-కట్టు దాటలేని టాలీవుడ్!
-ప్రయోగాలతో హోరెత్తిస్తున్న పక్కభాషలు!
-ఫార్ములాలూ, రీమేక్ లే తెలుగు హీరోలకు శరణ్యం!
-మనోళ్ల మంచి సినిమాలు వచ్చేదెన్నడు?
ఇందుమూలంగా యావన్మందీ తెలుగు సినీ ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అంశం.. తెలుగు సినిమా ఇంతే.. అని! ఆరు పాటలూ, నాలుగు ఫైట్లు, హీరోయిజం ఎలివేషన్లూ.. ఐటమ్ సాంగ్ లు, తింగరబుచ్చి హీరోయిన్ పాత్రలతో కూడిన సగటు తెలుగు ఫార్ములా చూసిన ప్రతి సారీ, ఇంతేనా.. తెలుగు సినిమా ఇంతేనా! అని నిట్టూర్చడం తెలుగు సినీ ప్రేక్షకుడికి అలవాటే. ఈ నిట్టూర్పులకూ కాలం చెల్లింది.
ఓటీటీలు వచ్చాకా.. పక్క భాషల సినిమాలను చూడటం సులువు అయ్యాకా.. ప్రపంచ సినిమా స్మార్ట్ ఫోన్లోకి వచ్చేశాకా.. కలిగే భావన, తెలుగు సినిమా అంటే ఇంతే! ఇంతకు మించి ఏమైనా కావాలనుకుంటే.. పక్క భాషల సినిమాలను చూడాలి కానీ, తెలుగు సినిమా మీద ఎలాంటి ఆశలూ, ఆశయాలూ పెట్టుకోవద్దు! అనే క్లారిటీ ప్రేక్షకుడికి పూర్తిగా వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. తెలుగు సినిమా సోకాల్డ్ కమర్షియల్ సినిమాలను అందించగలదు తప్ప, గుర్తుండిపోయే సినిమా అంటే అది ఏ పుష్కరానికో ఒకసారి సాధ్యమయ్యే పని అని స్పష్టమవుతోంది!
ఓటీటీలు వచ్చాకా మారని హీరోలు!
సినిమాకు సంబంధించి ఓటీటీల వెల్లువెత్తడం నిస్సందేహంగా ఒక పెద్ద మార్పు. దీని వల్ల సినిమా పోకడే మారిపోతోంది. పదేళ్ల కిందట కమల్ హాసన్ తన సినిమాను డైరెక్టు టీవీలో రిలీజ్ చేస్తానంటే..దేశ వ్యాప్తంగా అదో సంచలన వార్త అయ్యింది. అప్పుడు అనేక మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. అలా జరగడం సాధ్యమా? అని సగటు ప్రేక్షకుడు విస్తుపోయాడు. అలా చేయాలనుకున్న కమల్ హాసన్ కూడా ఆ పని చేయలేకపోయాడు!
కట్ చేస్తే.. గత ఏడాది కాలంలో టీవీ కన్నా మనిషికి ఎక్కువ చేరువైన స్మార్ట్ ఫోన్ లో బోలెడన్ని సినిమాలు విడుదల అయ్యాయి! వాటిల్లో స్టార్ హీరోల సినిమాలూ, కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు, భారీ అభిమానగణాలు ఎదురుచూస్తున్న సినిమాలున్నాయి! సినిమాను చూడటం విషయంలో ఇంత మార్పు వచ్చింది కానీ.. తెలుగు సినిమా తీరులో మాత్రం ఈ పెను మార్పు లేదు! ఎన్ని మారినా, ఏం మారినా.. తాము మారమని తెలుగు సినిమా రూపకర్తలు పూర్తి స్పష్టత ఇస్తున్నారు!
ప్రేక్షకుడి ఛాయిస్ వచ్చింది, హీరోల ఛాయిస్ మారలే!
పదేళ్ల కిందట.. ఏ పాత హాలీవుడ్ క్లాసిక్ సినిమానో, లేక పక్క భాషల సినిమానో చూడటం ఇంత తేలికైతే కాదు. పైరసీ సీడీలు కొనాలి లేదా టొరెంట్స్ నుంచి డౌన్ లోడ్ చేయాలి.. ఈ రెండూ అందరికీ తేలిక కాదు. ఒరిజినల్ సీడీ కొనాలంటే వందల్లో ఖర్చు చేయాలి, పైరసీ సీడీలు క్లారిటీ ఉండవు. ఇంటర్నెట్ కూడా ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే! రాత్రంతా అయినా ఒక సినిమా డౌన్ లోడ్ కావడం కష్టం. ఇప్పుడు అలాంటి కష్టాలు లేవు!
