బాహుబలి చిత్రాన్ని ఒకసారి ఊహించుకోండి. ఆ సినిమా క్యాస్టింగ్ ను కూడా ఒకసారి రివ్యూ చేయండి. రీప్లేస్ చేసే ప్రయత్నం చేయండి. బాహుబలిగా ప్రభాస్ చేయకపోతే.. ఆ పాత్ర చేయడానికి తెలుగు యువ స్టార్లలో ఎవరో ఒకరు దొరుకుతారు! మహేష్ స్టయిల్ సినిమా కాకపోయినా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటివాళ్లు ఆ పాత్రకు కొంత న్యాయం చేయగలరు అనే నమ్మకం కలుగుతుంది.
కానీ.. బాహుబలిలో రానాను రీప్లేస్ చేస్తే.. ఆ పాత్రను ఎవరికి ఇస్తారు? ఎంత ఆలోచించినా సమాధానం దొరకదు. ఆ పాత్రను దర్శకుడు మలిచిన తీరు, రానా పండించిన తీరు కలిసి.. మరో నటుడితో రీప్లేస్ చేయడం అసాధ్యం అనిపించేలా చేస్తాయి.
ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా చూసినా కూడా అదే అనిపిస్తుంది. ‘అయ్యప్పనుం కోషియుం’ అనే ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యం ఉన్న మళయాళ చిత్రం అది. నిజానికి మాతృకలో డానియెల్ శేఖర్ పాత్ర చేసిన నటుడే.. అక్కడ స్టార్. కానీ ఆ రెండు పాత్రలను చాలా సమప్రాధాన్యంతో, ఈగోల సంఘర్షణగా చిత్రాన్ని మలిచారు.
స్టార్ డమ్ చూసుకోకుండా పృథ్వీరాజ్ కూడా ఆ పాత్ర చేశారు. అలాంటి పాత్ర తెలుగులోకి వచ్చేసరికి టైటిల్ లోంచి మాయమైపోయింది. సర్లే.. పవన్ కల్యాణ్ కు- తన సినిమా ఎప్పుడూ కూడా తనొక్కడి గురించే ఆడుతుందనే అభిప్రాయం ఉంటుందేమో అలా చేసుకున్నారని అనుకోవచ్చు. కానీ డానియెల్ శేఖర్ గా రానా చేసిన నటన మాత్రం గొప్పగా ఉంది.
డానీకి, భీమ్లా మీద ద్వేషం లేదు. సినిమా క్లయిమాక్స్ కు చేరే వరకు శత్రుత్వం కూడా లేదు. పైగా డానీ మంచివాడు. ఆడవాళ్ల పట్ల తప్పు చేయకూడదని, వక్రమార్గాలు తొక్కకూడదని నమ్మేవాడు. తండ్రి ఇన్‌ఫ్లుయెన్సులో కొన్నిసార్లు అదుపుతప్పుతాడు తప్పు.. బేసిగ్గా మంచివాడు. కాకపోతే రాజకీయ నేపథ్యం పుణ్యమాని అహంకారం మాత్రం ఉంది.
అయితే.. తొలినుంచి.. తనంతటి వాడిని అరెస్టు చేసిన ఎస్ఐ సంగతి తేల్చాలనే అల్లరి, చిలిపి పొగరు మాత్రమే అతని నటనలో ఉంటుంది. మందు కలపడాన్ని వీడియో తీసినా ఆ తర్వాత భీమ్లా పతనాన్ని చూడాలనుకున్నా.. ప్రతిసారీ అహంకారమే కనిపిస్తుంది తప్ప.. శత్రుభావం కనిపించదు.
ఇంచుమించు దగ్గరదగ్గరగా ఉండే ఈ భావోద్వేగాల మధ్య వ్యత్యాసాన్ని పలికించడం చాలా కష్టం. ఆ పాత్రను రానా చాలా సమర్థంగా చేశాడు. నిజానికి ఈ కోణంలో చూసినప్పుడు.. భీమ్లా పాత్రను మార్పులతో మలిచిన తీరే చెత్తగా ఉంది.. (కేవలం ఈ కోణంలో చూసినప్పుడు)! పైగా రానా అడవిలో కారు చెడిపోయి.. చెప్పులు పట్టుకుని నానా అవస్థలు పడి నడుస్తోంటే.. తన మోటారు సైకిలుమీద ఎక్కించుకుని తాండాలో వదిలిపెట్టే.. డానీ కేవలం అహంకారం, పొగరు, ఈగో మాత్రం చూపిస్తూ.. భీమ్లాతో ‘ఆడుకుందాం’ అనే ధోరణిలో చూస్తుండగా.. భీమ్లా మాత్రం అతడిని శత్రువుగా పరిగణించేసి ‘నా కొడకా నాకొడకా’ అంటూ అవసరానికి మించి పదప్రయోగం చేస్తూ రెచ్చిపోతుంటాడు.
ఈ ‘నా కొడకా’ ప్రయోగం.. తన ఫ్యామిలీని ఎత్తుకుపోయారని భ్రమపడడానికంటె ముందునుంచి ఉన్నదో లేదో తెలియదు.
ఏదేమైనా భీమ్లా అన్నిసార్లు నాకొడకా నాకొడకా అని అంటూ ఉంటే.. డానీ ఒక్కసారి కూడా అంతే చవకబారు బూతులతో ఎదురుసమాధానం చెప్పడు!! ఆ పాత్రలో ఇది చాలా కీలకం. అహంకారంతోపాటే ఆ పాత్రలో హుందాతనం ఉంది. అహంకారమూ- శత్రుత్వం మధ్య ఉండే వ్యత్యాసాన్ని, అహంకారం- హుందాతనం ల మేళవింపునుకూడా రానా చాలా చక్కగా తన అభినయంలో చూపించాడు.
ఇప్పుడు ఊహించండి.. ఈ పాత్రను ఎవరితో రీప్లేస్ చేయగలరు? భీమ్లాగా చేయడానికి మరొక హీరో దొరుకుతాడేమో.. కాకపోతే మరికొన్ని మార్పులు అడగవచ్చు. కానీ డానీగా చేయడానికి రానా తప్ప మరొకరు ఊహకు అందరు.
ఇప్పుడు ఓసారి నరసింహ చిత్రాన్ని గుర్తు చేసుకోండి. నరసింహ పాత్రలో రజనీకాంత్ కాకపోతే.. కాస్త స్టయిలిష్ యాక్టర్ ఎవరైనా సరిపోతారు. సౌందర్యను రీప్లేస్ చేస్తే కోకొల్లలుగా ఆ పాత్రకు హీరోయిన్లు దొరుకుతారు. కానీ రమ్యకృష్ణను రీప్లేస్ చేయాలనుకుంటే మరో హీరోయిన్ మనకు గుర్తురారు.
అందుకే ఒక రమ్యకృష్ణ- ఒక రానా.. ఒక్కటే పీస్.. అంతే!
.. చింతవరం రాంబాబు