తప్పతాగడం తప్పు కాదు.. నాలుగ్గోడల మధ్య తప్పతాగి చిందులేసినా తప్పు లేదు.. కానీ, ఓ చుక్కేసుకుని వాహనాన్ని నడపడం నేరం. తప్పతాగి వాహనాన్ని అడ్డదిడ్డంగా నడిపేసి, జనాన్ని చంపేస్తే ఇంకా పెద్ద నేరం.
అందరికీ తెల్సిన విషయమే ఇది. కానీ, ఒక్కోసారి మద్యం సేవించడం మహా నేరంగా పరిణించాల్సి వస్తుంది. పూటుగా మందేసి, ఆ మైకంలో కారు నడిపి, ఓ కుటుంబాన్ని బలిగింది ఓ యువ బృందం. ఇక్కడ పోలీసులు కేసులు పెట్టగలిగేది వాహనాన్ని నడిపిన వ్యక్తి మీదనే. హైద్రాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన నేపథ్యంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పుట్టుకొచ్చేసింది. సభ్య సమాజం ఈ ఘటనను తీవ్రంగా ఖండించేసింది. ఇది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య.. అంటూ నినదించింది.
ఇంకేం చేస్తారు, పోలీసులు.. పదేళ్ళ వరకూ నిందితుడికి శిక్ష పడేలా కేసులు బనాయించారు. కేసు విచారణ జరగాలి, శిక్ష పడాలి. మళ్ళీ ఇదంతా ఓ తంతు. ఏమో, కారు నడిపింది సినిమా హీరో సల్మాన్‌ఖాన్ కాదు కదా, శిక్ష పడొచ్చుగాక. అంతేనా, అంతకన్నా ఇంకేమీ లేదా.?
ఒక్కసారి రోడ్డు ప్రమాదాలెందుకు జరుగుతున్నాయి.? అన్న విషయంలోకి వెళదాం. అతి వేగం, చాలావరకు రోడ్డు ప్రమాదాలకు కారణం. దానికన్నా పెద్ద కారణం, మద్యం సేవించి వాహనాలు నడపడం. దేశంలో చాలా ప్రమాదాలకు మద్యమే కారణం. నిమిష నిమిషానికో ప్రమాదం.. గంట గంటకో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇదీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు. జాతీయ రహదార్లపై మద్యం అందుబాటులో వుండకూడన్నది రూల్. కానీ, బెల్టు షాపులు వుండొచ్చు. ఎందుకంటే, అవి రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తాయి. జాతీయ రహదార్లపై చిన్న చిన్న దుకాణాల్లో పైకి కనిపించేవి వాటర్ బాటిల్స్, బిస్కట్ ప్యాకెట్స్.. ఇతరత్రా ఆహార పదార్థాలు. తెరవెనుక మద్యం వ్యాపారం యధేచ్ఛగా సాగుతుంటుంది.
చెప్పుకుంటూ పోతే, 'మద్యం చరిత్ర' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజకీయ నాయకులు.. ముఖ్యంగా పాలకులు, మద్యం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల పట్ల తీవ్ర సానుభూతి వ్యక్తం చేసేస్తారు. కానీ, మద్య నియంత్రణ ఊసెత్తరు. తాగండి, తాగి ఛావండి.! అన్నది పాలకుల నినాదం. అధికారంలో ఎవరున్నా అంతే.
తప్ప తాగి, వాహనం నడిపి.. రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాక శిక్షలు విధించడం దాకా ఎందుకు.? అసలంటూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న మద్యాన్ని నిషేధించెయ్యొచ్చుగా.! ముందే చెప్పుకున్నాం కదా.. మద్యం, జనాన్ని పిప్పి చేసి, సర్కార్‌కి కాసుల పంట పండించాలి.. అలా నిండిన ఖజానాతో జనాన్ని పాలకులు ఉద్ధరించెయ్యాలి. అంటే, మద్యం లేకపోతే మనిషి మనుగడే లేదు.!