ప్రపంచ సినిమా మొత్తం ఒక టచ్ దూరంలో ఉంటోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ల సభ్యత్వంతో.. రెండు మూడు నెలలకోసారి ఇంటర్నెట్ ప్యాకేజీల రీచార్జ్ లతో.. మారుమూల పల్లెల్లో కూర్చుని కూడా హాలీవుడ్ క్లాసిక్స్ ను వీక్షించవచ్చు. డైరెక్టు ఓటీటీ అంటూ వస్తున్న తమిళ, మలయాళ సినిమాలు కూడా తెలుగునాట మారుమూలల్లోని ప్రేక్షకుడిని పలకరిస్తున్నాయి!
సీడీలు, డీవీడీలు, టీవీ చానళ్లతో పోల్చినా.. ఓటీటీలు సినిమా ప్రియులకు ఇచ్చిన సౌకర్యం అంతా ఇంతా కాదు. అన్నీ వారి ముందు పెట్టి.. ఏది చూడాలనే ఛాయిస్ కూడా ఓటీటీలు ప్రేక్షకులకు ఇస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రేక్షకులకు ఛాయిస్ పెరిగిన తరుణంలో.. కూడా హీరోల ఛాయిస్ మారడం లేదు! ప్రేక్షకులు 2021లో ఉంటే… తెలుగు హీరోలు మాత్రం నాలుగు దశాబ్దాల కిందట తెలుగు సినిమా అంటే ఎలాంటి నిర్వచనం ఉండేదో.. అదే నిర్వచనానికి కట్టుబడ్డారు!
సాంకేతికంగా తెలుగు సినిమా ఏ స్థాయికి అయినా ఎదిగి ఉండవచ్చు. బడ్జెట్ విషయంలో దేశంలోనే టాప్ పొజిషన్లలోని పరిశ్రమల్లో ఒకటి అయ్యుండవచ్చు! కానీ.. కథలు, కథనాల విషయంలో మాత్రం టాప్ టు బోటమ్ తెలుగు సినిమా తన ఫార్ములాకే కట్టుబడి ఉంది. దాన్నుంచి బయటపడటం కాదు కదా, బయటపడే ఆలోచన కూడా తెలుగు హీరోలకు లేదు!
హీరోలనే అనాలా?
ఇది కొంతమంది వేసే ప్రశ్న. సదరు హీరోలపై అభిమానం ముదిరిపోవడంతో ఈ ప్రశ్న వస్తుండవచ్చు. తమిళ హీరోలు రకరకాల ప్రయోగాలతో మన వరకూ వచ్చేశారు, వచ్చేస్తున్నారు. 16-17 యేళ్ల కిందట శివపుత్రుడు – గజిని వంటి ప్రయోగాలతో తెలుగునాట పండితపామర జనాలను ఆకట్టుకున్న సూర్య, ఇక్కడ సుస్థిరమైన మార్కెట్ ను ఏర్పరుచుకుని, ఇప్పుడు ఒక తమిళ ఓటీటీ రిలీజ్ తో తెలుగునాట హాట్ టాపిక్ గా మారిపోయాడు.
ఏ సినిమా రూపకర్తకు అయినా కావాల్సింది అంతిమంగా డబ్బులే అయితే, రొటీన్ మాస్ ఎంటర్ టైనర్లు చేసి.. సింగం సీరిస్ లో ఇంకో సినిమా తీసి.. కోట్ల రూపాయలు పోగేసుకోవడం సూర్యకు కష్టమా? కమర్షియల్ సినిమాలకు కథ, కథనాలు లేకపోయినా.. వందల కోట్ల రూపాయల వసూళ్లకు అయితే లోటు లేదని.. తెలుగు సినీ రూపకర్తలే ప్రకటించుకుంటున్నారు కదా! డబ్బులొస్తాయనే కదా.. తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. రొటీన్ ఫార్ములాకు కట్టుబడి సినిమాలు తీస్తున్నది! అభిమానులను అలరించే సినిమాలంటూ ప్రచారం చేసుకుంటున్నది! తమిళ హీరోలకు డబ్బంటే చేదా? లేక సినిమా మాధ్యమం అంటే గౌరవమా!
