ఆ ఐదుకోట్లు.. ఎవరికోసం?

ఎంతోకాలం నుంచి తమ పదవీ విరమణ వయసును పెంచాలని వైద్యవిద్య అధ్యాపకులు కోరుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గత జనవరిలో అందుకు సంబంధించిన జీవో వస్తుందని ఆశించారు. మళ్ళీ మార్చిలో ఆ జీవో…

ఎంతోకాలం నుంచి తమ పదవీ విరమణ వయసును పెంచాలని వైద్యవిద్య అధ్యాపకులు కోరుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గత జనవరిలో అందుకు సంబంధించిన జీవో వస్తుందని ఆశించారు. మళ్ళీ మార్చిలో ఆ జీవో కోసం ఎదురుచూశారు. రాకపోవడంతో చాలా మంది ప్రొఫెసర్లు నిరాశగా పదవీ విరమణ చేశారు.

రాబోయే రెండుమూడు నెలల్లో పెద్ద సంఖ్యలో వైద్యవిద్య అధ్యాపకులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఒక యూనియన్‌గా ఏర్పడి ఒక్కొక్క ప్రొఫెసర్‌ నుంచి 4నుంచి 5లక్షల దాకా చందాలు కూడా వసూలు చేశారు. ఈ మొత్తం సుమారు 5కోట్ల దాకా వసూలైనట్లు సమాచారం. అయితే ఈ మొత్తాన్ని ఎవరికి ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వీళ్ళ ఒత్తిడి ఫలించి వీళ్ళ పదవీ విరమణ వయసును ప్రభుత్వం 58ఏళ్ళ నుంచి 65కి పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. బుధవారం నుంచి ఐదురోజులపాటు మూకుమ్మడి సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ ప్రభుత్వం వాళ్ళ కోరికను ఆమోదించకపోతే ఆ తరువాత నిరవదిక సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం వెనుక ప్రస్తుత గవర్నర్‌ కీలకపాత్ర పోషించారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.

గతంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్యవిద్య అధ్యాపకులకు బాగా కొరత ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రొఫెసర్ల కొరత కొంత ఉందంటే అది డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ లోపభూయిష్టమైన నిర్ణయాల వల్లే. అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వరు. దాహం అయినప్పుడు బావి తొవ్వుకోవడానికి ప్రయత్నించినట్టు కొరత ఏర్పడ్డప్పుడు హడావిడి చేయడం తప్ప ముందు జాగ్రత్తగా ఒక ప్రణాళికతో వైద్య విద్యను నిర్వహించిన డి.ఎం.ఇ. లు అరుదు. వీళ్ళు వైద్య వృత్తి నుంచి వస్తారు. అడ్మినిస్ట్రేషన్‌ లో అనుభవం తక్కువ. అక్కడి గుమస్తాలు వీళ్ళను ఆడిస్తుంటారు. అక్కడ క్లర్కులు చెప్పిందే వేదం. ప్రమోషన్లు, డిప్యుటేషన్లు, బదిలీలు అన్నీ కిందిస్థాయి సిబ్బందే నిర్ణయిస్తారు. డి.ఎం.ఇ.లు మన రాష్ట్రపతుల్లాంటి ఉత్సవ విగ్రహాలు. కారణం తమ శాఖ మీద అవగాహన లేకపోవడం.

వైద్యవిద్య అధ్యాపకులు రిమోట్‌ ఏరియాలకు వెళ్ళరు అని ముద్ర. ఇందుకు కూడా డి.ఎం.ఇ. ఆఫీసే కారణం. తెలంగాణనే తీసుకుంటే ఆదిలాబాద్‌లోనో, నిజామాబాద్‌లోనో అధ్యాపకుల కొరత ఉంటే.. ఇప్పటికే కిక్కిరిసిన గాంధీలోనో, ఉస్మానియాలోనో కావాల్సిన వాళ్ళకు కొత్తగా పోస్టింగ్‌లు ఇస్తూ ఉంటారు.

కొరత ఉన్నచోట్లకు గాంధీ, ఉస్మానియాల నుంచి సంవత్సరాల తరబడి డిప్యుటేషన్ల పేరుతో పంపిస్తూ ఉంటారు. అక్కడ కొరత ఉంటే.. ఇక్కడ రిక్రూట్‌ చేసి.. ఇక్కడ ఉన్న వాళ్ళను డిప్యుటేషన్లు వేయడం ఏవిధమైన కార్యనిర్వహణో ఎవరికీ అర్థం కాదు. ఆ చేతులు మారిన పైసలకు తప్ప.

వైద్యవిద్య అధ్యాపకులు పనిచేయరు. సంతకం పెట్టేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయడానికి వెళ్ళిపోతారు అనేది మరో ఆరోపణ. ఇది కొంతవరకు నిజమే. దీనికి కారణం ఎవరు? ఈ విధంగా డ్యూటీ మానేసి ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేసే వాళ్ళు, సొంత క్లీనిక్‌లు నడుపుకునే వాళ్ళు ఏం ఇబ్బందులు పడడం లేదు, సంతోషంగా ఉన్నారు.

ఎందుకంటే డి.ఎం.ఇ. ఆఫీసులో తమ మంచి చెడ్డలు చూసుకునే తమ వాళ్ళకు అప్పుడప్పుడూ కొంత ముట్ట చెబుతుంటే వాళ్ళ జోలికి ఎవరూ రారు. వాళ్ళకు బదిలీలు ఉండవు, డిప్యుటేషన్లు ఉండవు. ఎన్నేళ్ళైనా ఒకేచోట పాతుకుపోయి ఉంటారు. ముడుపులు ఇవ్వలేని మామూలు అధ్యాపకులకే కష్టాలన్నీ.

ప్రభుత్వం కూడా వైద్యవిద్య అధ్యాపకుల బాగోగుల్ని గాలికి వదిలేసింది. వీళ్ళ జీతాలు దారుణం. ఒకే సర్వీసు ఉన్న పీజీ డాక్టర్ల జీతాల కన్నా విద్యుత్‌ సంస్థల్లో లైన్‌మెన్ల జీతాలు ఎక్కువ.

వైద్యవిద్య అధ్యాపకులకు అటు యుజీసీ స్కేల్స్‌ ఇవ్వరు. ఇటు రాష్ట్రప్రభుత్వ జీతాలు ఇవ్వరు. మధ్యలో యుజీసీ లైక్‌ అంటూ అత్తెసురు జీతాలు ఇస్తున్నారు. ఇలాంటి జీతాలతో నెట్టుకువచ్చే అధ్యాపకులకు ఈ పదవీవిరమణ వయసు పెంపు వల్ల మరో ఏడు, ఎనిమిది ఏళ్ళపాటు ప్రమోషన్లు రావు. జీతాలు పెరగవు. దాంతో చాలామంది వేరే దారి చూసుకుంటారు.

అప్పుడు అధ్యాపకుల కొరత  మరింత ఎక్కువవుతుంది. ఇప్పుడు పదవీ విరమణ వయసు 58ఏళ్ళు ఉండడం వల్ల రిటైర్‌ అయిన వాళ్ళు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్లుగా వెళుతున్నారు. పదవీ విరమణ వయసు పెంచితే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత ఎక్కువవుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే వైద్య విద్య విభాగం ఎంత దారుణంగా నడుస్తుందో చెప్పాలంటే ఒక గ్రంథమే అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కాస్త దృష్టి పెడితే మంచిది.