తమిళ నాయకులకు ఇదేం పిచ్చి…!

'పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి'…అనే పాట మాదిరిగా రాజకీయ నాయకుల్లో అనేక రకాల పిచ్చోళ్లు ఉంటారు. ఇలాంటి పిచ్చి నాయకులు తమిళ రాజకీయాల్లో ఎక్కువగా కనబడతారు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్నట్లుగా దేశంలోని…

'పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి'…అనే పాట మాదిరిగా రాజకీయ నాయకుల్లో అనేక రకాల పిచ్చోళ్లు ఉంటారు. ఇలాంటి పిచ్చి నాయకులు తమిళ రాజకీయాల్లో ఎక్కువగా కనబడతారు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్నట్లుగా దేశంలోని రాజకీయ నాయకులందరిలోకి తమిళ నాయకులు చాలా తేడాగా ఉంటారు. దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా కావాలని  పార్టీ  నాయకుల్లో అనేకమంది కోరుకున్నారు. ఇలా కోరుకున్నవారిలో ఓ ప్రముఖ నాయకుడున్నాడు. ఇంతవరకు నాయకులకు సంతోషమే. కాని ఆ నాయకుడు శశికళ పేరును ఉచ్చరించిన పాపానికి పార్టీ నుంచి దూరం చేశారు. దీంతో ఆయన ఆగ్రహించి శశికళకు వ్యతిరేక వర్గాన్ని తయారుచేయడంలో బిజీగా ఉన్నాడు. అసలు కథేమిటో చూద్దాం.

జయలలిత కన్ను మూశాక శశికళ ప్రధాన కార్యదర్శి  కావాలని కోరుకున్నవారిలో చెన్నయ్‌ మాజీ మేయర్‌, అన్నాడీఎంకేలో ప్రముఖ నాయకుడు సైదై దొరై స్వామి ఒకరు. ఆయన కొందరు నాయకులతో కలిసి పోయస్‌ గార్డెన్‌కు వెళ్లి మీరే పార్టీ చీఫ్‌ కావాలంటూ శశికళను వేడుకున్నారు. ఆ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు 'వికె శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరాం' అని చెప్పారు. ఇలా చెప్పడంలో తప్పేమైనా ఉందా? ఏమీ లేదు కదా. కాని శశికళ మద్దతుదారులకు, అనుచరులకు ఇందులో పెద్ద తప్పు కనిపించింది. చిన్నమ్మ అనకుండా పేరుతో సంబోధిస్తావా? నీకెంత పొగరు? అంటూ ఆగ్రహించారు. ఇక నుంచి పోయస్‌ గార్డెన్‌ వైపు కన్నెత్తి చూడకూడదని శశికళకు గట్టి మద్దతుదారైన పార్టీ అధికార ప్రతినిధి పొన్నయన్‌ ఆదేశించారు. దీంతో ఒళ్లు మండిపోయిన దొరైస్వామి చిన్నమ్మకు శత్రువుగా మారిపోయి జయ మేనకోడలు దీపా జయకుమార్‌ను రంగంలోకి దింపేందుకు కృషి చేస్తున్నారు. పేరు పెట్టి పిలవకూడదనడం పిచ్చి కాక మరేమిటి? శశికళకు ఏం హోదా ఉందని ఈ ఆంక్షలు?

జయలలిత అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరడానికి కొంతకాలం ముందు ఇలాంటి ఘటనే అసెంబ్లీలో జరిగింది.  తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి  ఇద్దరూ దిగ్గజాలే. ఈ రాష్ట్ర రాజకీయాల్లో 'దిగ్గజ నేతల'ను ఆయా పార్టీల నాయకులు పేర్లతో పిలవరు. అలా పిలిస్తే అగౌరవపరిచినట్లు. అణ్ణాదురైని అణ్ణా అని, ఎంజీఆర్‌ను పురట్చి తలైవర్‌ అని, కరుణానిధిని కలైంజర్‌ అని…ఇలా పిలుస్తుంటారు. వీరందరికంటే జయలలిత రెండాకులు ఎక్కువ చదువుకుంది కదా. ఆమెకున్న బిరుదులకు లెక్కలేదు.  తమిళ ప్రజలంతా ఆమెను 'అమ్మ' అని, 'పురట్చితలైవి' అంటారేగాని  జయలలిత అనరు. సంబోధనకు సంబంధించిన ఇగో తమిళ నాయకులకు బాగా ఉంది. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు చెందిన సభ్యుడొకరు కరుణానిధిని పేరుతో సంబోధించారు. దీంతో డీఎంకే సభ్యులు ఆగ్రహించారు. కుమారుడు స్టాలిన్‌ కోపంతో లేచి తన తండ్రి 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా చేశారని, అలాంటి నాయకుడిని పేరుతో పిలవడమేమిటని ప్రశ్నించారు. 

దీంతో స్పీకర్‌ ధనపాల్‌ కలుగజేసుకొని మాజీ ముఖ్యమంత్రిని పేరుతో పిలిస్తే అభ్యంతరం లేదని, కాని ప్రస్తుత ముఖ్యమంత్రిని పేరుతో పిలవకూడదని రూలింగ్‌ ఇచ్చారు. దీంతో డీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. ఈ వివాదంపై లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కాశ్యప్‌ మాట్లాడుతూ ఇదొక అనవసర వివాదామన్నారు. లోక్‌సభలో మంత్రులు, ఎంపీలు  సభలో ఒకరినొకరు సంభోదించుకునేటప్పుడు గౌరవనీయ, మాననీయ అనే గౌరవ వాచకాలు వాడతారని, గొప్పగా పొగడరని అన్నారు. బయట సభ్యులంతా ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకుంటారని చెప్పారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను పార్లమెంటులో సమావేశాల్లో సి.రాజగోపాలచారి 'జవహర్‌' అని సంభోదించేవారని సుభాష్‌ చెప్పారు. ఇదంతా నాయకుల మధ్య ఇగో ప్రాబ్లెం. ఇక మన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో గౌరవంగా పిలుచుకోవడం అటుంచి బూతులు తిట్టుకుంటారు.