cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మీ 'మా' అతి ఇప్పట్లో తగ్గదా..?

మీ 'మా' అతి ఇప్పట్లో తగ్గదా..?

ఎన్నికలపోయాయి, ఓడిపోయినోళ్ల రాజీనామాతో మరింత రచ్చ జరిగింది. చివరకు సీసీ టీవీ ఫుటేజీలు, పోలీసుల ఎంట్రీ.. ఇలా 'మా' వివాదంలో ఎన్నో మలుపులు. ఎన్నికల ముందు ఏంటిదంతా అనుకున్నవాళ్లు కూడా ఎన్నికల తర్వాత ఎంతకాలమిలా..? అనుకుంటున్నారు. అలా సాగుతోంది ఈ నాన్ స్టాప్ 'మా' రచ్చ.

ఛానెళ్లకు పండగే..

'మా' ఎన్నికలు ముఖ్యంగా యూట్యూబ్ ఛానెళ్లకు పండగేనని చెప్పాలి. ఎక్కడ ఏ చిన్న కామంట్ వినిపించినా, ఏ ట్వీట్ కనిపించినా వెంటనే దాని చుట్టూ కథలల్లేస్తున్నారు. ఇక 'మా'లో పోటీ చేసినవారు ఇచ్చే ఇంటర్వ్యూలతో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. అసలు ఎన్నికలపోయాక కూడా ఇంకా ఈ తిట్ల దండకాలేంటో అర్థం కావడంలేదు. 

ఓడిపోయిన తర్వాత హుందాగా ప్రవర్తించాల్సిన ప్రకాష్ రాజ్ సైతం.. హడావిడి చేస్తున్నారు. ప్రెస్ మీట్లు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలతో సెగలు రగిలిస్తున్నారు. తాజాగా మరోసారి ఎన్నికల కేంద్రమైన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ను సందర్శించారు. మొన్నటివరకు విష్ణు ప్యానెల్ పై ఆరోపణలు చేసిన ప్రకాష్ రాజ్, ఇప్పుడు ఎన్నికల కమిషనర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

కోట.. సెగలు.. పొగలు..

ఎన్నికల ముందు ఎవరికీ సపోర్ట్ చేయని కోట శ్రీనివాసరావు కూడా ఎన్నికల తర్వాత ఇంటర్వ్యూస్ లో వివాదాస్పద అంశాల జోలికి వెళ్లారు. నాగబాబును తిడుతూనే మంచు విష్ణును వెనకేసుకొచ్చారు. చిరంజీవిని పొగుడుతూనే, కమ్మ వర్గాన్ని మెచ్చుకున్నారు. ఈ ఎన్నికలతో మోహన్ బాబు, చిరంజీవి వర్గాలుగా ఇండస్ట్రీ చీలిపోయింది. 

ఇప్పుడు ఎవరెవరు తాము ఎవరి వర్గమో చెప్పుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ టీమ్ లోని నటీనటులకు ఆ టీమ్ సపోర్ట్ చేయదు, ఆ టీమ్ వారు ఈ గ్రూప్ తీసే సినిమాల్లో యాక్ట్ చేయరు అన్నట్టుగా ఉంది పరిస్థితి.

తీర్థ యాత్రలా..? జైత్ర యాత్రలా..?

తాజాగా విష్ణు టీమ్.. తిరుమల యాత్ర మరింతగా మంటలు రేపుతోంది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో విష్ణు టీమ్ కి స్వాగతం ఓ రేంజ్ లో సాగింది. సొంత జిల్లా కాబట్టి, మంచు ఫ్యామిలికి ఆమాత్రం సపోర్ట్ ఉంటుంది, కాదనలేం. కానీ వెయ్యి ఓట్లు కూడా లేని 'మా' ఎన్నికల్లో గెలిచిన విష్ణు.. మరీ అంతలా జైత్ర యాత్రలు చేయాలా అనేది మాత్రం అర్థం కావడంలేదు. 

'మా' ఎన్నికల్లో గెలిచాం కాబట్టి తీర్థ యాత్రలు చేపడుతున్నామని అంటున్నారు కానీ, అక్కడ కూడా వైరి వర్గాలను రెచ్చగొట్టుకోవడం ఎందుకు.. దేవుడి దగ్గరకు వెళ్లేందుకు వచ్చిన వాళ్లకి, జిందాబాద్ లతో స్వాగతం ఎందుకు..? దైవదర్శనం కోసం వచ్చి 'మా'లో బై-లాస్ మారుస్తామని ప్రకటించడం ఎందుకు? ఇకపై తన ప్యానెల్ సభ్యులెవ్వరూ మీడియా ముందుకు రారని చెప్పిన విష్ణు.. పదేపదే తను మాత్రం ఎందుకు మీడియా ముందుకొస్తున్నాడు.

మీడియాకి కూడా అతి అనిపించడం లేదా..?

శ్రీవారి దర్శనం కోసం విష్ణు రేణిగుంట చేరుకున్నారు అనే దగ్గర మొదలు పెట్టి, ఆయన చెప్పిన ప్రతి మాటనీ బ్రేకింగ్ లో ఇచ్చేస్తోంది మీడియా. అదేదో అమెరికా అధ్యక్షుడి పర్యటన అన్నంత బిల్డప్ ఇస్తోంది. రాష్ట్రంలో 'మా' రచ్చ తప్ప మరో టాపిక్ లేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి టీవీ ఛానెళ్లు. దీనికితోడు మంచి లక్ష్మి కూడా రంగంలోకి దిగడంతో సోషల్ మీడియాకు పండగొచ్చింది. ట్రోలర్స్ కు రెక్కలొచ్చాయి. మొత్తం వివాదం కొత్త టర్న్ తీసుకుంది.

'మా' ఎన్నికలు, ఎన్నికల తర్వాత జరిగుతున్న పరిణామాలు ఎంతమేర ప్రజలకు ఆసక్తి అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం రేటింగ్ ల కోసం వెంపర్లాడుతూ.. జనాలకి విసుగొచ్చేలా చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. సంబంధం లేని వారిని కూడా 'మా'పై మీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 'మా' పేరుతో జరుగుతున్న ఈ అతికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!