సూర్య, ధనుష్ వంటి హీరోలు.. వైవిధ్యతకు అంతులేని ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. తాము చేయగలిగే పాత్రలను తాము చేస్తూ ఉన్నారు. తాము చేయలేని పాత్రలు అనుకుంటే.. ఆ అనుకోవడంలో కూడా ఇమేజ్ లెక్కలేవీ ఉండవు సుమా! ఆ సినిమాల్లో తాము చేయదగిన పాత్ర లేదనుకుంటే.. అలాంటి సినిమాలకు నిర్మాతలు అవుతున్నారు. నిర్మాతలుగా కూడా జాతీయ అవార్డు రేంజ్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు! మరి తెలుగు హీరోల నుంచి ఎందుకు కనీసం ఆ తరహా ప్రయత్నాలు ఉండవు?
కథలే కాదు.. అంతా కమర్షియలేనా!
తెలుగు సినిమా కథలే కాదు… హీరోల లెక్కలన్నీ కమర్షియలే కాబోలు. ఒక్కో సినిమాకు సైన్ చేస్తే.. పది కోట్లు వస్తుందా, ఇరవై కోట్లా, యాభై కోట్లా! .. ఆ సినిమా విడుదలకు ముందే వ్యాపారం అయిపోతే, ఆ తర్వాత దాని ఫలితంతో కూడా సంబంధం లేని రీతిలో తెలుగులో హీరోల బిజినెస్ మైండ్ సెట్ అయినట్టుగా ఉంది! సొంతంగా కథ వెదుక్కొనే ఆసక్తి కూడా స్టార్ హీరోల్లో కొంతమందిలో ఉండట్లేదు! ఈజీగా అయిపోతుందని రీమేక్ సినిమాలను వెదుక్కోవడం… వాటిని మళ్లీ తమకు అనువైన రొటీన్ ఫార్ములాలోకి మార్చుకోవడం.. మార్కెట్ మీదకు వదలడం! చూసే వాడు చూస్తాడు, చూడనివాడితో నష్టం లేదు.
హీరో రెమ్యూనిరేషన్ కు లోటు ఉండదు. ఈ సినిమాకు యాభై కోట్లు, వచ్చే సినిమాకు అరవై కోట్లు. అభిమానుల సంబరాలు, అనుకోకుండా ఆ సినిమాను చూసిన సగటు సినీ ప్రేక్షకుడికేమో ఒక రోజు నీరసం! అయితే ఇన్నాళ్లూ అలాంటి పరిస్థితి అయినా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పెద్ద హీరోలు కూడా ఓటీటీ బాట తప్పని పరిస్థితుల్లో.. కేవలం అభిమానులనే దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమాలు కేవలం ఆ అభిమానుల కోసమే మిగిలే సమయం వచ్చింది.
భారీ హంగామాతో విడుదలయ్యే కమర్షియల్ సినిమాను చూడటం తప్ప మరో సినీ వినోద మార్గం లేని రోజుల్లో.. తెలుగు హీరోలు, వారి దర్శకులు ఏం చేసినా చెల్లింది. అయితే సినీ వినోదం తన మాధ్యమాన్ని మార్చుకున్న నేపథ్యంలో, ప్రేక్షకులంటే లెక్కలేకుండా సినిమాలు చేసే హీరోలను కూడా ప్రేక్షకులు లెక్క చేసే పరిస్థితి లేకుండా పోతోంది! లాభాలే లక్ష్యంగా ఒక ప్రోడక్ట్ ను అమ్ముతున్నారనుకుందాం. దాని హంగూ అర్బాటాలు చూసి మొదట్లో దాన్ని కొంటారు.
ఆ తర్వాత అందులో నాణ్యత లేదని.. తయారీదారులు కేవలం లాభాలు సంపాదించుకోవడం తప్ప వినియోగదారుడి అవసరాన్ని గుర్తించడం లేదని… ఆ ప్రొడక్ట్ మీద అభిప్రాయం ఏర్పడితే, ఆ తర్వాత దాన్ని ఎవరూ కొనరు కదా! ఈ జనరల్ మార్కెటింగ్ రూల్ సినిమాకు కూడా అన్వయం అయ్యే సమయం వచ్చిందిప్పుడు. తమ అభిమానులను అలరించడానికే, ఆఖరికి దర్శకులు కూడా తాము ఆ హీరో అభిమానిగానే ఆ సినిమాను రూపొందించాం, ఆ హీరోని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అలానే చూపించామని ఓపెన్ గా స్టేట్ మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో.. సగటు ప్రేక్షకుడు అసలు కథను అర్థం చేసుకుంటున్నాడు!
తెలుగు స్టార్ హీరోల సినిమాలంటే అవి కేవలం వారిని, అవసరానికి మించి అభిమానించే వారి కోసం తీసేవే తప్ప.. ప్రేక్షకుడికి వినోదాన్ని ఇవ్వడానికి తీసినవి కావని.. మంచి సినిమా చూడాలని ఆకాంక్షించే వారికి ఆశాభంగమే తప్ప.. అంతకు మించిన సీన్ ఉండదని… తెలుగు స్టార్ హీరోలు, వారి ఫ్యాన్స్ అయిన దర్శకులు ప్రేక్షకులకు ఒక్కో సినిమా ద్వారా బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు!
