టెస్ట్ సిరీస్‌ని ఇంగ్లాండ్‌కి సమర్పించేసుకుంది ధోనీసేన. ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో ఒకటి డ్రా.. ఒకటి టీమిండియా గెలిచింది. అంతే.. మూడు మ్యాచ్‌లు ముచ్చటగా ఇంగ్లాండ్‌కి ధోనీసేన అప్పగించేసింది. గెలిచిన, డ్రా చేసుకున్న మ్యాచ్‌లలో చూపిన తెగువ, మిగతా మ్యాచ్‌లలో ఎక్కడా టీమిండియా ప్రదర్శించలేకపోయింది.
గెలిచిన ఒక్క మ్యాచ్ ‘రికార్డ్’ హిట్ అన్నది అందరికీ తెల్సిన విషయమే. దాంతో ‘కిక్కు’ తలకెక్కేసిందో ఏమోగానీ, పోరాట పటిమ.. అంటే ఏంటో కూడా తెలియకుండా.. చివరి రెండు మ్యాచ్‌లను టీమిండియా కోల్పోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్లో గెలుపోటములు సహజం.. కానీ, ఇంత దారుణ పరాజయాల్ని అభిమానులెలా జీర్ణించుకోగలరు.?
చివరి మ్యాచ్ మరీ దారుణం.. తొలి ఇన్నింగ్స్‌లో 200 లోపు పరుగులకు చాప చుట్టేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా తొందరపడి.. వంద పరుగుల్లోపే అంతా సర్దేసింది. పలితం.. ఇన్నింగ్స్ 244 పరుగుల తేడాతో టీమిండియా దారుణ పరాజయాన్ని చవిచూసింది.
టాప్ టు బాటమ్.. ఆటగాళ్ళంతా ఈ సిరీస్‌లో ఫెయిలయ్యారనే చెప్పాలి.. డ్రా చేసుకున్న మ్యాచ్, గెలిచిన మ్యాచ్‌లలో తప్ప. కోహ్లీకి ఏమయ్యిందో తెలియదు, ధోనీ పరిస్థితేంటో అర్థం కాలేదు, బౌలర్లు తామసలు బౌలర్లమన్న విషయమే మర్చిపోయారేమో తెలియదు.. ఫీల్డింగ్ సంగతి దేవుడెరుగు.. వెరసి, సమిష్టిగా ఫెయిలయ్యింది టీమిండియా.
ఇంగ్లాండ్‌పై మరపురాని టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధిస్తుందనుకున్న టీమిండియా, అనూహ్యంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. సీనియర్ బౌలర్లు లేరు.. వున్నోళ్ళేమో గాయాల బారిన పడ్డారు.. బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేరు.. అసలు టెస్ట్ ఆట ఎలా ఆడాలో తెలిసిన ఆటగాళ్ళు జట్టులో లేరేమోనన్న అనుమానం కలిగింది మొత్తంగా టీమిండియా ఆటతీరు చూస్తే. వర్ణన అనవసరం.. టీమిండియా అట్టర్ ఫ్లాప్. పూర్తిగా టీమిండియాని టెస్ట్ జట్టు విషయంలో ప్రక్షాళన చేయాల్సిన సమయమిది. బీసీసీఐ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందనే ఆశిద్దాం.