తరాల అంతరాలను అధిగమించిన దర్శకుడు!

సినిమా ఇండస్ట్రీలో హీరోకు తరాల అంతరాలు ఉండవు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ.. ఇలా ఏ ఇండస్ట్రీని గమనించినా ఈ విషయం స్పష్టం అవుతోంది! 1980లలో డ్యూయెట్లు పాడిన హీరోలే ఇప్పటికీ అమ్మాయిలతో చిందులేస్తున్నారు.…

సినిమా ఇండస్ట్రీలో హీరోకు తరాల అంతరాలు ఉండవు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ.. ఇలా ఏ ఇండస్ట్రీని గమనించినా ఈ విషయం స్పష్టం అవుతోంది! 1980లలో డ్యూయెట్లు పాడిన హీరోలే ఇప్పటికీ అమ్మాయిలతో చిందులేస్తున్నారు. శరీరంలో వచ్చిన తేడాలతో సంబంధాలు లేకుండా ఇప్పటికీ వీరు యాంగ్రీయంగ్‌మ్యాన్‌లే. అంతకు ముందు తరం హీరోలను చూసుకొన్నా ఇదే పరిస్థితి. బానలాంటి పొట్టను వేసుకొన్న హీరోలు కూడా కాలేజీ స్టూడెంట్సే! మరి హీరోస్వామ్య ఇండస్ట్రీలో వారి దర్బార్ అలా సాగింది, సాగుతోంది! 

మరి హీరోయిన్ల టైమ్‌పిరియడ్ గురించి వేరే మాట్లాడుకోనక్కర్లేదు. ఇక దర్శకుల పరిస్థితి ఏమిటి? అంటే ఇది ఇంకో రకమైన వ్యవహారం. ఎన్నో సూపర్‌హిట్స్‌ను తీసిన దర్శకులు కూడా ఒక దశకు వచ్చాకా ఫేడ్‌ఔట్ కావాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. కుర్రతరంతో పోటీ పడటం.. నయా ట్రెండ్‌లను పట్టుకోవడంలో వారికి సాధ్యం కానటువంటి పరిస్థితే ఉంది. 1970ల చివర్లో కెరీర్‌ను ప్రారంభించి.. 80లలో ఒక వెలుగు వెలిగి, స్టార్ డైరెక్టర్లుగా చెలామణి అయ్యి.. 90లలోకి వచ్చాకా కొంత స్లో అయిపోయి.. 2000లోకి వచ్చాకా పూర్తీగా ఆగిపోయిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. దక్షిణాదిలో అలా తరం మారాకా తట్టుకొని నిలబడలేకపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ పేర్లన్నీ రాస్తే ఆ లిస్టు చాంతడంత అవుతుంది. 

ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన వారు కూడా తమ కెరీర్‌ను సరిగా డైరెక్ట్ చేసుకోలేకపోయారు. మరి అలా ఎంతో మంది స్టార్ డైరెక్టర్లే కనుమరుగు అయిన ఈ ఇండస్ట్రీలో తమ కెరీర్‌ను అందంగా మలుచుకొన్న పాతతరం వారు కూడా కొంతమంది ఉన్నారు. వీరు అతి తక్కువమంది. అలాంటి వారిలో ఒకరు .. ప్రియదర్శన్. దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఏకధాటిగా సినిమాలు తీస్తున్న అతితక్కువమంది భారతీయ దర్శకుల్లో ప్రియదర్శన్ ముఖ్యులు. ఒక జోనర్ అని గాక.. అన్ని రకాల సినిమాలతోనూ భాషలకు అతీతంగా అభిమానులను సంపాదించుకొన్న దర్శకుడు ప్రియదర్శన్ నాయర్.

1984 నుంచి 2000 సంవత్సరం వరకూ మలయాళ సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్.  అక్కడి టాప్‌స్టార్ మోహన్‌లాల్‌కు స్నేహితుడిగా, లాల్‌కుట్టితో సంచలనాత్మక మైన హిట్స్ రూపొందించిన దర్శకుడిగా.. అనేక రకాల ప్రయోగాలు చేసిన దర్శకుడిగా పేరు. కేవలం మలయాళంలోనే కాదు.. తెలుగు, తమిళ ఇండస్ట్రీలోకూ ప్రియదర్శన్ పేరు మార్మోగింది. ఈ రెండు భాషల్లోని టాప్ హీరోలు ప్రియదర్శన్‌ను కేరళ దాటించుకొని తీసుకు వచ్చి సినిమాలు రూపొందించారు. ఇక ప్రియదర్శన్ సినిమాలను రీమేక్ చేయడం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని అనేక మంది దర్శక, నిర్మాతలకు ఎంతో ఇష్టమైన అంశం. కథ ప్రియదర్శన్ అంటూ టైటిల్‌కార్డ్స్‌లో గర్వంగా వేసుకొన్న తెలుగు సినిమా రూపకర్తలు ఎంతో మంది ఉన్నారు. మరి అదంతా ఒక గతం. ప్రియదర్శన్ స్వర్ణయుగం. ఆ యుగంలో ఇలావెలిగిన వారెంతోమంది ఉన్నారు. కానీ వారిలో ఇప్పుడు కూడా ఉనికిని కలిగిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే ప్రియదర్శన్ మాత్రం అలాంటి క్రైసిస్‌లో పడలేదు!

