మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిలను పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ళ తరబడి పోలీసుల నిర్బంధంలోనే వున్న ఇరోం షర్మిలకు నిన్ననే న్యాయస్థానం ‘స్వేచ్ఛా జీవితాన్ని’ కల్పించింది. అంతలోనే ఆమెను పోలీసులు అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమయ్యింది.
14 ఏళ్ళ క్రితం మణిపూర్‌లో జరిగిన నరమేధానికి నిరసనగా అప్పటినుంచీ ఇప్పటిదాకా ఆమె నిరాహారదీక్ష కొనసాగిస్తూనే వున్నారు. ప్రపంచంలో ఇంత ఎక్కువకాలం నిరాహారదీక్ష చేస్తోన్న వ్యక్తిగా రికార్డులకెక్కారు ఇరోం షర్మిల. ఘనాహారం తీసుకోనప్పటికీ, ఆమెకు బలవంతంగా ముక్కు ద్వారా ద్రవాహారాన్ని పంపిస్తున్నారు. అలా ఆమె ఇప్పటిదాకా జీవించి వున్నారు.
కాగా, వైద్య చికిత్స నిమిత్తమై మాత్రమే ఇరోం షర్మిలను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారట. ఈ విషయాన్ని ఇరోం షర్మిల సన్నిహితులే వెల్లడించడం గమనార్హం. రాజకీయ పార్టీలు, నాయకులు బుజ్జగించినా, ప్రభుత్వాలే నచ్చజెప్పాలని చూసినా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఇరోం షర్మిల నిరాహార దీక్ష చేయడం గొప్ప విషయమే. అయితే ఆమె డిమాండ్ల విషయంలో మాత్రం పాలకులు మెత్తబడకపోవడంతోనే ఆమె ఇంకా తన దీక్షను కొనసాగిస్తున్నారని ఇరోం షర్మిల సన్నిహితులు చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆమెను ఎన్నికల బరిలోకి దించాలనే ప్రయత్నం చేసింది. అయితే షర్మిల, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదనల్ని తిరస్కరించారు. తాను రాజకీయాల కోసం ఉద్యమం చేయడంలేదనీ, మణిపూర్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నానని అప్పట్లోనే ఆమె స్పష్టం చేశారు.