సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడం, అందులో ఆమె కురుచ దుస్తులు ధరించి వుండడం.. ఆ ఫొటోలు చూసి కొందరు చొంగ కార్చుకుంటే, ఇంకొందరు జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయడం, దానికి కౌంటర్‌గా రకుల్ కూడా నోరు పారేసుకోవడం.. రకుల్‌పై మండిపడుతూ నెటిజన్లు రివర్స్ కౌంటర్ ఎటాక్ చేయడం తెల్సిన విషయాలే.
సోషల్ మీడియా అంటేనే బూతు.. అనేంతలా కొందరు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివాటిని ఉపయోగించేస్తున్నారు. వాట్సాప్ ఇందుకు అతీతమేమీ కాదు. సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ప్రధానంగా ఈ సోషల్ మీడియా దెబ్బకు విలవిల్లాడుతున్నారన్నది నిర్వివాదాంశం. ప్రధాని నరేంద్రమోడీ కావొచ్చు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావొచ్చు.. ఇతర రాజకీయ నాయకులు కావొచ్చు.. వీళ్ళవరూ 'బూతు కామెంట్ల' నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
మొన్నీమధ్యనే వైఎస్ జగన్ సోదరి షర్మిల సోషల్ మీడియాలో తనపై జరిగిన, జరుగుతున్న జుగుప్సాకరమైన ప్రచారంపై మండిపడుతూ పోలీసులను ఆశ్రయించారు. అంతకు ముందూ చాలామంది సోషల్ మీడియాలో బూతుల ప్రవాహంపై పోలీసులను ఆశ్రయించారు.. కొందరిపై చట్టపరమైన చర్యలూ తీసుకున్న దాఖలాలున్నాయి. కానీ, బూతుల ప్రవాహమైతే ఆగడంలేదు సరికదా.. ఇంకా ఇంకా ఎక్కువైపోతోంది.
యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలు కావొచ్చు, ట్విట్టర్‌లో పోస్ట్ అయిన కామెంట్స్ కావొచ్చు.. వాట్సాప్‌లో షేర్ అవుతున్న మెసేజ్‌లు కావొచ్చు.. వీటిని 'ట్రేస్' చేయడం అంత తేలిక కాదు. అదే సమయంలో, ఒకరా? ఇద్దరా? వందలాది మంది.. వేలాదిమంది బూతురాయుళ్ళున్నారు సోషల్ మీడియాలో. వీరందరిపైనా చర్యలు తీసుకోవడం సాధ్యమయ్యే పనేనా.?
షర్మిల ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీసులూ సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొందరిపై చర్యలు తీసుకున్నారు. అయితే అవి రాజకీయ ప్రేరేపితమైన అరెస్టులన్న దుమారం చెలరేగింది. సోషల్ మీడియాకి సెన్సార్ లేదు కాబట్టి, అక్కడ బూతుల ప్రవాహం ఆగిపోతుందని అనుకోలేం. కానీ, పోలీసుల వైపు నుంచి కొందరి మీద అయినా కఠిన చర్యలు తీసుకునే పరిస్థితులుంటే.. కొంత తగ్గుముఖం పట్టే అవకాశం వుంటుందంతే.