తెలంగాణ రారాజు…కేసీఆర్ ది అన్ బీటబుల్

ఇంకో నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుకోవడం చాలా తొందరపాటు కావొచ్చు. కానీ.. నాలుగేళ్ల తర్వాతి ఎన్నికల గురించి కూడా ఘంటాపథంగా చెప్పగల ఫలితాలు కొన్ని ఉంటాయి. ప్రధానిగా నరేంద్రనమోడీని ఓడించి.. సింహాసనం…

ఇంకో నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుకోవడం చాలా తొందరపాటు కావొచ్చు. కానీ.. నాలుగేళ్ల తర్వాతి ఎన్నికల గురించి కూడా ఘంటాపథంగా చెప్పగల ఫలితాలు కొన్ని ఉంటాయి. ప్రధానిగా నరేంద్రనమోడీని ఓడించి.. సింహాసనం మీద మరొకరు కూర్చోవడం సాధ్యం కాదని చాలా మంది ఎలా అంచనా వేస్తున్నారో… తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కూడా అంతే. 2024లో మాత్రమే కాదు కదా.. సమీప భవిష్యత్తులో ఆయనకు దీటుగా నిలవగలిగే నాయకుడు, పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఈ ఏకచ్ఛత్రాధిపత్యంపై గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం.

ఏంటి కేసీఆర్ గొప్ప?

కేసీఆర్ పోరాటంలోంచి పుట్టిన నాయకుడు. తెలంగాణ పోరాటాన్ని ఆయన తన స్వప్రయోజనాలకి వాడుకున్నాడని, తెలంగాణ కోసం ప్రాణాలొడ్డిన అనేకమంది త్యాగాలను పణంగా పెట్టి తాను అందలం ఎక్కడాని అనేక విమర్శలు ఉండవచ్చు గాక! కానీ.. అవన్నీ నిజాలని అనలేం. నిజమే అనుకున్నప్పటికీ.. తెలంగాణ కోసం కేసీఆర్ మొదలుపెట్టింది.. మొదటి పోరాటం కాదు. అదివరలో కూడా ఎన్నో పోరాటాలు జరిగాయి. ప్రతి సందర్భంలోనూ లీడ్ చేసిన నాయకులు పోరాటాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారు. ప్రాణాలొడ్డిన వారి త్యాగాలను దారుణంగా వాడుకున్నారు. అయితే ఒక్క కేసీర్ మాత్రమే రాష్ట్రాన్ని సాధించాడు. అందుకే ఆయన పోరాటంనుంచి పుట్టిన నాయకుడు అయ్యాడు. 

పోరాటం తయారుచేసిన నాయకుడు కావడం వలన ఒక ఎడ్వాంటేజీ ఆయనకు ఉంది. జనం నాడి ఆయనకు చాలా స్పష్టంగా అర్థమైంది. పోరాటంలో మమేకమైన యావత్ తెలంగాణ ప్రజలు.. ఎలాంటి భావావేశాలకు ఎలా స్పందిస్తున్నారో.. ఎలా ఉద్యమిస్తున్నారో.. ఆయన చాలా చక్కగా స్టడీచేశారు. ఆ అధ్యయనం, జనం నాడిని అర్థం చేసుకున్న తీరు ఆయనకు ఇప్పటికీ ఉపయోగపడుతోంది. పాలకుడిగా జనం అసంతృప్తికి లోనయ్యే అవకాశం లేని పరిపాలన అందించడానికి ఆయనకు, గతంలో సాగించిన పోరాటమే గొప్ప తర్ఫీదు ఇచ్చింది. 
గ్రేట్ సక్సెస్ అదొక్కటే కాదు…

మా రాష్ట్రం మాకు.. మా నీళ్లు మాకు.. మా ఉద్యోగాలు మాకు… ఇవి పోరాటం సాగిన రోజుల్లో పెద్ద ఎత్తున వినిపించిన నినాదాలు. కేవలం ఈ నినాదాలతోనే యావత్ తెలంగాణను, సకలజనులనూ కేసీఆర్ పోరాటపథం తొక్కించగలిగారు. ఆ డిమాండ్ల విషయంలో మన రాష్ట్రం మనకు రావడం వల్ల ఎలాంటి ఎడ్వాంటేజీ ఉండగలదని, ఆయన అరచేతిలో ప్రజలకు అప్పట్లో కలలను చూపించారో.. ఆ కలలు అన్నింనీ ఇప్పుడు సాకారం చేస్తున్నారు. ఎక్కడి గోదావరి నీళ్లను ఎక్కడి రంగరాయ సాగర్ కు తరలించడం? ఎంత అనూహ్యమైన ప్రాజెక్టు అది. యావత్తు తెలంగాణను సస్యశ్యామలంగా మార్చేసిన ఘనత, అనేకానేక ప్రాజెక్టులను తీసుకు వచ్చిన సాహసి కేసీఆర్ కే దక్కుతుంది. మా రాష్ట్రం మాకు వస్తే.. మాకు దక్కవలసిన నీళ్లను ఎలా మా నేలలు పండించుకోగలమో ఆయన ఇప్పుడు నిరూపించారు. ఇది చిన్న సక్సెస్ కాదు. గతంలో ఎన్నడూ ఊహించలేనిది. 

