకరమైన పిండితో తాను వీటిని తయారు చేయిస్తానని ఆయన చెప్పారు.
మొత్తానికి ఆయన మాట నిలబెట్టుకున్నారు. తమ బ్రాండ్ నుంచి అట్టా నూడుల్స్ ను ఆయన గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇవి గోధుమ పిండితో తయారు చేశారు. తమ నూడుల్స్ ను ఉత్తరాఖండ్‌లో విడుదల చేసిన సందర్భంగా రామ్‌దేవ్ మాట్లాడుతూ తమ అట్టా నూడుల్స్ మ్యాగీ అలవాటైన చిన్నారులకు సరైన ప్రత్యామ్నాయమన్నారు.
తమ ఉత్పత్తిలో మైదా ఎంత మాత్రం కలపకపోవడం వల్ల ఇవి సంపూర్ణ ఆరోగ్యవంతమైనవి అని చెప్పారాయన. తాను స్వదేశీ ఉత్పత్తులనే ప్రమోట్ చేస్తానని ఎందుకంటే అవి సహజమైనవి, ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయనివని అన్నారాయన.
ఈ ఏడాది దాదాపు రూ.2000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా దూసుకుపోతున్నపతంజలి గ్రూప్… త్వరలోనే బోర్నవిటా, హార్టిక్స్, కాంప్లాన్‌లకు ప్రత్యామ్నాయంగా పవరీటా పేరుతో ఒక హెల్తీ డ్రింక్‌ను సైతం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుందని సమాచారం. ఈ లోగా ప్రస్తుతం ఉన్న పాప్యులర్ బ్రాండ్ హెల్త్ డ్రింక్స్ మీద కూడా మ్యాగీ మీద వచ్చిన తరహాలో వివాదం వస్తే పవరీటాకు మరింత ఊపు గ్యారంటీ.