కింకర్తవ్యమ్…

ముదరిపోయింది..తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలను ఏలుతున్న రాజకీయ నాయకుల నడుమ వివాదం ఎంత ముదరాలో అంతా ముదిరిపోయింది. నువ్వు ఒకటంటే నే రెండంటా అనే చందాన ఇద్దరు చంద్రులు రెచ్చిపోవడంతో, వివాదం రచ్చకెక్కింది. అసలేం జరిగింది..దానికి…

ముదరిపోయింది..తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలను ఏలుతున్న రాజకీయ నాయకుల నడుమ వివాదం ఎంత ముదరాలో అంతా ముదిరిపోయింది. నువ్వు ఒకటంటే నే రెండంటా అనే చందాన ఇద్దరు చంద్రులు రెచ్చిపోవడంతో, వివాదం రచ్చకెక్కింది. అసలేం జరిగింది..దానికి ప్రతిగా ఏం జరుగుతోంది..ఆఖరికి ఏం జరుగుతుంది..? అన్న అనుమానాలు సామాన్యుడి నుంచి అసమాన్యుడి వరకు చుట్టుముడుతున్నాయి. ఒక చిన్న కేసు కనుక పెద్దవాళ్లను చుట్టుముడితే, ఇంతకు దారి తీస్తుందన్నమాట అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంగబలం, అర్థబలం, అధికారబలం వుంటే, ప్రజాస్యామ్య విధానాలను కూడా అపహాస్యం చేసుకోవచ్చని మరింత స్పష్టంగా అర్థమవుతుంది. తెరవెనుక పార్టీలు అధికారం కోసం ఏ విధంగా కోట్లను మంచినీళ్లలా ఖర్చు చేస్తాయో అర్థమయింది.

ఏం జరిగింది.?

తెలంగాణ కు చెందిన ఓ ఎమ్మెల్సీ ఓటును  అయిదు కోట్లకు బేరం పెట్టి, అందులో పదో వంతు అడ్వాన్స్ గా ఇవ్వడానికి వెళ్లారో ఎమ్మెల్యే. అవినీతి నిరోథక శాఖ దాడి చేసి అరెస్టు చేసింది. ఠాఠ్ ఇది అన్యాయం. కుట్ర. మా ఫోన్ లు ట్యాప్ చేయకుంటే ఈ విషయం మీకు ఎలా తెలిసింది. అలా ట్యాప్ చేయడం చట్టవిరుద్ధం..నేరం.ఇదంతా మా పార్టీని అన్ పాపులర్ చేయడానికి చేసిన కుట్ర.అందుకు మీమీద మేం కేసులు పెడతాం..మీకు నోటీసులు ఇస్తాం..మిమ్మల్ని అరెస్టు చేస్తాం అంటుంది ఆంధ్ర. అసలు ఏసిబి వున్నది అధికారుల అవినీతి కోసం తప్ప రాజకీయ నాయకుల అవినీతి కోసం కాదు..అని చాలా చక్కగా చెబుతున్నారు.  అంటే రాజకీయ నాయకుల అవినీతి కోసం మరో ఎసిబి లాంటిది ఏర్పాటు చేయాలన్నమాట.  మరి ఆంధ్రలో ఇదే ఏసిబి కొన్నాళ్ల క్రితం లిక్కర్ కేసులో , పాత్రికేయుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు మరేమీ మాట్లాడలేదు ఎందుకనో.

సరే,.మా ఎమ్మెల్సీ ఓటును కొని మా ప్రభుత్వాన్ని పగగొట్టాలని మీరు కుట్రపన్నారు. ఇందులో చాలా మంది వున్నారు. మేం ఎందుకు ఊరుకుంటాం అంటుంది తెలంగాణ ఫ్రభుత్వం. తమ దగ్గర వున్న టేపులు కావచ్చు, రికార్డింగ్ లు కావచ్చు, నేరుగా కోర్టుకు అందచేసి, వివాదానికి తావులేని విధానం ఎందుకు అవలంబించలేదో అర్థం కాదు. చంద్రబాబు సంభాషణలు చానెల్ కు కాకుండా కోర్టుకు ఇచ్చివుంటే ఇంత వివాదానికి తావిచ్చేది కాదేమో? కోర్టు వాటిని ల్యాబ్ కు పంపేది, ల్యాబ్ రిపోర్టు మేరకు కోర్టే నోటీసులు ఇచ్చేది. 

