తెరపైనే కాదు, తెరవెనుక కూడా.!

సినిమా బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఓ సినిమా పది కోట్లతో తెరెకక్కే రోజులు ఎపడో పోయాయ్. బాలీవుడ్‌లో అయితే వంద కోట్లా? 150 కోట్లా? అని ఓ మోస్తరు సినిమాల నిర్మాణం గురించి చర్చలు…

సినిమా బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఓ సినిమా పది కోట్లతో తెరెకక్కే రోజులు ఎపడో పోయాయ్. బాలీవుడ్‌లో అయితే వంద కోట్లా? 150 కోట్లా? అని ఓ మోస్తరు సినిమాల నిర్మాణం గురించి చర్చలు జరుగుతున్న రోజులివి. రెండొందల కోట్లు లేదా మూడొందల కోట్లు సాధించడం అరుదుగా అయినా జరుగుతున్న ఈ రోజుల్లో నిర్మాణ వ్యయం పెరిగిపోవడం నిర్మాతకు పూర్తిగా ఆనందకరమైన విషయం కాదు. ఇక్కడే భాగస్వామ్యం కోరుకుంటున్నారు నిర్మాతలు. అందుకు తగ్గట్టే, తెరపై స్టార్‌డమ్ ప్రదర్శించడమే కాదు, తెరవెనుక నిర్మాణ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటున్నారు నటీనటులు గత కొన్నాళ్ళుగా. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఇపడు కొత్తేమీ కాదుగానీ, ఈ మధ్య మరీ ఎక్కువగా కన్పిస్తోందంతే. నిర్మాణ వ్యయం పెరిగిపోతుండడంతోనే ఈ మార్పు వచ్చిందని కొందరు అంటోంటే, సినిమాలు తెచ్చిపెడ్తున్న లాభాల పుణ్యమా అని నిర్మాణంలో భాగం పంచుకోడానికి నటీనటులు ముందుకొస్తున్నారని మరికొందరు అభిప్రాయపడ్తున్నారు. కారణమేదైనా ఇది నిర్మాతలకు కాస్త ఉపశమనం కలిగించే అంశమే.

ఎవరి సొంత బ్యానర్లు వారికున్నాయ్

అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్.. ఇలా బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరికీ సొంత బ్యానర్లు వున్నాయి. తమ సొంత బ్యానర్లలో భారీ చిత్రాలు తీస్తూనే, ఇతర నిర్మాతల భాగస్వామ్యంతోనూ సినిమాలు చేస్తున్నారు పలువురు బాలీవుడ్ అగ్రహీరోలు. ఈ విధానం వల్ల మంచి మంచి సినిమాలు తెరపైకొస్తున్నాయంటున్నారు బాలీవుడ్ సినీ పండితులు. నిర్మాణ వ్యయం అదుపులో వుండడానికి నటీనటుల భాగస్వామ్యం ఎంతోకొంత ఉపకరిస్తుందనేవారూ లేకపోలేదు. అదే సమయంలో, బడ్జెట్ కోటలు దాటేసినా నిర్మాత సేఫ్ అవుతున్నాడనేది ఇంకొందరి అభిప్రాయం. సొంత బ్యానర్‌లో నటించడం, లేదా ఇతర నిర్మాతతో కలిసి సినిమాల్ని నటీనటులు నిర్మించడంలో ఇంకో లాభం కూడా వుంది. అదే ప్రచారం. సినిమాకి ప్రచారం ఎంత ముఖ్యమన్నది అందరికీ తెల్సిన విషయమే. ‘సినిమా నాది లేదా మనది’ అన్న ఫీలింగ్‌తో నటీనటులు సినిమాని ప్రమోట్ చేసే తీరుకీ, వేరే నిర్మాత సినిమా కాబట్టి.. అన్న ఫీలింగ్‌తో చేసే ప్రచారానికీ చాలా తేడా వుంటుంది. ఓ హీరో ఓ సినిమా నిర్మాణంలో బాగస్వామి అయితే, నటీనటుల ఎంపిక వంటి విషయాల్లో నిర్మాతకి కాస్త టెన్షన్ తగ్గుతుంది. హీరో మీద గౌరవంతో రెమ్యునరేషన్ల విషయంలోనూ ఇతర నటీనటులు కాస్త వెసులుబాటు కల్పించుకునే అవకాశాలున్నాయంటారు సినీ ప్రముఖులు.