సంక్షేమ పథకాలు!

కేసీఆర్.. తిరుగులేని జనాకర్షక పథకాలు రూపొందించడంలో పేరు పడ్డారు. రైతు పక్షపాతిగా.. రైతులకోసం ఎంతకైనా తెగించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా గతంలో ఉచిత కరెంటును ప్రకటించినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర పడ్డారు. ఆ తర్వాత.. దానిని కొన్ని మార్పులతో కాపీ కొట్టడంలో చాలా మంది నాయకులు రైతులు కోసం చాలా హడావుడి చేసినా.. అవన్నీ అవకాశవాద ఓటుబ్యాంకు హామీలుగానే పేరుపడ్డాయి. కానీ కేసీఆర్.. తీరే వేరు. సరిగ్గా ఎన్నికలకు ముందు గొప్ప పథకం ప్రవేశ పెట్టడం వంటి గిమ్మిక్కులకు వెళ్లకుండా.. తొలి దఫా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే.. ఎన్నికల హామీ కాకపోయినప్పటికీ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. 

రైతుల సంక్షేమం పరంగా చూసినా, వారి కుటుంబాలను ఆకట్టుకునే పరంగా చూసినా తిరుగులేని పథకం అది. ఆ పథకాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు, చివరికి కేంద్రం కూడా కాపీ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. మచ్చుకు ఒక్కటి మాత్రమే చెప్పుకోవడం జరుగుతోంది గానీ.. నిజానికి నిర్ణయాలు అనేకం. అలాగే కట్టడి చేయడంలో కూడా కేసీఆర్ అంతే దూకుడుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూదం క్లబ్ లను కట్టడి చేయడంలో ఆయన చూపిన శ్రద్ధ కూడా ఊహించలేనిది. 

దూకుడే పెద్ద ప్లస్…

కేసీఆర్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా వేగవంతమైన నిర్ణయాలతో ముందుకెళతారు. కేసీఆర్ అత వేగంగా నిర్ణయాలు తీసుకునే వారు, ఒకవేళ తన నిర్ణయం తప్పని తెలిస్తే అంతే వేగంగా దిద్దుకునే వాళ్లు, వాటిని అమలు చేయడంలో విమర్శలకు జడవకుండా, ముందు వెనుక చూసుకోకుండా ప్రొసీడ్ అయ్యే వాళ్లు.. ఈ అన్ని లక్షణాలు కలగలిసిన వాళ్లు వర్తమానంలో లేరని చెప్పవచ్చు. పాత విషయాలన్నీ వదిలేసినా సరే.. కరోనా గురించి తొలుత చులకనగా మాట్లాడినప్పటికీ.. దాని తీవ్రత అర్థం కాగానే.. ఆయన చాలా వేగంగా నిర్ణయాల్ని మార్చుకున్నారు. రాష్ట్రమంతా లాక్ డౌన్ ను చాలా స్ట్రిక్టుగా అమలు చేస్తూ వస్తున్నారు. కేంద్రంతో నిమాత్తం లేకుండా తన రాష్ట్రం భద్రంగా ఉన్నదని తనకు నమ్మకం కలిగే వరకు లాక్ డౌన్ కొనసాగించే ఉద్దేశంతోనే ఆయన ముందుకు సాగుతున్నారు. 

రాజకీయంగా గానీ, ప్రత్యర్థి పార్టీలనుంచి నాయకులను ఫిరాయింపజేసి తమ పార్టీలో చేర్చుకోవడంలో గానీ, వారికి పదవులు కట్టబెట్టడంలోగానీ, గట్టి నాయకులుగా పేరున్న వారికి కూడా టికెట్లు నిరాకరించడంలోగానీ, అనామకుల్ని తెచ్చి నిలబెట్టడంలో గానీ.. ఏ రకంగా చూసినా ఆయన నిర్ణయాలు దూకుడే అనిపిస్తాయి. అలాంటి దూకుడుతోనే ఆయన తతిమ్మా అన్ని పార్టీలూ ఏకం అయినా సరే.. వారిని బుల్డోజ్ చేసుకుంటూ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. 