కానీ తెలంకాణ ప్రభుత్వం కావచ్చు, కొందరు వ్యక్తులు కావచ్చు, అత్యుత్సాహానికిపోయి, సంభాషణల టేపులను చానెళ్లకు లీక్ చేయడంతో వచ్చింది అసలు సమస్య. అంతే కాదు, 120 మంది వ్యవహారాలు తమకు తెలుసు అన్న రీతిలో తెలంగాణ హోంమంత్రి మాట్లాడారు. రాజకీయ నాయకుడిగా ఆయన మాటలు ఓకె. కానీ హోం మంత్రిగా కాదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి వరంగా మారింది. అంతవరకు ఏడాదిగా గుర్తుకు రాని, సెక్షన్ 8 ఇప్పుడు గుర్తుకువచ్చింది. ఉమ్మడి రాజధానిలో తమ హక్కులకు అన్యాయం జరుగుతోందంటూ రచ్చకెక్కింది. అక్కడితో ఆగలేదు. దీన్ని శాంతిభధ్రతల సమస్యగా చూపించే ప్రయత్నం ప్రారంభించింది. 

ఆంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులను రప్పించి, తన భద్రతకు నియోగించింది. దీంతో మరింత పంతానికి పోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేసుకు మరింత పదును పెట్టి, మరిన్ని అరెస్టులు, మరిన్ని నోటీసులకు తెరతీస్తోంది. మరో పక్క ఆంధ్ర ప్రభుత్వం ఇదే కేసులో నాలుగో నిందితుడిగా వున్న ముత్తయ్యను చేరదీసి, ఆయన చేత కోర్టలో వాంగ్మూలం ఇప్పించి,  అదే సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతలపై కేసిఆర్ పై నమోదు అయిన కేసులను కట్టగట్టి, అంతా కలపి, దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది. కేసిఆర్ వల్ల ప్రాణహాని వుందని చెప్పి ముత్తయ్యను కనపడకుండా వుంచారు.అయితే కోర్టు ద్వారా ఎక్కడ వారెంట్ తెచ్చి ముత్తయ్యను అరెస్టుచేస్తారో అని, దానిపై కూడా హైకోర్టు స్టే సంపాదించారు. 

మరోపక్క ముందు దీన్నిసెక్షన్ 8 సమస్యగా మార్చుదామనుకున్నవారు, అక్కడితో ఆగకుంటా గవర్నర్ ను టార్గెట్ చేసారు. మంత్రులు సైతం సభ్యత మరిచి గవర్నర్ నిందాస్తుతికి దిగారు. దీనిపై కేంద్రం సీరియస్ కావడంతో అచ్చెం నాయుడు లాంటివారు వెనక్కు తగ్గారు.

ఏం జరగబోతోంది

నోటుకు ఓటు కేసులో పెద్ద తలకాయలు చాలా వుండడం అన్నది ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే పార్టీ అన్నాక, రాజకీయం తప్పదు. దాంట్లో ఎప్పుడూ కీలకమైన వారు పాలు పంచుకోవడం కామన్. కేసు తరువాత నిల్చుంటుందా, వీగిపోతుందా అన్నది పక్కన పెడితే ప్రాధమిక సాక్ష్యాధారాలు వున్నాయని కోర్టుకు విశ్వాసం కలిగిస్తే తప్ప అరెస్టు వారెంట్ లు రావు. ఒకసారి వారెంట్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయిందని కాదు. కానీ సెక్షన్ 8, కుట్ర అంటూ తెలుగుదేశం చేస్తున్న వాదనలు కాస్త నీరసపడడానికి అవకాశం వుంది. కోర్టును ధిక్కరించడం అంత సులువు కాదు. ఇక మిగిలింది ఇందుకు ప్రతిగా ఆంద్రలో కేసిఆర్ కు నోటీసులు రెడీ చేయడం ఒకటే.

