కరోనా దెబ్బతో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకమైన కష్టాలు తప్పడం లేదు. అయితే లాక్‌డౌన్ కారణంగా కుటుంబ సభ్యులంతా ఇంటిపట్టునే అనివార్యంగా గడపాల్సిన పరిస్థితి. ప్రధానంగా యువ జంటలు కలిసి ఉండే అవకాశం రావడంతో ఎక్కువ మంది మహిళలు గర్భందాల్చుతున్నారని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజల శృంగార జీవితంపై లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపుతున్నదో బ్రిటన్‌కు చెందిన సెక్స్ అండ్ రిలేషన్‌షిప్స్ నిపుణురాలు అనబెల్లీ నైట్ అభిప్రాయాలు, మరికొన్ని పరిశోధన సంస్థల నివేదికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతుండటం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ అభద్రత తదితర కారణాలు చాలా మందిని మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సెక్స్ అనేది స్త్రీపురుషుల మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. దీంతో లైంగికంగా కోరికలు తీర్చుకోవడంపై మునుపటితో పోల్చితే ఆసక్తి తగ్గిందని సెక్స్ స్పెషలిస్ట్ అయిన ఆమె అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు చేసే పరిస్థితి లేకపోవడం, ఆదాయం లేకపోవడంలాంటి పరిణామాలతో జనం ఒత్తిళ్లకు లోనవుతున్నారని, మనిషి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని కౌన్సెలింగ్ డైరెక్టరీ అనే సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ హార్మోన్ వల్ల శృంగారంపై కోరికలు తగ్గడం లేదా పూర్తిగా లేకపోవడం లాంటి పరిస్థితులకు దారి తీస్తుందని సదరు సంస్థ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తలకు ఏకాంతంగా గడిపేందుకు ఎంత సమయం దొరికినా మనసు ఆందోళనకరంగా ఉండటం వల్ల శృంగారంలో పాల్గొనలేకపోతున్నట్టు తేల్చి చెప్పింది.
కౌన్సెలింగ్ డైరెక్టరీ సభ్యులు మోనికా డెడస్ మాట్లాడుతూ లాక్‌డౌన్ వల్ల చాలామంది వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లకు లోనై మానసిక సమస్యల బారినపడుతున్నారన్నారు. తాను చాలా మంది జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చానని తెలిపారు. శృంగారంపై వాళ్లలో ఎలాంటి ఆసక్తి లేకపోవడం గమనార్హమన్నారు.
అంతేకాదు, లాక్‌డౌన్ వల్ల 24 గంటలూ దంపతులు ఒకేచోట కలిసి ఉంటుండటం కూడా వారిలో సాన్నిహిత్యం దెబ్బతిని, పరస్పరం ఇష్టాన్ని కోల్పోయి శృంగారానికి దూరమయ్యేలా చేస్తుందని మోనికా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, కొన్ని జంటలు మాత్రం లాక్‌డౌన్ మొదలైన రెండు వారాల వరకు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేశామని , తర్వాత రానురాను పరిస్థితి అందుకు విరుద్ధంగా మారుతూ వచ్చినట్టు చెప్పారన్నారు.