ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మదిలో గొప్ప ఆలోచన పుట్టుకొచ్చింది. బీచ్ లవర్స్ కోసం ఓ ఫెస్టివల్‌ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్నారు. ఏమో, విదేశాల్లో ఉన్నప్పుడు సరదాగా అమ్మాయిలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేసిన (ఈ మేరకు కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడమే కాదు ప్రతిపక్షంప వైఎస్సార్సీపీ పదే పదే ఆ ఫొటోల పేరుతో రచ్చ చేస్తోంది ఎలండి..) పుత్రరత్నం నారా లోకేష్ సూచనే అయి వుండొచ్చిది.
ఏదైతేనేం, అద్భుతమైన ఆలోచన.. అనుకుంటే చంద్రబాబు హుకూం జారీ చేశారు. అధికారులూ 'సై' అనేశారు. ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరిగేందుకు రంగం సిద్ధమయ్యింది. కానీ, ఇక్కడే తేడా కొట్టేసింది. మిత్రపక్షం ఇలాంటి కార్యక్రమాలకు ససేమిరా అంటోంది. తేడా వచ్చిందో, అంతే సంగతులు.. అంటూ బీజేపీ నేతలు, టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు. మహిళా సంఘాలు ఉద్యమించాయి. ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అయితే, 'ఖబడ్దార్.. అడ్డుకుంటాం..' అంటూ బీచ్ లవర్స్ ఫెస్టివల్‌కి అల్టిమేటం జారీ చేసేసింది. దాంతో, చేసేది లేక 'తూచ్ అది అధికారిక కార్యక్రమం కాదు.. ప్రభుత్వానికీ దానికీ సంబంధమే లేదు.. అది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం..' అంటూ అధికారగణం స్పందించింది.
ప్రైవేటు కార్యక్రమం అయితేనేం, సిగ్గూ ఎగ్గూ లేని అలాంటి కార్యక్రమాలకు ఎలా మద్దతిస్తారన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. విదేశాల్లో జరుగుతోంది.. గోవాలో సర్వసాధారణం.. విశాఖను గోవా తరహాలో, విదేశాల తరహాలో మార్చేస్తే తప్పేంటి.? అన్నది కొందరు టీడీపీ నేతల వాదన. ఇది పర్యాటకానికి ఊతమిచ్చే కార్యక్రమమట. ఇకనేం, పర్యాటకం పేరుతో 'సెక్స్ టూరిజం'ని ప్రోత్సహిస్తే సరి. కొన్ని దేశాల్లో వ్యభిచారానికి చట్టబద్ధత వుంది.. అదేదో ఆంధ్రప్రదేశ్‌లోనూ చేసేస్తే బాగుంటుంది కదా.! అరరె, ఈ ఐడియా ఇంకా చంద్రబాబు సర్కార్‌కి వచ్చినట్లు లేదు, వస్తే ఆలోచించి, అమల్లో పెట్టేసినా పెట్టేస్తారు.
ఇక, బీచ్ లవర్స్ అంటూ కార్యక్రమాలు చేస్తే, ఖబడ్దార్.. వచ్చిన జంటలకి వచ్చినట్టే పెళ్ళి చేసేస్తామంటూ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఓ కొత్త కాన్సెప్ట్‌ని తెరపైకి తెచ్చింది. నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు, బీజేపీ కనిపెట్టిన పాత కాన్సెప్టే. శ్రీరామ్‌సేన పేరుతో కొందర్ని రంగంలోకి దించి, ప్రేమికుల దినోత్సవం రోజున తాళిబొట్లతో రోడ్లమీదకు పంపి, ప్రేమికులు ఎక్కడ కన్పించినా వారికి పెళ్ళిళ్ళు చేయించేశారు అప్పట్లో.
బీచ్ లవర్స్ ఫెస్టివల్‌ని బీజేపీ వ్యతిరేకిస్తోంది గనుక, తాళిబొట్లతో రెడీ అయిపోండంటూ బీజేపీ కాన్సెప్ట్‌నే ప్రతిపక్షం బీజేపీకి పరిచయం చేస్తోంది. దాంతో బీజేపీకి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెడతామని చంద్రబాబు చెబుతోంటే, అక్కడికేదో ఆయన నిజంగానే ఉద్ధరించేస్తారా.? అన్న అనుమానాలు కొందరిలో వున్నాయి. అవిప్పుడు పటాపంచలైపోయాయి.. ప్రపంచ పటంలో పెట్టడమంటే, ఇదిగో ఇలాంటి నీఛాతినీఛమైన కార్యక్రమాలతో అన్నమాట.