సాయమా.? ప్యాకేజీనా.? నిజం చెప్పేదెవరు.?

అబ్బో, ఆంధ్రప్రదేశ్‌కి అద్దిరిపోయే ప్యాకేజీ వచ్చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు, ఢిల్లీకి వెళ్ళి మరీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారిని సన్మానించేశారు. ప్యాకేజీ ప్రకటించిన ఇంకో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కూడా సన్మానించేశారు.…

అబ్బో, ఆంధ్రప్రదేశ్‌కి అద్దిరిపోయే ప్యాకేజీ వచ్చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు, ఢిల్లీకి వెళ్ళి మరీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారిని సన్మానించేశారు. ప్యాకేజీ ప్రకటించిన ఇంకో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కూడా సన్మానించేశారు. ఇదిగో, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకు వెళ్ళి, ఆయన్నీ పొగడ్తలతో ముంచెత్తేశారు. కాస్సేపట్లో అమిత్‌ షాని కలిసి, ఆయనకూ కృతజ్ఞతలు తెలిపేస్తారు. 

అయితే, ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయమేంటంటే, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ ఇచ్చిందా.? అది నిజమేనా.? అని. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక సాయం అందిస్తామని మాత్రమే అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఆ సాయానికి సంబంధించి ఆయన కొత్తగా చెప్పిన మాట ఏమీ లేదు. పోలవరం వాస్తవానికి జాతీయ ప్రాజెక్టు. దానికి కేంద్రమే నిధులు ఇచ్చి తీరాలి. ఆంధ్రప్రదేశ్‌కి విభజనతో ఏర్పడ్డ ఆర్థిక లోటుని కేంద్రమే భర్తీ చేయాలి.. ఇది విభజన చట్టం చెబుతున్న మాట. 

అయినాసరే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 2 లక్షల 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ లెక్క తేల్చారు. ప్రత్యేక సాయం ద్వారా 2 లక్షల కోట్ల వరకూ ఆంధ్రప్రదేశ్‌కి సాయం అందుతుందని అరుణ్‌ జైట్లీ సెలవిచ్చారు. పోనీ, ఇదే నిజమనుకుందాం. దానికి చట్టబద్ధత ఏదీ.? అనడిగితే, అట్నుంచి సమాధానం దొరకదు. అవసరమైతే చట్టబద్ధత కల్పిస్తామన్న మాట మాత్రమే చెప్పారు అరుణ్‌ జైట్లీ. 

చట్టబద్ధత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, చాలానే మాట్లాడుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకి చట్టబద్ధత వుంది. కానీ, దానికి కొత్త అర్థం చెప్పారు అరుణ్‌ జైట్లీ. జాతీయ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేతుల్లో పెడతారట. అంటే, మళ్ళీ చట్ట సవరణ జరగాలి. చట్ట సవరణ జరిగాక, వున్న చట్టబద్ధత కాస్తా పోతుంది తప్ప, కొత్తగా ఏమీ ఒరగదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదాని పూర్తిగా తుంగలో తొక్కేసి, అంతకు మించిన సాయం.. అంటున్నారు అరుణ్‌ జైట్లీ. ఇందులో ఆయనగారి అతి తెలివి ఏంటో, రానున్న రోజుల్లో తేలుతుంది. 

ఇప్పటికే నరేంద్రమోడీ ప్రధాని అయి రెండేళ్ళ మూడు నెలలు గడిచిపోయింది. మిగిలింది ఇంకో రెండున్నరేళ్ళు మాత్రమే. ఈలోగా కేంద్రం చెప్పిన సాయమో, ప్యాకేజీనో.. రెండు లక్షల కోట్లో.. రెండున్నర లక్షల కోట్లో.. వచ్చేస్తాయని అనుకోలేం. రానున్న బడ్జెట్‌లో ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయింపులు జరిగే ఛాన్సే లేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా వేల కోట్లు, లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చే అవకాశమే వుండదు. 

ఇలా కాస్త లోతుగా ఆలోచిస్తే, అంతా హంబక్‌ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. చేతిలో పని రైల్వే జోన్‌. అదే జరగడంలేదంటే ఏళ్ళ తరబడి నిర్మితమవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చుతుందని ఎలా అనుకోగలం.? రెండేళ్ళ మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా రాజధాని లేదు. శంకుస్థాపన జరిగి కూడా ఏడాది పూర్తయిపోయింది. ఇంకో రెండున్నరేళ్ళలో అది పూర్తవుతుందని ఎలా అనుకోగలం.? 

ఎట్నుంచి ఎటు చూసినా ప్యాకేజీ అనేది పెద్ద మాయ. సాయం అనేది జస్ట్‌ బిచ్చం అంతే. మారాజులకి ఆ సమయానికి ఎంత చిల్లర వుంటే, అంత చిల్లర బొచ్చెలో బిచ్చంలా వేస్తారని కూడా ఆశించలేం. ఇవన్నీ తర్వాత, అసలు ఆంధ్రప్రదేశ్‌కి అందబోయేది ప్యాకేజీనా.? సాయమా.? బిచ్చమా.? ఈ ప్రశ్నకే బీజేపీలో తలో సమాధానం చెబుతున్నారు. అయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఇచ్చింది తీసుకుంటాం..' అంటూ 70 వేల కోట్ల ప్యాకేజీ.. అనేస్తున్నారు. వాట్‌ ఏ పిటీ.!