న స్త్రీభ్యః కించిదన్యద్ వై పాపీయస్తరమస్తి వై
స్త్రియో హి మూలం దోషాణాం తథా త్వమపి వేత్థ హ
.. మహాభారతంలోని శ్లోకం ఇది. అనుశాసనపర్వంలో వస్తుంది. ఆ పర్వంలో భీష్ముడి వద్దకు వచ్చి ధర్మరాజు అనేకానేక సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో భాగంగా ఆడవాళ్ల స్వభావాన్ని గురించి భీష్ముడి ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు. తమాషా ఏంటంటే.. తెలుసుకోగోరిన వాడు సింపుల్ గా ‘స్త్రీ స్వభావం గురించి చెప్పండి తాతయ్యా’ అని అడగడు. ‘స్త్రియో హి మూలం దోషాణాం.. లఘుచిత్తా హి తాః స్మృతాః’ అని ముందుగా తన అభిప్రాయం చెప్పి, పెద్దాయన అభిప్రాయం అడుగుతాడు. ‘దోషాలన్నింటికీ మూలం స్త్రీలే. వారు కురచబుద్ధులు (కొద్దిబుద్ధులు) కలవారు’ అనేది ధర్మరాజు అభిప్రాయం.
మరి, ధర్మరాజుకు తాత అయిన భీష్ముడికి కూడా మహిళలంటే అలాంటి చులకన అభిప్రాయమే ఉన్నదో ఏమో మనకు తెలియదు. కానీ ఆయన ధర్మరాజు కంటె తెలివైన వాడు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలే కురువృద్ధుడు. ఒక స్త్రీ చేసిన కట్టుబాటు కారణంగా రాజ్యాధికారాన్ని, పెళ్లిని కూడా త్యజించిన వాడు! ఒక స్త్రీ చేసిన సవాలు కారణంగా ప్రాణగండాన్ని కొనితెచ్చుకున్నవాడు! నిజానికి అలాంటి భీష్ముడికి మహిళలంటే మరింత చులకన, కోపం ఉండాలి. కానీ, ఆయన గడ్డమూ ముగ్గుబుట్టలా పండిపోయినంతటి జీవన ప్రస్థానంలో ఇలాంటి ఎన్నెన్నో చూసి ఉండినవాడు గనుక.. అపారమైన లౌక్యం అలవడిన వాడు గనుక.. మహిళల గురించిన అభిప్రాయాన్ని తాను నేరుగా చెప్పకుండా.. ఒక ఉదాహరణను ధర్మరాజుకు వివరించాడు. నారదుడు- పంచచూడ అనే పేరుగల, బ్రహ్మలోకానికి చెందిన అప్సరస మధ్య జరిగిన సంవాదం అది!
స్త్రీ స్వభావం గురించి తెలియజేయమని నారదుడు, బ్రహ్మలోకంలో తనకు కనిపించిన సదరు పంచచూడ అనే అప్సరసను అడిగాడుట. స్త్రీ స్వభావం అత్యంత చంచలమైనదని అంటూ ఆమె చెప్పినట్టుగా అనుశాసన పర్వంలో అనేక శ్లోకాలున్నాయి. స్త్రీల గురించి చాలా అభ్యంతరకరమైన అంశాలు ఆ శ్లోకాల్లో ఉంటాయి. అయితే అవన్నీ మరొక స్త్రీ చెప్పినట్టుగా భారతం అభివర్ణించడం వల్ల పురుషాహంకారం గురించి పెద్ద చర్చ సాగకపోవచ్చు. ఆ శ్లోకాల్లో పంచచూడ చెప్పిన స్త్రీ లక్షణాల యొక్క ప్రామాణికత జోలికి నేను వెళ్లడం లేదు. అసలు మహాభారత గ్రంథమే అనేకానేక ప్రక్షిప్తాంశాలతో కూడినదనే వాదన కూడా ఉన్న నేపథ్యంలో, స్త్రీ స్వభావం గురించిన ఈ చర్చ వ్యాసుడి రచనేనా కాదా కూడా మనం చెప్పలేం. కానీ సందర్భానికి అందులోని ఒక శ్లోకాన్ని మాత్రం పైన వాడుకుంటున్నాను.
