సినిమా పాటలు ఇలా వస్తుంటాయి. అలా వెళ్తుంటాయి. కొన్ని పాటలు మాత్రమే కొన్నాళ్లు వినిపిస్తాయి. మళ్లీ ఏదైనా మంచి పాట వస్తే దారిచ్చి తప్పుకుంటాయి. రెండువేల సంవత్సరానికి ముందు పాటలు మాత్రం ఇప్పటికీ వినిపిస్తుంటాయి. దీనికే దర్శకుడు హను రాఘవపూడి ఓ మంచి మాట అన్నారు. మనం వెదుక్కుంటూ వెళ్లే పాటలు…అని.
ఈ జనరేషన్ సినిమా కవులు చాలా మందే వున్నారు. ఆ సినిమా వరకు మంచి సాహిత్యం కొంత వరకు, క్యాచీ సాహిత్యం కొంత వరకు అందిస్తుంటారు. తెలుగింగ్లీష్ పదాలు వినిపిస్తూ మ్యాజిక్ లు చేసుంటారు. కొంతమంది ఆశ..అనగానే శ్వాస… పాట..అనగానే బాట..అంటూ రొడ్డ కొట్టుడు మూస ప్రాస పదాలు వాడేస్తుంటారు.
అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలతో వచ్చే పాటలు అరుదు. రాసే వారూ అరుదు. వేటూరి ఎన్ని పాటలు రాసినా ఈ పునరుక్తి దోషం లేదా అలవాటు అస్సలు కనిపించేది కాదు. సిరివెన్నెల లోతు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కరలేదు. చంద్రబోస్ కాన్సెప్ట్ పాటలు రాయడంలో స్పెషలిస్ట్. రామజోగయ్య గురువు సిరివెన్నెల వారసత్వం నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మంచి పద ప్రయోగాలు అప్పడప్పుడు చేస్తుంటారు.మిగిలిన యంగ్ రైటర్స్ అంతా అడపా దడపా మంచి పాటలు రాస్తున్నారు
కానీ మొత్తంగా చూసుకుంటే మరీ డెప్త్ కు వెళ్లి సాహిత్య విలువలు వెదికేంత సీన్ ఈ జనరేషన్ పాటల్లో తక్కువ. ఇలాంటి టైమ్ లో రచయితే కెకె ఓ పాట రాసారు. హనురాఘవపూడి దర్శకత్వంలో తయారైన సీతారామం సినిమాలోదీ పాట. వేటూరి మాదిరిగా అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలు, కొత్త ఆలోచనలు ఈ పాటలో కనిపిస్తాయి. సిరివెన్నెల మాదిరిగా తేలిక పదాలు దొర్లుతాయి. వెరసి మాంచి భావుకత పాటనిండా పరుచుకుంది.
అదే ఈ పాట..ఇందులో ఈ లైన్ బాగుంది..ఈ ప్రయోగం బాగుంది అని చెప్పే కన్నా పాటను వినడం కన్నా, ఓసారి చదివితే బాగుంటుంది. జగత్తు చూడని మహత్తు… ఇక నా అవసరం లేదని చందమామ విసుక్కుంటూ వెళ్లాడు…వెన్నెల ఇక్కడుందా అని తారలన్నీ అక్కడ చేరాయి…ఆమె వేలు తాకి నేల ఏకంగా ఇంచు పైకి లేచింది.. నదిలా దూకే పైట పరువం…దానిపైనే పడే పులిలాంటి పడుచుతనం..అన్నింటికీ మించి, విల్లు ఎక్కుపెట్టి, మెళ్లో తాళి కట్టి..మరలా రాముడు కావడం..
ఇలా ఎన్ని విశేషాలో ఈ పాటలో. సాహిత్యాభిమానులకు కచ్చితంగా నచ్చే పాట. ఎస్పీ చరణ్ పాడిన పాటకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
ఇంతందం దారిమళ్లిందా
భూమి పైకి చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా
జగత్తు చూడని..మహత్తు నీదెలే
నీ నవ్వు తాకి తరించే తపస్సిలా
నిశీధులన్నీ తలొంచే తుషారానివా
..
విసుక్కునే వెళ్లాడు చందమామనే..
నాకు పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకింత వెన్నెలేంటనే
…
నీదే వేలు తాకి నేలే ఇంచుపైకి తేలే వింత వైఖరి
వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుంది వేటాడే పడుచుదనం
దాసోహమంది ఈ ప్రపంచమే
అదంత నీ దయే
…
చిలకే కోక కట్టి, నిన్నే చుట్టు ముట్టి
సీతాకోకలాయనా
విల్లే ఎక్కుపెట్టి, మెళ్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా
…
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్దం చాటింది నీ పైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే