సంతోషం: సర్దార్‌ ఇప్పటికైనా గుర్తుకొచ్చారు.!

సర్దార్‌.. ఉక్కు మనిషి.. ఆయనే వల్లభాయ్‌ పటేల్‌. స్వతంత్ర భారతావనికి తొలి హోంమంత్రి.. భారతదేశం, ఇప్పుడిలా వుందంటే, ఈ రూపానికి కారణం ఖచ్చితంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాత్రమే. సంస్థానాలన్నీ దేని దారి దానిదే…

సర్దార్‌.. ఉక్కు మనిషి.. ఆయనే వల్లభాయ్‌ పటేల్‌. స్వతంత్ర భారతావనికి తొలి హోంమంత్రి.. భారతదేశం, ఇప్పుడిలా వుందంటే, ఈ రూపానికి కారణం ఖచ్చితంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాత్రమే. సంస్థానాలన్నీ దేని దారి దానిదే అన్నట్లుగా వున్న వేళ, 'ఇది మా రాజ్యం..' అని కొందరు విర్రవీగిన వేళ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తన ఉక్కు సంకల్పంతో భారతావనిని ఏకం చేశారు. ఆ భారతదేశాన్నే మనమిప్పుడు చూస్తున్నాం. లేదంటే, బారతదేశం ఇంకోలా వుండేది. 

మహాత్మాగాంధీ గురించి అందరికీ తెలుసు, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గురించి ఎంతమందికి తెలుసు.? ఈ ప్రశ్నలేసుకుంటే, సమాధానం కాస్తంత కష్టంగానే వుంటుంది మనసుకి. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కూడా స్వాతంత్య్ర సమరయోధుడే. దురదృష్టవశాత్తూ ఆయన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోయిన మన రియల్‌ హీరోలు చాలామందే వున్నారు. అందులో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఒకరు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంతమంది హీరోలున్నా, చాలా తక్కువమంది గురించే ఎక్కువగా చెప్పుకుంటాం.. చాలామందిని మర్చిపోతున్నాం. 

నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. ఆయన పట్టుదల మేరకే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌పై ఫోకస్‌ పెరిగింది. లేదంటే, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి ఈ స్థాయి గుర్తింపు లభించేది కాదు. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి.. తననెవరో గుర్తుపెట్టుకుంటారని, దేశం కోసం త్యాగాలు చెయ్యలేదు మహనీయులంతా. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ని కేవలం రాజకీయ నాయకుడిగానే చూడలేం. ఓ పార్టీకి చెందిన వ్యక్తిగానే ఆయన్ని అసలే చూడలేం. 

ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నిజాం పాలనలోని హైద్రాబాద్‌ స్టేట్‌. అదిప్పుడు భారతదేశంలో అంతర్భాగమయ్యిందంటే కారణం ఎవరు.? సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. కానీ, అదొక విద్రోహఘటన అనీ, ఇంకోటనీ అవాకులు చెవాకులు పేలేటోళ్ళు చాలామందే వుంటారు. అలాంటివారి వల్లే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. చిత్రమైన విషయమేంటంటే, మీడియా సైతం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ని గుర్తించకపోవడం. 

ఎలాగైతేనేం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ – ఉక్కుమనిషి.. అని ఇప్పుడు దేశం గుర్తిస్తోంది. ఇది ఆ మహనీయుడికి గౌరవం కాదు.. అది మనకి మనమిచ్చుకుంటున్న గౌరవం.