ఓ రెండు రాష్ట్రాలున్నాయట, ఆ రెండు రాష్ట్రాల మధ్య చాలా విషయాల్లో వివాదాలున్నాయట. ఓ రాష్ట్రానికి చెందిన 'మేటర్'ని ఇంకో రాష్ట్రం కాపీ కొట్టిందట. ఇంకేముంది, కాపీ కొట్టిన రాష్ట్రంపై ఆరోపణలు చేయడమే కాదు, ఆ రాష్ట్రానికి చెందిన అధికారులపై క్రిమినల్ చర్యలకీ ఉపక్రమించింది మరో రాష్ట్రం.
'మేం రెండో స్థానంలో వున్నాం.. మీరు 13వ స్థానంలో వున్నారు.. మీ మేటర్‌ని మేమెందుకు కాపీ కొడతాం.? మాకు ఆ ఖర్మ పట్టలేదు' అని ఆరోపణలు ఎదుర్కొన్న రాష్ట్రం ఖండించేసింది. తూచ్, మా అభివృద్ధితో పోల్చితే మీరెంత.? తొండి చేస్తారా.? అంటూ తిరగబడింది ఆ మరో రాష్ట్రం. అలా రెండు రాష్ట్రాలూ రచ్చ రచ్చ చేసుకున్నాయి. ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్నా, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడమే ఈ వివాదానికి కారణం. గిల్లి కజ్జాలనాలా.? ఇంకేమన్నా అనాలా.? వ్యవహారం క్రిమినల్ కేసుల హెచ్చరికలదాకా వెళ్ళిందంటే, ఇవి గిల్లి కజ్జాలు కావు.. జస్ట్ ఆధిపత్య పోరు మాత్రమే.
ఇప్పుడేమో ఈ రెండు రాష్ట్రాలూ ఇక కొట్టుకోడానికి వీల్లేదు. ఇద్దరికీ ఒకే ర్యాంక్ కట్టబెట్టేసింది కేంద్రం. ఆ రెండు రాష్ట్రాలూ ఏంటో తెలుసు కదా, ఆంద్రప్రదేశ్ – తెలంగాణ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి సంబంధించిన ర్యాంకులు ఇవి. గత ఏడాది ప్రకటితమైన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కి రెండో స్థానం, తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. ఈసారి అలా కాదు, రెండు రాష్ట్రాలకీ కలిసి రెండో ర్యాంకు వచ్చింది. ఇదేమి చిత్రమో కదా.!
అంటే, ఇక్కడ కేంద్రం రెండు రాష్ట్రాలకీ సేమ్ ర్యాంక్ ఇవ్వడం వెనుక ఉద్దేశ్యమేంటట.? మొదటి స్థానం గుజరాత్‌కి దక్కింది సరే, రెండో స్థానం తెలంగాణకా, ఆంధ్రప్రదేశ్‌కా.? మళ్ళీ ఇది ఇంకో పంచాయితీ. రెండు రాష్ట్రాలకీ రెండో ర్యాంక్ ఇవ్వడం ద్వారా, ఆ 'మేటర్'ని ఎవరో ఒకరు కాపీ కొట్టి వుంటారనే సందేహాలకు బలం చేకూర్చినట్లయ్యిందన్నది తాజాగా విన్పిస్తోన్న గుసగుసల సారాంశం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక రాష్ట్రానికి రెండో ర్యాంకు, ఇంకో రాష్ట్రానికి మూడో ర్యాంకూ ఇచ్చేసి వుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో. అయినా, ఈ ర్యాంకులతో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వుంటుందనే మంచి ఆలోచనను పక్కన పెట్టేసి, రాష్ట్రాలిలా కుమ్ములాడుకోవడమేంటట.? దేశంలో మిగతా రాష్ట్రాలేవీ ఈ ర్యాంకులతో పంచాయితీ పెట్టుకోవడంలేదు. అది మన తెలుగు రాష్ట్రాలకే దక్కిన గొప్ప చెత్త అవకాశంగా చెప్పుకోవచ్చేమో.!
ఇంతకీ ఈ ర్యాంకుల పంపకాల్లో 'నీతి' మీకేమన్నా అర్థమయ్యిందా.? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. మీ ఆధిపత్య పోరు పేరు చెప్పి, తెలుగు రాష్ట్రాల్లో భావోద్వేగాల్ని ఇకనైనా రెచ్చగొట్టడం మానేస్తారా.? మానెయ్యాలనే ఆశిద్దాం.