దేశం కాని దేశంలో తుదిశ్వాస విడిచిన అతిలోకసుందరి శ్రీదేవి భౌతికకాయం ఇంకా ఇండియా చేరలేదు. శనివారం రాత్రి 11గంటల ప్రాంతంలో దుబాయ్ లో ఆమె మరణిస్తే… ఆదివారం రాత్రి వరకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు. ఆ దేశంలోని రషీద్ హాస్పిటల్ లో ఆమె పార్థీవ దేహం ఉంది. మరికొన్ని గంటల్లో ప్రత్యేక విమానంలో ముంబయికి తీసుకొస్తారు.
ముంబయిలోని శ్రీదేవి నివాసంలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల కోసం కొన్నిగంటల పాటు శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచుతారు. ఆ వెంటనే శాంతాక్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
బోనీకపూర్ చెల్లెలి కొడుకు పెళ్లి కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు శ్రీదేవి. పెళ్లి వేడుకలో ఒకతంతు ముగిసిన తర్వాత మరో డిజైనరీ డ్రెస్ వేసుకోవడం కోసం హోటల్ లోని తన రూమ్ కు వెళ్లారు. అక్కడే ఆమె బాత్రూమ్ లో తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారని తెలుస్తోంది.
నిన్న రాత్రికి పోస్ట్ మార్టం పూర్తయినప్పటికీ.. దౌత్యపరమైన కారణాల వల్ల శ్రీదేవి భౌతికకాయం ఇండియాకు చేరడానికి చాలా ఆలస్యమైంది. ఆమె కన్నుమూసి 24 గంటలు దాటినా భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకురాకపోవడంతో ఆమె అభిమానులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.