సరదాకి: ఆత్మహత్య చేసుకున్న జింక

సల్మాన్‌ఖాన్‌ చేతిలోకి తుపాకీ ఎగిరొచ్చింది.. సల్మాన్‌ఖాన్‌ చేతికి టచ్‌ అవకుండానే.. ఆ గన్‌లోంచి బుల్లెట్‌ దూసుకెళ్ళింది.. ఆ బుల్లెట్‌కి జింక ఎదురెళ్ళింది 'నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం' అన్నట్టుగా. ఇంకేముంది, బుల్లెట్‌ గెలిచింది,…

సల్మాన్‌ఖాన్‌ చేతిలోకి తుపాకీ ఎగిరొచ్చింది.. సల్మాన్‌ఖాన్‌ చేతికి టచ్‌ అవకుండానే.. ఆ గన్‌లోంచి బుల్లెట్‌ దూసుకెళ్ళింది.. ఆ బుల్లెట్‌కి జింక ఎదురెళ్ళింది 'నీ పెతాపమో నా పెతాపమో చూసుకుందాం' అన్నట్టుగా. ఇంకేముంది, బుల్లెట్‌ గెలిచింది, జింక ఓడిపోయింది. ఇక్కడ గన్ను సల్మాన్‌ఖాన్‌ చేతిలోకి రావడం, అది పేలడం, ఆ బుల్లెట్‌కి జింక ఎదురెళ్ళడం జరిగాయి.. ఇవన్నీ సల్మాన్‌ఖాన్‌ ప్రమేయం లేకుండానే. సో, తుపాకీ లోంచి బుల్లెట్‌ రావడం ప్రమాదం. దానికి జింక ఎదురెళ్ళడం ఆత్మహత్య చేసుకోవడం కిందే లెక్క. కథ అదిరిపోయింది కదూ.! 

కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ నిర్దోషి అంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం పట్ల నెటిజన్లలో వ్యక్తమైన ఆగ్రహానికి నిదర్శనం ఈ కథ. సినిమాల్లో హీరో, ఒంటి చేత్తో వంద మందిని చితక్కొట్టేస్తాడు. రియల్‌ లైఫ్‌లో అది సాధ్యమవుతుందా.? ఇక్కడ, జింక ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే. అది ఆత్మహత్య కాదు.. హత్య.. అంటున్నాడు ప్రత్యక్ష సాక్షి. చంపింది సల్మాన్‌ఖానేనని ప్రత్యక్ష సాక్షి హరీష్‌ దులానీ. 

ప్రత్యక్ష సాక్షి అయినప్పుడు, కోర్టుకెళ్లి సాక్ష్యమెందుకు చెప్పలేదని ప్రశ్నిస్తే, 'ప్రాణభయంతోనే' అని సమాధానమిచ్చాడు హరీష్‌. ఆ ఘటన జరిగిన సమయంలో సఫారీ డ్రైవర్‌గా హరీష్‌ దులానీ పనిచేశాడు. సల్మాన్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రే, టబు తదితరులు చింకారా (కృష్ణ జింక) వేటని ఎంజాయ్‌ చేశారు. ఆ వేటలో హీరోగారు ఎవరో కాదు సల్మాన్‌ఖాన్‌. 

జింక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొన్ని ఫొటోల్ని, సల్మాన్‌ఖాన్‌ చేత్తో పట్టుకోకుండానే గన్‌ పేలుతుండడం, జింక ఆ బుల్లెట్‌కి దూసుకొస్తుండడాన్ని చూపిస్తూ గ్రాఫిక్స్‌నీ.. నెటిజన్లు సోషల్‌ మీడియాలో పెట్టి ఓ రేంజ్‌లో కథలు అల్లుతున్నారు. నాన్సెన్స్‌, ఇదెక్కడి న్యాయం.? అని ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తాం, జడ్జిమెంట్‌ని ప్రశ్నించలేం.. అప్పీల్‌కి వెళ్ళడం మినహా. సల్మాన్‌ఖాన్‌ కేసులో హరీష్‌ దులానీ చెప్పే సాక్ష్యంతో మళ్ళీ ఈ కేసు మొదటికొస్తుందేమోనని ఆశిద్దాం. అంతకన్నా ఏం చేయగలం.?