అయితే కేసిఆర్ కు నోటీసులు ఇచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ అన్ని విధాల గట్టేక్కినట్లా అనుకుంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే కేసిఆర్ పై పెట్టిన కేసులు, ట్యాపింగ్ కు సంబంధించినవి. తేదేపా నేతలపై పెట్టే కేసలు ముడుపులకు సంబంధించినవి. మరో పక్క నోటీసులు ఇస్తే తీసుకోము అనడానికి కూడా లేదు. ఎందుకంటే, ఇవే నోటీసులు కోర్టు ద్వారా వస్తే కనుక, తిరస్కరించడానికి ఆస్కారం లేదు. ఈ కేసులో నోటీసుల ఇవ్వాల్సి వుందని, ఇస్తే తీసుకోమంటున్నారని, కోర్టుద్వారా ఇవ్వాలని తెలంగాణ ఫ్రభుత్వం కోర్టును కోరితే అది వేరేగా వుంటుంది.

దేశం వాదన సరైనదేనా?

విషయాన్ని సెక్షన్ 8 మీదకు మళ్లించింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన స్ట్రాటజీనీనే అంటే, ఒక విధంగా అది బాగుంది. తను అనుకూల మీడియా ద్వారా జనాల ఫోకస్ ను దీని మీదకు విజయవంతంగా మార్చగలిగింది. ఆంధ్ర వరకు ఇది పనికివస్తుంది. కానీ హైదరాబాద్ లో వున్న ఆంధ్ర జనాలకు తెలుసు..ఏడాదిగా ఏ సమస్య లేదని. అయితే కేవలం ఈ సెక్షన్ మీదకు దృష్టిని మళ్లించినా, రేపు కేంద్రం ముందో, కేంద్ర అధికారుల ముందో, లేదా కోర్టు ముందో ఈ వాదన చెల్లకపోవచ్చు. ఏడాదిగా ఏ ఇస్యూలోనూ దీన్ని ప్రస్తావించకుండా, ఇప్పుడు ఒక్కసారి లేవనెత్తడం వల్ల సమస్య అది.

ఇక మాట్లాడానికి ఎన్నయినా మాట్లాడవచ్చు.వాదనలు నిర్మించుకోవచ్చు కానీ, కేంద్రం ముందు కోర్టుల మందు వ్యవహారం పెట్టినపుడు ఒకటే కనిపిస్తుంది..50 లక్షలు పట్టుకెళ్లారు. స్టీఫెన్ తో బాబు మాట్లాడారన్న టేప్ లీక్ అయింది.  అది నిజమా కాదా అన్నది ల్యాబ్ కు పంపారు. దీనికి సంబంధించి మరి కొంతమందికి నోటీసులు ఇద్దామనుకున్నారు.  ఇంతే విషయం.

తమ టేపులు ట్యాప్ చేసారన్నదాన్ని తెలుగుదేశం నిరూపించుకోగలగాలి. లేదా కనీసపు సాక్ష్యాధారాలు చూపించాలి. అప్పుడు కొంతవరకు ప్రయోజనం వుంటుంది. నిజానికి ఉండవల్లి అరుణ్ కుమార్  చెప్పినట్లు ఇది ఆవగింజంత కేసు. చంద్రబాబు గమ్మున వుంటే కోర్టులో తేలిపోయేది. కానీ టేఫు లీక్ కావడం ఆయనను రెచ్చగొట్టింది. ఇంకేమైనా టేపులు వున్నాయోమో వున్న అనుమానాలు దానికి ఆజ్యంపోసాయి. దాంతో కథ మలుపు తిరిగింది. కానీ ఒకటి మాత్రం నిజం..మీడియా ముందు మట్లాడినట్లు, కేంద్రం ముందు మాట్లాడడానికి వీలు కాకపోవచ్చు.

కేంద్రం వైఖరి సరైనదేనా?

అసలు ఈ వివాదం విషయంలో కేంద్రం వైఖరి ఏమిటి? హోం శాఖ అధికారిని పంపిస్తాం..ఆయన చూసుకుంటుందంటున్నారు కేంద్ర హోం మంత్రి. మామూలు పరిస్థితుల్లో అయితే ఇలా అనడం వరకు ఓకె. కానీ విభజన అనంతరం వస్తున్న తలకాయనొప్పుల్లో ఇది ఒకటి. విభజన చట్టంలోని లొసుగులను ఎత్తి చూపుతోంది. ముందుంగానే ఉమ్మడి రాజధాని ప్రాక్టికాలిటీల గురించి కాస్త ఆలోచించి వుంటే, పదేళ్ల పాటు గవర్నర్ పాలనలో హైదరాబాద్ ను వుంచితే పరిస్థితి ఇలా వుండేది కాదు. గవర్నర్ కు అధికారాలయితే ఇచ్చారు కానీ, వాటి అమలుకు కావాల్సిన అధికార సాధన సంపత్తి ఆయనకు లేదు. మరి వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? అందువల్ల కేంద్రం ఇప్పటికైనా విభజన చట్టం అమలులో వస్తున్న లోపాలను మరోసారి లోక్ సభలో చర్చకు పెట్టాల్సి వుంది.  దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం వుంది. ఇది తేనెతుట్టను కదపడం లాంటిదే. అయినా తప్పదు.

మరోపక్క ఇరు రాష్ట్రాల మధ్య ఓ కేసు విషయమై వివాదం నెలకొన్న తరువాత, అది కూడా రాజకీయ నాయకులు, కోట్ల రూపాయిలకు సంబంధించినది కావడం వల్ల, రాష్ట్రాలతో సంప్రదించి, వాటి సిఫార్సలో సిబిఐ చేత దర్యాప్తు చేయించడం మంచింది. అవి ఇక్కడ కేసలు కావచ్చు..అక్కడ కేసులు కావచ్చు. కేంద్ర పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి, ఇక ఎవరికీ ఎటువంటి అనుమానం వుండదు.  

ఇది మాత్రం సరికాదు

రాజకీయ ప్రముఖుల కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు లాఠీలు దూసుకోవాల్సిన పరిస్థితి మాత్రం అత్యంత హీనం. ఇది దేశ  ఫెడరల్ వ్యవస్థకు ముప్పుగా మారుతుంది.  అందువల్ల ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు పునరాలించుకోవాలి. ఏం చేయాలన్నా, ఏం చూసుకోవాలన్నా కోర్టుల ద్వారా చూసుకోవడం ద్వారా ఇలాంటి ఘర్షణలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలను నడుపుతున్న పాలకులపై వుంది. అంతవరకు ఇరు రాష్ట్రాల నాయకులు కూడా సంయమనం పాటించాల్సి వుంది. మేం కేసు పెడతాం..ఐఎఎస్ ఐపిఎస్ లను సైతం అరెస్టు చేస్తాం అని వీరు అనడం, కేంద్రమంత్రిని, పార్లమెంట్ సభ్యులను అరెస్టు చేసే అవకాశం వుందన్న ఫీలర్లు వదలడం వారు మానుకోవాలి.

లేదంటే, ఈ వివాదం ఇలా ముదిరితే, జనాలకు ఒకటి మాత్రం పక్కాగా అర్థమవుంది. చట్టం అనేది సామాన్యుడి వరకే. పెద్దవాళ్ల జోలికి వెళ్తే, నానా గత్తరా చేసి, తప్పించుకుంటారు అని.

సర్దుమణిగిందా?

మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ఆదిలో చూపించిన జోరు ఇక చూపించకపోవచ్చన వదంతులు కూడా వినిపిస్తున్నాయి. తెరవెనుక కేంద్రంలో పెద్దలు సర్దుబాటు చేయాల్సిన మేరకు చేసేసారని, ఇకపై ఇటు అటు ఏ నోటీసులు వుండవనీ అంటున్నారు. ఆ వార్తలు ఎంతవరకు నిజమో కానీ, ప్రస్తుతానికి అయితేమాత్రం ఎటువంటి హడావుడి లేదు. రెండు రోజులుగా ప్రశాంతంగానే వుంది. మరోపక్క మొదట్లో ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొహం లో కనిపించిన టెన్షన్ ఇప్పుడు పూర్తిగా మాయమైంది. ఆయన తన డైలీ రోటీన్ కు మళ్లారు. 

ఎటొచ్చీ హడావుడి ఎక్కడా మిగిలి వుందా అంటే…అది ఒక్క సాక్షి దినపత్రికలో మాత్రమే…

చాణక్య

[email protected]