ప్రత్యర్థుల చేతగానితనం

కేసీఆర్.. తిరుగులేని నాయకుడుగా ఎస్టాబ్లిష్ కావడానికి మరో ప్రధానమైన కారణం రాజకీయ ప్రతిపక్షాల చేతగాని తనం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతరించి పోయింది. వామపక్ష పార్టీలకు తెలుగుదేశానికి ఇక్కడ పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో ముక్కుతూ మూల్గుతూ బండి లాగిస్తోంది. ఇక పోతే భాజపా కూడా అస్తిత్వం కాపాడుకుంటోంది. వీరిలో భాజపా కూడా నిర్దిష్టమైన పోరాటాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడంలో ఫెయిలవుతున్నట్టే చెప్పాలి. కాంగ్రెస్ పరిస్థితి సరే సరి. అధికారంలో ఉన్నా లేకపోయినా.. తమ పార్టీకి ముఠా కుమ్ములాటలు తప్ప మరో ఎజండా ఉండదని వారు ఇప్పటికీ నిరూపిస్తున్నారు. అధికారంలో లేని పార్టీకి, ఇప్పట్లో అధికారంలోకి వస్తుందో లేదో కూడా క్లారిటీ లేని పార్టీకి పీసీసీ చీఫ్ ను నియమించుకోవడానికే వారు కిందా మీదా అయిపోతుంటారు. ఆ పార్టీ అల్లకల్లోలం అయిపోతుంటుంది. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం, ఒకరి మీద ఒకరు బహిరంగంగానే పరువుతక్కువ విమర్శలు  చేయడం కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ మార్చుకోలేదు. ఇక వారు కేసీఆర్ మీద ఎలా పోరాటం సాగిస్తారు. 

యావత్ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడితేనే.. లెక్క లేకుండా వారిని ఓడించిన కేసీఆర్.. ఒకే పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుకుంటూ, అప్పుడప్పుడూ ప్రకటనలు చేస్తూ సాగుతోంటే.. కేసీఆర్ కు చీమకుట్టినట్టయినా అనిపించడం లేదంటో అతిశయోక్తి కాదు. ప్రతిపక్ష పార్టీల అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే.. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నదని, వారి గురించి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కేసీఆర్ అనుకోవడం మానేశారు. వారి అస్తిత్వాన్నే గుర్తించడం మానేశారు. ఇది వారికి అతి పెద్ద వైఫల్యం అనుకోవాలి. 

వైరిపక్షాలు ఇద్దరు కావడం ఓ బలం

ప్రతిపక్షాలు రెండూ చిన్నస్థాయిలోనే అయినా సమాన బలంతో ఉండడం మరో అదనపు ఎడ్వాంటేజీ. ఒకటే ప్రతిపక్షం ఉంటే.. ఏదో ఒకనాటికి కనీసం ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసినా.. అధికార బదలాయింపు జరగొచ్చు. కానీ రెండు విపక్షాలు సమాన స్థాయిలో ఉండడం అనేది… కేసీఆర్ కు ఎప్పటికీ ఉపయోగపడే అంశంగా మారుతోంది. 

జగన్ తో మైత్రి కీలకాంశం

పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు, మైత్రి కేసీఆర్ కు అతిపెద్ద ఎడ్వాంటేజీగా మారాయనడంలో సందేహం లేదు. ఇప్పటికీ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న జలాల నిర్ణయాలపై తెలంగాణ పిటిషన్లు వేస్తోంది తప్ప.. తెలంగాణ నిర్ణయాలపై ఏపీనుంచి వ్యతిరేకత లేదు. అలాగే కేసీఆర్ అనేక నిర్ణయాలను జగన్ ఫాలో అవుతుండడం.. ఆయన ఇమేజిని మరింతగా పెంచుతోంది. ఏపీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల పంపకాల వివాదాలు అనేకం… జగన్ రాగానే.. తెలంగాణకు అనుకూలంగా పరిష్కరింపజేసుకోవడం కూడా.. కేసీఆర్ సాధించిన పెద్ద విజయం. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సామాజిక వర్గాల సమీకరణల పరంగా.. జగన్ తో మైత్రి వలన కేసీఆర్ కు తిరుగులేకుండా పోయింది. తెలంగాణలో రెడ్డి వర్గం అంతో ఇంతో బలమైనదే అని చెప్పాలి. రాజకీయాల్ని ప్రభావితం చేయగల స్థాయిలోనే వారి బలం ఉంది. ఇప్పుడు ఆ బలం కాంగ్రెస్ లో కేవలం కొందరు లీడర్ల వరకు మాత్రమే పరిమితమైంది. సాధారణ ప్రజల్లో రెడ్డి వర్గంలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత లేకుండా పోయింది. ఆ సామాజిక వర్గం జగన్ ను తమ సహజంగానే తమ ప్రతినిధిగా భావిస్తోంది. జగన్ తో స్నేహం వలన.. కేసీఆర్ కూడా వారికి ఆత్మబంధువే అయ్యాడు. దాంతో వ్యతిరేకత లేకుండాపోయింది. 

కారణాలు ఎన్నయినా కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా చెలామణీ అవుతున్నారనేది నిజం. కరోనా విషయంలోనూ ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, ప్రత్యేకించి.. మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారీ.. ప్రజలతో లైవ్ లో మాట్లాడుతూ.. తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన వారికి వివరించి చెప్పే పద్ధతి… మాటకారితనం.. ఇవన్నీ ఆయనకు తిరుగులేని ప్రజాదరణ అస్త్రాలుగా ఉపయోగపడుతున్నాయి. అన్ని కారణాలు కలసి వస్తున్నందునే.. ఆయన తెలంగాణకు రారాజుగా వెలుగొందుతున్నారు. ఈ రారాజును ఢీకొనగల వారు ఇప్పట్లో లేరు!!

.. ఎల్.విజయలక్ష్మి