‘స్త్రీల కన్న పాపిష్ఠులు మరెవ్వరూ లేరు. దోషాలకన్నింటికీ స్త్రీలే మూలం. ఆ విషయం నీకు కూడా తెలుసు’ అని ప్రారంభంలో చెప్పిన శ్లోకానికి భావం. ఆ సంగతిని పంచచూడ, నారదుడికి చెప్పిందన్నమాట. స్త్రీ జాతి సమస్తానికి ఆ లక్షణాలను ఆపాదిస్తూ పంచచూడ చెబుతుంది గానీ.. అది ఎలా సాధ్యం. ఏ ఒక్క లక్షణమైనా ఒక సమూహానికి ఏకరూపంగా ఉంటుందని అనుకోవడం పెద్ద భ్రమ. తప్పు!
లక్షణాలు, బుద్ధులు ఒక సమూహానికి ఆపాదించగలిగేలా ఎప్పటికీ ఉండవు.. అనేది నా నిశ్చితాభిప్రాయం. కొన్ని లక్షణాలను ప్రకటించి.. అవి ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషావలంబులకు ఆపాదించే తీరు మీద నాకు నమ్మకం లేదు. ఫలానా జిల్లా వాళ్లంతా ఇలాంటి వాళ్లు, ఫలానా మతం వాళ్లంతా ఇలాంటి వాళ్లు అంటూ కొందరు ప్రతిపాదించే సిద్ధాంతాలను విన్నప్పుడు కంపరం కలుగుతుంది. వ్యక్తులలో బుద్ధులు ఎప్పుడూ కూడా వారి వ్యక్తిత్వ నిర్మాణానికి హేతుభూతములైన పరిసరాలు, వారు మెలగే ఇతర వ్యక్తులు, పరిచయాలు, బంధాలు, వారిని ప్రభావితం చేయగల వ్యవహారాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక కులంలోనో, ఒక ప్రాంతంలోనో కొందరిలో ఒక లక్షణ సారూప్యత కనిపించినప్పుడు.. ఆ కులం, ప్రాంతానికంతటికీ దానిని ఆపాదించేసి సిద్ధాంతీకరించడం పెద్ద తప్పు! నారద- పంచచూడ సంవాదంలో కూడా అలాంటి తప్పున్నదనేది నా అభిప్రాయం. కొన్ని కురచబుద్ధులను ప్రతిపాదించి.. స్త్రీ జాతికంతటికీ వాటిని పులిమేయడం ఏహ్యభావం కలిగిస్తుంది.
కానీ కొన్ని సంఘటనలు గమనించినప్పుడు.. పంచచూడ చెప్పినటువంటి వారు కూడా కొందరు స్త్రీలు ఉంటారు అని అనిపిస్తుంది. అలాంటి వారెవ్వరినీ చూసి ఉండకపోతే ఆమె మాత్రం ఏకంగా ఒక సిద్ధాంతాన్ని ఎలా ప్రతిపాదిస్తుంది అని కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా.. హైదరాబాదులో జరిగిన ఒక తాజా సంఘటన చూసిన తర్వాత!
* * *
హైదరాబాదు నగరంలో ‘సుందరకాండ’ సినిమా సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరిగింది. కాకపోతే ఈ సరికొత్త సుందరకాండ కొంచెం శృతిమించి.. ఆధునిక ఓటీటీ లక్షణాలు కలిగిన క్రైమ్, జుగుప్సాకరమైన సెక్స్ ఒరవడితో తయారైంది. అందుకే ఇప్పుడు వార్తల్లోని అంశం అయింది.
వెంకటేష్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సుందరకాండ సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. కాలేజీ స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ, లెక్చరరు, వివాహితుడు అయిన వెంకటేష్ ను ప్రేమిస్తుంది. వెంటపడి అల్లరి పెడుతుంది. గురుశిష్య సంబంధం అంటే తండ్రీ బిడ్డల సంబంధం అన్నట్టుగా నీతులు మనకు అలవాటైపోయిన సమాజంలో.. దీనిని వెంకటేష్ జీర్ణించుకోలేడు. ఆ అమ్మాయి అల్లరి ఆగదు. చివరికి ఒక గుండెను బరువెక్కించే ట్విస్టుతో సినిమాను రక్తి కట్టిస్తాడు దర్శకుడు. సేమ్ టూ సేమ్ అదే సినిమా హైదరాబాదులో రిపీట్ అయింది.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఒక ఇరవై నాలుగేళ్ల యువతి గ్రూపు 1 శిక్షణ కోసం హైదరాబాదుకు వచ్చింది. గ్రూపు 1 ను టార్గెట్ చేసిందీ అంటే.. కాస్తో కూస్తో తెలివైన అమ్మాయే అని అనుకోవాల్సిందే. గ్రూపు 1, సివిల్స్ వంటి శిక్షణలకు హైదరాబాదులో నెలవైన అశోక్ నగర్ ప్రాంతంలోనే ఒక సంస్థలో చేరింది. అక్కడ ఒక సబ్జెక్టు బోధించే లెక్చరరు మీద ఆమె మనసు పడింది. తాను ప్రేమిస్తున్నానంటూ అతడికి ప్రపోజ్ చేసింది. అప్పటికే అతనికి పెళ్లయి, పదకొండేళ్ల కూతురు కూడా ఉంది. ఆ విషయమే చెప్పి అతను ఆ అమ్మాయిని మందలించాడు. దూరం పెట్టాడు. ఆ అమ్మాయి అతని మీద తన ప్రేమను తిరస్కరించినందుకు కక్ష పెంచుకుంది.
