సాక్షి దినపత్రిక ధర పెరిగింది. ప్రస్తుతం నాలుగు రూపాయలుగా ఉన్న ఈ పత్రిక ధరను సోమవారం నుంచి ఐదు రూపాయలకు పెంచారు. ఆది వారం రోజున ఐదు రూపాయలకు లభ్యం అయ్యే ఈ పత్రికను ఆరు రూపాయలకు పెంచారు. వివిధ కారణాల రీత్యా ఈ పెంపును చేస్తున్నామని… స్వాగతించాలని ఆ పత్రిక చైర్మన్ వైఎస్ భారతి రెడ్డి తమ పాఠకులకు చెప్పుకొచ్చారు.
ఈ పెంపు ద్వారా సాక్షి పత్రిక ఇతర పత్రికల స్థాయికి చేరింది. ఈనాడు వంటిపత్రికల ధరను ఎప్పుడో ఐదు రూపాయలు చేశారు. ఆదివారం రోజున ఆరు రూపాయలకు అమ్ముతున్నారు. అయితే ఆ పత్రిక రేటు పెంచినప్పుడు సాక్షి ధరపెరగలేదు. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పత్రిక ధరను పెంచుతున్నారు. మరి ఈ ధరపెంపు అనేది సాక్షి సంస్థాగతమైన అంశం, ఆ పత్రిక కొనే వారి వ్యక్తిగత అంశం. అయితే ఇలాంటి సందర్భంలో గతంలో సాక్షి వాళ్లు చేపట్టిన ఒక ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సాక్షి ప్రారంభం అయిన కొత్త లో కేవలం రెండు రూపాయల ధరకే ఇచ్చారు. అన్ని పేజీల్లో రంగుల్లో ఇస్తూ రెండు రూపాయలకే పాఠకులకు అందుబాటులో ఉంచారు. అందమైన ప్రపంచం రెండు రూపాయల్లోనే అంటూ యాడ్స్ ఇచ్చారు. అయితే అంతటితో ఆగలేదు. తెలుగుదినపత్రికల్నీ రెండురూపాయల్లోపు ధరకే ఇవ్వాలనే డిమాండ్ ను వినిపించారు సాక్షి వాళ్లు. ఈడిమాండ్ తో ఒక కాలమ్ నడిపించారు. అలాంటి కాలమ్ ద్వారా ఈనాడుపై ఒత్తిడి పెంచాలనేది సాక్షి అప్పటి వ్యూహం కావొచ్చు!
అలాంటి ఉద్యమం చేసిన సాక్షి కొన్ని రోజులకే తీరు మార్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ధరపెంచింది. రెండు రూపాయల పేపర్ ను రెండున్నర రూపాయలకు చేర్చింది. దీంతో అప్పట్లో ఈనాడు వాళ్లు చెలరేగిపోయారు. రెండు రూపాయల్లోపే తెలుగు పేపర్ ను అందించాలనే డిమాండ్ చేసిన వాళ్లే ధరను పెంచడం ఏమిటని దెప్పిపొడిచారు. ఆ తర్వాత సాక్షి వాళ్లు పాత నినాదాన్ని పక్కనపెట్టి… ఇప్పుడు వ్యాపార అవసరాల రీత్యా క్రమంగా ధర పెంచేసుకొంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు సాక్షిని పక్కా వ్యాపారధోరణితో నడింపించాలని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఇప్పుడు నినాదాలు పక్కన పెట్టి వ్యాపారాత్మక ధోరణితో అలా ముందుకు పోతున్నారు!