అబ్జర్వేషన్‌: సిగ్గు సిగ్గు.. ఈ చావు పరామర్శలు

ఆయన పేరు రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి యువరాజు.. ఏకంగా దేశానికే తాను యువరాజనుకుంటారాయన. పరిపాలించే అవకాశం మాత్రం ఆయనకు దక్కడంలేదు. అయితేనేం, యువరాజు హోదాలో సందడి చేసేస్తుంటారు. అప్పుడప్పుడూ ఆయన చేసే హడావిడి కాంగ్రెస్‌…

ఆయన పేరు రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్‌ పార్టీకి యువరాజు.. ఏకంగా దేశానికే తాను యువరాజనుకుంటారాయన. పరిపాలించే అవకాశం మాత్రం ఆయనకు దక్కడంలేదు. అయితేనేం, యువరాజు హోదాలో సందడి చేసేస్తుంటారు. అప్పుడప్పుడూ ఆయన చేసే హడావిడి కాంగ్రెస్‌ పార్టీ నాయకులకే చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. యువరాజు రాహుల్‌గాంధీగారి రాజకీయ ప్రస్థానం తీరు తెన్నుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌.. అని రాహుల్‌గాంధీని పిలవాల్సి వస్తే అదేమీ తప్పు కాకపోవచ్చు. 

తాజాగా రాహుల్‌గాంధీ ఢిల్లీలో హడావిడి చేశారు. 'వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌' విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సైనికుడొకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనని రాజకీయం చేసేందుకు రాహుల్‌ పరుగు పరుగున వెళ్ళారు. కానీ, ఆయన వెళ్ళాలనుకున్నా పోలీసులు వెళ్ళనివ్వలేదు. ఆసుపత్రి ముందే ఆయన్ని పోలీసులు అడ్డగించారు. ఇంకేముంది, యువరాజా వారికి కోపమొచ్చేసింది. సైన్యం పట్ల ఇంత దారుణంగా కేంద్రం వ్యవహరిస్తుందా.? సైన్యం డిమాండ్లను తీర్చకపోవడమేంటి.? అంటూ ఊగిపోయారు రాహుల్‌ గాంధీ. 

వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ కోసం సైనికులు, మాజీ సైనికులు డిమాండ్‌ చేస్తున్నది నిజం. కేంద్రం, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఏమిచ్చినా, సైన్యం త్యాగాలకు సరితూగదు గనుక, చాలా బాధ్యతగా కేంద్రం, ఆ డిమాండ్లను తీర్చేందుకు ముందుకు రావాల్సి వుంటుంది. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. 

కానీ, ఓ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడనగానే పరుగులు పెట్టిన రాహుల్‌గాంధీ, పాకిస్తాన్‌ సైన్యం – పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం కారణంగా చనిపోతున్న సైనికుల కుటుంబాల్ని పరామర్శించేందుకు ఏనాడన్నా వెళ్ళారా.? కనీసం, వారికి ఎప్పుడన్నా నివాళులర్పించారా.? ప్చ్‌, లేదు. భారత సైన్యం, సాహసోపేతంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తే, ఆ సర్జికల్‌ స్ట్రైక్స్‌ని అవమానపర్చేలా మాట్లాడారు రాహుల్‌. అది నిజమే అయితే, ఆధారాలూ చూపమని ఇదే యువరాజు డిమాండ్‌ చేసేశారు. 

ఒక సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది అత్యంత బాధాకరం. ఓ సైనికుడ్ని సరిహద్దుల్లో తీవ్రవాదులు ముక్కలు ముక్కలుగా నరికారు. అదెంత బాధాకరం.? యురీ ఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీన్నేమనాలి.? ఈ ఘటనలపై మాట్లాడేటప్పుడేమో, మొసలి కన్నీరు కార్చేయడం.. కనీసం, బాధిత కుటుంబాల్ని పరామర్శించడం, పార్టీ పరంగా ఆదుకుంటామని చెప్పడం.. వంటివి చేయకుండా, తమ రాజకీయ అవసరాలకోసం, పొలిటికల్‌ మైలేజ్‌ వచ్చే ఘటనల్నే తీసుకుంటారా.? 

సిగ్గు సిగ్గు.. శవ రాజకీయాలంటే ఇవే మరి.! ఇలాంటి శవ రాజకీయాలకు రాహుల్‌ గాంధీ రాను రాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోతున్నట్టున్నారు. ఎనీ డౌట్స్‌.?