ఆయన భార్య, కూతుళ్ల ఫోటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఒక నకిలీ ఖాతా, యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించింది. ఆ లెక్చరర్ కుటుంబ ఫోటోలతో పాటు, ఆయన కూతురి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ ఖాతాల్లో అప్ లోడ్ చేసింది. ఆ లెక్చరర్ భార్య, కూతురి ఫోటోలను అభ్యంతరకరంగా బూతు ఫోటోలుగా మార్చింది. ఆ కోచింగ్ సెంటరు, హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సప్ గ్రూపుల్లో కూడా అశ్లీల పదజాలంతో ఆ పోస్టులు పెడుతూ వచ్చింది. లెక్చరర్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికత సహాయంతో.. ఆమె సృష్టించినది నకిలీ ఖాతాలే అయినప్పటికీ.. ఆమె తన పేరు బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. గుట్టుమట్టులన్నీ కనిపెట్టారు. అనంతపురంలో ఆమెను అరెస్టు చేశారు. ఆమె మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు.
ఈ స్థాయి దుర్మార్గానికి మూలం ఎక్కడుంది? ప్రేమించిన అమ్మాయి తనకు లోబడలేదని ఆమె ఫోటోలను అసభ్యమైన బూతు ఫోటోలుగా మార్చి వాటిని ప్రచారంలో పెట్టి ఆమెను వేధించే దుర్మార్గులు మనకు అనేక నేర ఘటనల్లో తారసపడుతుంటారు. తన ప్రేమను తిరస్కరించినందుకు లెక్చరరు కుటుంబాన్ని రచ్చకీడ్చడానికి, భార్య కూతుర్ల ఫోటోలతో అదే దుర్మార్గానికి మరో అమ్మాయి పాల్పడడం మనకు అరుదుగా కనిపిస్తుంది. ఇలాంటి సంఘటన చూసినప్పుడే.. పంచచూడ చెప్పినట్టుగా స్త్రీలందరూ పాపిష్టులు కాకపోయినప్పటికీ.. స్త్రీలలో కూడా పాపిష్టి తనానికి పరాకాష్ట అనదగిన వారుంటారని మనకు అర్థమవుతుంది.
మహాభారతంలోని అదే ప్రస్తావనలో నారదుడితో సంవాదంలో చివరగా పంచచూడా ఇలా చెబుతుంది..
‘అంతకః పవనో మృత్యుః పాతాలం వడవాముఖమ్
క్షురధారా విషం సర్పః వహ్నిరిత్యేకతః స్త్రియః’
యముడు, వాయువు, మృత్యువు, పాతాలం, బడబాగ్ని, కత్తివాదర, విషం, పాము, అగ్ని- ఇవన్నీ కలిపి ఒక ఎత్తు. స్త్రీ ఒక్కతే ఒక ఎత్తు.. అని ఈ శ్లోకం వివరిస్తుంది.
స్త్రీలను చూసిన ప్రతిసారీ మనకు ఇలా అనిపించకపోవచ్చు గానీ.. ఇలాంటి అమ్మాయిల గురించి చదివినప్పుడు.. పంచచూడ చెప్పిన సిద్ధాంతం కొందరి విషయంలోనైనా నిజమే అని నమ్మవలసి వస్తుంది. ‘స్త్రీబుద్ధి ప్రళయాంతకః’ అని అప్పుడప్పుడూ వినే మాట గుర్తుకు వస్తుంది.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె