‘మహరాజా’ సొంత కోటకు వచ్చేశాడు. ‘టాటా’ అంటే వీడ్కోలు మాత్రమే కాదు, స్వాగతం కూడా. ఎప్పుడో 1953లో ‘టాటా’కు టాటా చెప్పాడు. మళ్ళీ వారం క్రితమే (8 అక్టోబరు 2011) ‘టాటా’ గూటికి చేరిపోయాడు.
అవును. ‘ఎయిర్ ఇండియా’నే. అప్పట్లో నిజంగానే ‘ఆకాశ సామ్రాజ్యాన్ని’ పాలించిన వాడే. నాడు ‘ఎగిరే’ ఓపిక లేని స్థితిలో ‘టాటా’ ఒళ్ళో వాలాడు. ‘మహరాజా’ను వదలుకున్నది జంషెడ్ ఆర్. టాటా అయితే, ఇప్పుడు అదే ‘మహరాజా’ను చేరదీస్తున్నది రతన్ టాటా. ఇప్పుడు ‘మహరాజా’ మళ్లీ శక్తి పుంజుకుంటాడా? ఈ ‘మహరాజా’ విమానప్రయాణీకులందరికీ సుపరిచితుడే. నెత్తికి టర్బన్ ధరించి, పెద్ద పెద్ద మీసాలతో, సాదరంగా ఆహ్వానం పలికే ‘ఎయిర్ ఇండియా’ చిహ్నాన్ని వారెవ్వరూ మరచి పోలేరు.
నిజానికి జంషెడ్ ఆర్.డి. టాటా ‘ఎయిర్ ఇండియా’ ను, పండిట్ నెహ్రూ హయాంలోని కేంద్ర సర్కారు తీసేసుకున్నా, జంషెడ్ ఆర్. టాటాను ఆ సంస్థకు ఛైర్మన్ గానే వుంచింది. కేంద్రంలో కాంగ్రెస్ పాలన వున్నంత కాలం, ‘ఎయిర్ ఇండియా’ గమనాన్ని టాటాయే ఆ పదవిలో నిర్దేశిస్తూ వచ్చారు. నెహ్రూ తనయ ఇందిర ప్రధాని అయ్యాక కూడా, ‘ఎయిర్ ఇండియా’కూ, టాటాకూ మధ్య అనుబంధం కొనసాగుతూనే వుంది. ఈ లోగా ఇందిర దేశంలో ‘ఎమర్జన్సీ’ ప్రకటించి, తర్వాత ఎన్నికలు నిర్వహించారు.
ఆప్పుడు కాంగ్రెస్ ఓటమి పాలయి, జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. మురార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. ఒక రోజు (1978లో) జె ఆర్.డి టాటా పొద్దునే పత్రికలో తన మీద వచ్చిన వార్త చదివి ఉలిక్కి పడ్డాడు. ‘ఎయిర్ ఇండియా’ ఛైర్మన్ పదవి నుంచి తనను తొలగించినట్లు వచ్చినట్టు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ‘ఇది నిజమా?’ అని ఆయనకే సందేహం వచ్చింది. సెక్రటరీని పిలిచి అడిగారు. ‘నిజం కాకపోవటం ఏమిటి? మీ ఛైర్ లో మాజీ ఎయర్ మార్షల్ సౌకర్యంగా కూర్చున్నారు కూడా’ అని ఆమె బదులిచ్చారు.
టాటాకూ ఎయిర్ ఇండియాకూ వున్న అనుబంధం ఇంత మాత్రమే కాదు. అది 1932. అక్టోబరు నెలలో ఒక రోజు. కరాచీ నగరం.(ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో వున్నా, అప్పడు ఇండియాలో అంతర్భాగమే.) జె.ఆర్.డి టాటాకు 28 యేళ్ళే. సింగిల్ ఇంజిన్ ఇండియా ‘ఎయిర్ ఇండియా’ విమానం ఎక్కి ముంబయి (అప్పటి బొంబాయి) వచ్చారు. అప్పట్లో ప్రపంచంలో ఎక్కడ స్థానిక ప్రభుత్వం అండ లేకుండా ప్రయివేటు విమానాలు ఎగిరేవి కావు. కానీ ‘టాటా’లు ఈ పని చేశారు.
తొలుత ఉత్తరాలను తరలించేందుకు ‘కార్గో’ ఫ్లయిట్స్లాగే ‘ఎయిర్ ఇండియా’ విమానాలను వాడేవారు. అప్పుడు విమాన సిబ్బంది కాకుండా, ఒకే ఒక ప్రయాణికుడు ప్రయాణించటానికి మాత్రమే జాగా వుండేది. 1937 నాటికి పరిస్థితి అదే. కానీ, ఆరేళ్ళలోనే 15 విమానాలను నడిపే స్థితికి సంస్థ ఎదిగింది. ఈ వివరాలన్నీ టాటాల మీద రుస్సీ ఎం.లాలా రాసిన గ్రంథంలో వుంటాయి. జె ఆర్.డి టాటా సాంకేతిక వృధ్ధి, వాణిజ్యానికి ఎలా తోడ్పడుతుందో ముందే అంచనా వెయ్యగలిగేవారు. వచ్చేది ‘వాయు శకం’ (ఎయిర్ ఏజ్’) అని, ఇట్టే గ్రహించగలిగారు.
రైలు ప్రయాణంలాగే, విమానయానం కూడా సర్వసాధారణం కాబోతుందని ఊహించారు. ఆయన ఊహ నిజమయ్యింది. 1946 వచ్చేటప్పటికి విమాన ప్రయాణికులు పెరిగారు. ‘కార్గో’ విమానాలను మించి, ‘పాసింజర్’ (ప్రయాణికుల) విమానాలు వచ్చేశాయి. ఇండియా నుంచి విమానయానం చేసే ప్రతీ మూడవ ప్రయాణికుడూ ‘ఎయిర్ ఇండియా’లో ప్రయాణించేవాడు. (ఇతర దేశాల విమాన సంస్థల విమానాలు కూడా సమృధ్దిగానే వుంటాయి కదా!)
అప్పటికి ఇదే సంస్థనుంచి 50 విమానాలు ఎగిరేవి. స్వరాజ్యం వచ్చేనాటికి, ‘ఎయిర్ ఇండియా’ అంతర్జాతీయ సర్వీసులకు తెరతీసింది. 1948 సంవత్సరం ముగిసే సంస్థ లాభాల్లోకి వెళ్ళింది. ఇక స్వతంత్ర భారతంలో (ప్రభుత్వం సంస్థను స్వాధీనం చేసుకున్నా కూడా) ‘ఎయిర్ ఇండియా’ దే హవా. ఓ రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. విదేశాలనుంచి, ఇండియా వచ్చే ప్రయాణీకుల్లో 75 శాతం ‘ఎయిర్ ఇండియా’లోనే వచ్చేవారు. ప్రపంచ ప్రసిధ్ద చిత్రకారుడు సాల్వెడెరా డాలీ ‘యాష్ ట్రే’ను డిజైన్ చేసి, ‘ఎయిర్ ఇండియా’కు బహూకరించాడు.
విమానంలో కల్పించే సౌకర్యాల్లో ఎక్కడ ప్రమాణం తగ్గినా, జె. ఆర్.డి టాటా సిబ్బంది మీద విరుచుకు పడేవారు. మరీ ముఖ్యంగా ప్రయాణీకులకు చిన్న ఇబ్బంది కలుగ కుండా జాగ్రత్త తీసుకునే వారు. తానే స్వయంగా ప్రయాణించి కూడా తెలుసుకునే వారు. ‘టీ కూడా కాఫీ రంగులో ఉందేమిటి?’ అని అడిగి, వెంటనే సరిదిద్దుకునేలా చేశారు. ఎయిర్ హోస్టెస్ ల కొప్పులు, వాళ్ళలను మించి వున్నాయని చెప్పి మార్పించారూ` అని ఆయన జీవిత చరిత్ర కారుడు రాశాడు.
ఇక డెభ్భయ్యవ దశకం వచ్చేసరికి ‘ఎయిర్ ఇండియా’తో పాటు, దాని ఖ్యాతికూడా నింగిని తాకింది. పదివేల మంది సిబ్బంది తో 54 దేశాలలో విమానాలను నడిపింది. ఆ దశకంలోనే జె ఆర్.డి టాటా ‘ఎయిర్ ఇండియా’ ఛైర్మన్ గా కూడా తప్పుకోవాల్సి వచ్చింది కదా! అయినా మరో దశకం పాటు ఇదే వేగంలో ‘ఎయిర్ ఇండియా’ తిరిగింది. తొంభయ్యవ దశకం నుంచి పోటీ బాగా పెరిగింది.
కాంగ్రెస్ ప్రధానిగా పి.వి. నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల మహిమ కావచ్చు. అంతవరకూ అంతర్జాతీయ సర్వీసులు వేరుగా నడిపినా, 2007 వచ్చేసరికి దేశీయ సర్వీసులను నిర్వహించే ‘ఇండియా ఎయిర్లైన్స్’ ను ‘ఎయిర్ ఇండియా’ లో విలీనం చేశారు. ఈత రాని వాడిని రక్షించ బోతే, ఈత వచ్చిన వాడు మునిగిపోయినట్లు, లాభాల్లో వున్న ‘ఎయిర్ ఇండియా’, నష్టాల్లో వున్న ‘ఇండియన్ ఎయిర్ లైన్స్’ ధాటికి కుదేలయిపోయింది.
ఇక అది మొదలు ‘ఎయిర్ ఇండియా’ కు నష్టాలే నష్టాలు. 2018`19 ఆర్థిక సంవత్సరం లో నికర నష్టం 8,556 కోట్లు. 2020 నాటికి రు.52 వేల కోట్ల అప్పుల ఊబిలోకి దిగిపోయింది. మధ్యలో ప్రభుత్వం రు. 30వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత చేతులెత్తేసి, అమ్మకానికి పెట్టింది. వేలంలో, టాటా గ్రూపు తిరిగి ‘ఎయిర్ ఇండియా’ను దక్కించుకుంది.
అప్పుడు (1953లో) ‘ఎయిర్ ఇండియా’ ను ప్రభుత్వం తీసుకునేటప్పటికి, ఇండియాలో సరయిన విమానాశ్రయాలు లేవు. అవన్నీ మౌలిక వసతులకల్పనలో భాగంగా ప్రభుత్వ ధనంతో నిర్మించింది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలున్నాయి. టాటా గ్రూపు ఇప్పటికే సింపూర్ ఎయిర్ ఏసియా ఇండియాలో 84 శాతం, విస్తారాలో 51 శాతం వాటాలు కలిగి వుంది. ‘ఎయిర్ ఇండియా’ సొంతం కావటంతో ఇండియాలోని వాయుసేవల్లో 27 శాతం మార్కెట్టును కైవసం చేసుకుంటుంది. ‘మహరాజా’ మళ్ళీ పాత వైభవాన్ని పొందే అవకాశం లేక పోలేదు!
సతీష్ చందర్