వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఆయన తనయుడు భూపేష్‌రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇదో పెద్ద కామెడీ అని జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్లు టీడీపీలోనే ఉన్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మళ్లీ టీడీపీలో చేరడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నే నారాయణరెడ్డి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. దీంతో దేవగుడి నారాయణరెడ్డి, ఆయన తనయుడు భూపేష్‌రెడ్డి రాజకీయంగా కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్లీ యాక్టీవ్ అయ్యారు. కడప జిల్లా టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబును కలిశారు. నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
జమ్మలమడుగులో టీడీపీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక మీదట జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తామని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని భూపేష్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన తనయుడు భూపేష్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కొత్త వాళ్లను చేర్చుకుంటే బలం పెరుగుతుందని, ఉన్న వాళ్లకే మళ్లీమళ్లీ పసుపు కండువాలు కప్పడం ఏంటో అని జమ్మలమడుగు వాసులు నిట్టూర్చుతున్నారు. ఇదేం కామెడీ బాసూ అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.