చాలా తెలివిగా తన కెరీర్‌ను మలుచుకొన్నాడు. మలయాళ సినీపరిశ్రమలోకి కొత్తనీరు వస్తున్న తరుణంలో దీర్ఘదర్శిలా వ్యవహరించాడు ప్రియదర్శన్. 2000 సమయంలో ఎంచక్కా హిందీ వైపు వచ్చాడు. బాలీవుడ్‌లో ఆ సమయంలో ఉన్న వ్యాక్యూమ్‌ను అర్థం చేసుకొని.. తెలివిగా స్థానాన్ని సంపాదించుకొన్నాడు. 

2001 నుంచి 2010ల మధ్య బాలీవుడ్‌లో అత్యధిక సినిమాలను రూపొందించిన దర్శకుల జాబితాలో రెండో స్థానంలో ఉంటాడు ప్రియదర్శన్. ఈ టైమ్ పిరియడ్‌లో డేవిడ్ ధావన్ ఎక్కువ సినిమాలు రూపొందించగా..31 సినిమాలతో రెండో స్థానంలో ఉంటాడీయన! కచ్చితంగా ఎనబైల స్టార్ దర్శకులు ఎక్కడ మందగమనంలో పడిపోయారో.. అక్కడే ప్రియదర్శన్ వీర విజృంభణ మొదలైంది. బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్స్ అనదగ్గ సినిమాలను రూపొందించాడు. ఈ మలయాలీ రూపొందించిన సినిమాలు కలెక్షన్ల రికార్డులనే సృష్టించాయి!

మరి చేవ ఉంది అలాంటి సినిమాలు రూపొందించాడు.. కొత్త తరానికి కూడా దగ్గరయ్యాడు..అది ప్రియదర్శన్ ప్రతిభ అనుకోవచ్చు. అయితే ఇది ఇక్కడ ప్రతిభ కన్నా మ్యానేజ్‌మెంట్ స్కిల్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రియదర్శన్ బాలీవుడ్‌లో తన తొలి దశకంలో రూపొందించిన ముప్పై ఒక్క సినిమాల్లో తొంబై తొమ్మిది శాతం రీమేక్‌లే! ఎనబైలలో.. మల్లూవుడ్‌లో వచ్చిన సూపర్‌హిట్ సినిమాలను రెండువేల సంవత్సరం తర్వాత ప్రియదర్శన్ మలయాళంలో రీమేక్ చేయడం మొదలుపెట్టాడు. ఆ కథల్లో ఉన్న సత్తా.. బాలీవుడ్ ప్రేక్షకులకు అవి కనెక్ట్ అయిన విధానంతో ఈ దర్శకుడు వెలిగిపోయాడు. తను మలయాళంలో రూపొందించిన సినిమాలు కొన్ని… తన తరం దర్శకులు రాసి పెట్టి ఉంచిన కథలు మరికొన్ని.. వీటన్నింటినీ హిందీ జనాలకు చూపించాడు ఈ దర్శకుడు. వాటిల్లో.. మాల్‌మాల్ వీక్లీ, హేరాఫేరి, భాగామ్ భాగ్, ధోల్, హల్‌చల్, గరమ్‌మసాలా, చుప్‌చుప్‌కే, హంగామా.. తదితర సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. వీటిలో కొన్ని మాత్రమే ప్రియదర్శన్ సొంత కథలు. ఒకటీ రెండు సినిమాలు హిట్ అయ్యేసరికి మలయాళంలోని అనేక సబ్జెక్ట్‌లను ఎంచక్కా హిందీవైపు తీసుకెళ్లాడు ఈ దర్శకుడు. వాటన్నింటి విషయంలోనూ అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో ప్రియదర్శన్ డిమాండ్ ఉన్నదర్శకుడే!

ప్రియదర్శన్‌తో పాటు ఎనబైలలో వెలిగిన ఎంతో మంది.. ఇప్పుడు ఉనికి కోల్పోగా..  ఇతడు మాత్రం తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నాడు. రీమేక్ సినిమాలతోనే అయితేనేం.. కొంత దీర్ఘదర్శిలా మరికొంత ప్రాప్తకాలజ్ఞతతో రాణిస్తున్నాడితను. మరి ఈ రకంగా చూస్తే ప్రియదర్శన్ కెరీర్ ఒక మేనేజ్‌మెంట్ పాఠమే!