హీరోలకు ధీటుగా హీరోయిన్లు కూడా

తెరపై గ్లామరస్‌గా కన్పించడమే కాదు, పద్దుల లెక్కల్లోనూ తామేం తక్కువ కాదని హీరోయిన్ల నిరూపిస్తున్నారు. కాస్త ఫేమ్ వస్తే చాలు హీరోయిన్లు కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేస్తున్నారు. అయితే హీరోల్లా భారీగా ఖర్చు చేసి, నిర్మాణ రంగంలోకి దూకాలనుకోవడంలేదు హీరోయిన్లు. తమ రేంజ్ తెలుసుకుని, నిర్మాతలుగా డబ్బులు పెట్టడానికి అందాల భామలు ముందుకొస్తుండడం గమనార్హం. హీరోలు 30 నుంచి 40 కోట్లు అయినా ఖర్చు చేయడానికి ముందుకొస్తుంటే, హీరోయిన్ల రేంజ్ 5 కోట్ల రూపాయల లోపేనట. కోటి నుంచి రెండు కోట్లు పెట్టడానికే ఎక్కువమంది అందాల భామలు మొగ్గు చూపుతున్నారట. ‘నిర్మాత’ అనే గుర్తింపు కోసమే మెజార్టీ హీరోయిన్లు నిర్మాణ రంగంలోకి వస్తున్నారని సినీ జనాలు అభిప్రాయపడ్తుండడం గమనార్హం. కారణమేదైనా హీరోయిన్లు సినిమా నిర్మాణంలో భాగమైతే, ప్రచారానికి కొత్త గ్లామర్ వస్తుందని దర్శకులు, ఇతర నిర్మాతలు, హీరోలు చెబుతున్నారు. క్రియేటివ్ పీపుల్ హీరోయిన్లు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే, చాలా కంఫర్టబుల్‌గా వుంటుందనీ, డిఫరెంట్ థీమ్స్‌తో కొత్త జోనర్ సినిమాల్ని తెరెకక్కించడానికి వీలవుతుందంటున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

పెత్తనాలూ ఎక్కువైపోతాయ్

నటీనటులు నిర్మాణంలో భాగమైతే అంతా లాభమే అనుకునేరు.. ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అనేది అనేక వివాదాలకూ కారణమవుతోంది. క్రియేటివిటీ కొన్నిసార్లు కిల్ అయిపోతోంది స్టార్స్ పెత్తనంతో. మామూలుగానే క్రియేటివిటీని స్టార్ డమ్ అణగదొక్కేస్తుంటుంది. నిర్మాణంలోనూ స్టార్స్ భాగస్వాములైతే, క్రియేటివిటీ పూర్తిగా మూలనపడిపోతుంది. అన్ని సందర్భాల్లోనూ కాకపోయినా, చాలా సందర్భాల్లో పరిస్థితి దర్శకులకి, సినిమాకి సంబంధించిన ఇతర విభాగాల్లోని క్రియేటివ్ పీపుల్‌కీ సంకటంగా తయారవుతోంది. హీరోల చిరాకులు పరాకులు ఒకలా వుంటే, హీరోయిన్లవి ఇంకా దారుణంగా వుంటాయంటారు కొందరు. ఈగో ఫీలింగ్స్‌తో కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయిన సందర్భాల్ని గుర్తు చేస్తున్నారు. ఎక్కడో ఒకటీ అరా తప్ప ఇలాంటి సందర్భాలు చోటుచేసుకోవనీ, సినిమా మీద ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చేవారు, క్రియేటివిటీని గౌరవిస్తారని పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా…

ఇటీవలే ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఛార్మి నిర్మాతగా మారింది. రామ్‌చరణ్ తన తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించనున్నాడు. ‘శ్రీమంతుడు’ సినిమాకి మహేష్‌బాబు సహ నిర్మాత. నాగార్జున ఎప్పటినుంచో సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాడు. వెంకటేష్‌కీ సొంత బ్యానర్ వుంది. ఇలా చెపకుంటూ పోతే టాలీవుడ్‌లో కూడా నటీనటులు, నిర్మాణ రంగంలో భాగం కోరుకుంటున్నారు. తెర మీద వెలిగిపోతూ, తెరవెనుక నిర్మాణ వ్యవహారాల్లో పాలుపంచుకోవడం చిన్న విషయమేమీ కాదు. లాభాలను ఆశించో, లేదంటే మరింత బాధ్యతగా సినిమాని తీర్చిదిద్దాలన్న కారణంగానో.. ఏదేమైనప్పటికీ సినిమా రంగంలో ఈ కొత్త ట్రెండ్ ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే క్రియేటివిటీని చంపేసేలా ఈ భాగస్వామ్యం వుండకూడదు.