సహజీవనంలో స్పెషాలిటీనే అది.!

సహజీవనం.. గతంలో సినీ ప్రముఖుల విషయంలో ఈ మాట ఎక్కువగా వినేవాళ్ళం. కానీ, ఇప్పుడది సర్వసాధారణమైపోయింది. టీవీ ఛానళ్ళలో ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటికప్పుడు వింటూనే వున్నాం. 'సహజీవనం' అనే పదానికి, 'బోల్డ్‌' పదం…

సహజీవనం.. గతంలో సినీ ప్రముఖుల విషయంలో ఈ మాట ఎక్కువగా వినేవాళ్ళం. కానీ, ఇప్పుడది సర్వసాధారణమైపోయింది. టీవీ ఛానళ్ళలో ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటికప్పుడు వింటూనే వున్నాం. 'సహజీవనం' అనే పదానికి, 'బోల్డ్‌' పదం ఇంకోటుంది. అది అందరికీ తెల్సిందే. అది నాటుగా వుంటుంది.. చాలామందికి కోపమొస్తుంది కూడా. కాస్త పాలిష్డ్‌గా, ఇంకొంచెం పోష్‌గా 'సహజీవనం' అని పిలుచుకుంటున్నాం. 

ఇద్దరు వ్యక్తులు మేజర్‌ అయ్యాక, వారెలా జీవించాలన్నది వాళ్ళ ఇష్టం. కానీ, సమాజానికి కొన్ని కట్టుబాట్లు అనేవి వుంటాయి. విదేశీ సంస్కృతికీ, మన భారతీయ సంస్కృతికీ తేడా అదే. కానీ, హద్దులు చెరిగిపోయాయ్‌.. ఇప్పుడు భారతదేశంలో సంప్రదాయాలు పక్కన పెట్టి, పోష్‌ కల్చర్‌కి అలవాటు పడిపోయారు కొంతమంది. రానున్న రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలానే చూడబోతున్నాం. 

'పెళ్ళి చేసుకోకపోతేనేం.. మా ఇద్దరి మధ్యా అవగాహన వుంది. పెళ్ళి చేసుకున్నా ఇంత గొప్పగా మా బంధం దృఢంగా వుండేది కాదేమో..' అని గతంలో కమల్‌హాసన్‌, గౌతమి చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడేమయ్యింది.? ఇద్దరూ విడిపోయారు. పదమూడేళ్ళ బంధం తెగిపోయింది. సహజీవనంలోని 'వీక్‌ బాండ్‌'కి ఇది నిదర్శనం అంటున్నారు కొందరు. 

కానీ, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌, సినీ నటి రేణుదేశాయ్‌ సంగతేంటి.? చాన్నాళ్ళు సహజీవనం చేశారు. రాజకీయ అవసరాల దృష్ట్యా, ఆ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకున్నారు. ఆ తర్వాతే తేడా కొట్టేసింది. ఇద్దరూ విడిపోయారు. కమల్‌ – గౌతమి ఎపిసోడ్‌లో ఒకలా, పవన్‌ – రేణు ఎపిసోడ్‌లో ఇంకొకలా.. ఎందుకిలా.? సెలబ్రిటీలు కాబట్టి, వీళ్ళ గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తోందిగానీ, సమాజంలో ఇలాంటి విషయాలు కోకొల్లలు. 

జాన్‌ అబ్రహాం – బిపాసా బసు, రణ్‌బీర్‌కపూర్‌ – కత్రినాకైఫ్‌, ప్రియాంకా చోప్రా – షాహిద్‌ కపూర్‌.. ఇలా చెప్పుకుంటూ బాలీవుడ్‌లో సహజీవనం కథలు చాలానే కన్పిస్తాయి. ఆ బంధాలేవీ పెళ్ళిపీటలెక్కలేదు. ఫన్‌ అండ్‌ ఫర్‌గెట్‌.. అంతే. 

పెళ్ళి చేసుకుంటే బంధం స్ట్రాంగ్‌గా వుంటుందనీ, సహజీవనం చేస్తే అది వీక్‌గా వుంటుందనీ ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. ఆధునిక భావాల పుణ్యమా అని, బంధాలకు విలువ తగ్గిపోతోంది. ఓ చిన్న మనస్పర్ధ కుటుంబాన్ని నిలువునా చీల్చేస్తోంది. ఆ మనస్పర్ధలు వైవాహిక జీవితంలో వున్నా, కొంతమేర కంట్రోల్‌ చేసుకోడానికి ఆస్కారముంటుంది. అదే సహజీవనంలో అయితే, అంతే సంగతులు. అఫ్‌కోర్స్‌, వైవాహిక బంధానికి గౌరవం ఇచ్చినప్పుడే, ఆ బంధంలో బలం వుంటుందనుకోండి.. అది వేరే విషయం.