తెలుగు సినిమా పూర్తిగా హీరో సెంట్రిక్ గా ఉంది. అలాంటప్పుడు మంచి సినిమాలు వస్తే.. ప్రశంసలు అందుకునేది హీరోలే, కనీసం పక్క భాషలతో పోటీ పడే రీతిలో సినిమాలను అందించలేని తరుణంలో కూడా అనాల్సింది హీరోలనే కదా!
తా చెడ్డ కోతి వనమంతా..!
కొన్ని రీమేక్ సినిమాల పోకడలను చూస్తే.. ఈ సామెత గుర్తుకు వస్తుంది. వేరే భాషల్లో హిట్టైన పలు సినిమాల తెలుగు రీమేక్ స్టంట్లను చూస్తే.. తా చెడ్డ కోతి వనమంతా చెరిపిందనే సామెతను గుర్తు చేయవచ్చు. పింక్, అయ్యప్పనుమ్ కోషియుం వంటి సినిమాల రీమేక్ లు, వాటి ట్రైలర్లు, టీజర్లను చూస్తే… ఇది కదా తెలుగు సినిమా అనిపించకమానదు! ఆ సినిమాను నిజంగా అభిమానించిన వారికి.. వామ్మో అనిపించేలా షాక్ ను ఇవ్వడం తెలుగు సినిమా మాస్ ఎంటర్ టైనర్ ల రూపకర్తలకే సాధ్యం అవుతోందని చెప్పగలదు.
ఆఖరికి కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల పేర్లు చెప్పి కూడా.. ఆ పాత్రల్లోని హీరోలతో నాటు నాటు అంటూ స్టెప్పులు వేయించాల్సిన స్థితిని దుస్థితి అనాలా? అబ్బే అలా కాదు.. అభిమానులను అలరించడానికి అవన్నీ తప్పవు, అదే సినిమా అంటే అనుకోవాలా? మీ సినిమాలను చూసేది అభిమానులు అనే వారు కాదూ.. ప్రేక్షకులు మీ సినిమాలను చూస్తారని హీరోలకు చెప్పేదెవరో మరి! మీ అభిమానులు అంటే.. వారు మీ సినిమాను ఎలా అయినా చూస్తారు.
ఒకవేళ మీ అభిమానులు చూస్తేనే మీ సినిమాలు హిట్ అవుతాయనుకుంటే.. మీ కెరీర్ లలో ఎక్కడా ఫ్లాపులు, డిజాస్టర్లు ఉండదకూడదు! మీరు అనేక కమర్షియల్ ఫార్ములా లెక్కలేసి తీస్తున్న సినిమాల్లో కూడా హిట్లు ఎన్ని? అనే విషయాలకు హీరోలు, వారి భజనపరులైన దర్శకులు కాదు.. వారి అభిమానులు అయినా సమాధానం ఇవ్వగలరా? అభిమానుల కోసమే మీరు చేస్తున్న సినిమాల్లో.. ఆ అభిమానులను ఆకట్టుకుంటున్నవి, వారి వల్ల హిట్ అవుతున్నవి ఎన్ని? అంటే.. మీరు తీస్తున్న సినిమాల్లో చాలా వరకూ మీ అభిమానులకే నచ్చడం లేదా!
అంతర్జాతీయ స్థాయిలో మలయాళ సినిమా!
ఆది నుంచి ఆఫ్ బీట్ సినిమాలు రూపొందించడం మలయాళీలకు కరతలామలకం. దశాబ్దాల నుంచి మలయాళీల రూటు సెపరేటుగా సాగుతూ ఉంది. 90లలో మలయాళీ దర్శకులు వేసిన వైవిధ్యమైన బాటలో నేటి తరం మలయాళీ దర్శకులు సూపర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆరంభం ఇలానే ఉండాలి, స్టోరీ ఎత్తుగడ ఇలానే ఉండాలి, క్లైమాక్స్ ఇలానే ముగియాలి.. అనే లెక్కలకు పూర్తి మినహాయింపుతో రూపొందుతున్న మలయాళీ సినిమాలు ఇప్పుడు దేశం మొత్తాన్నే కాదు, ప్రపంచాన్నే ఆకట్టుకుంటూ ఉన్నాయి. మీకు ఏ తరహా కథ కావాలాన్నా తాము అందించగలమన్నట్టుగా మలయాళీలు అందరి చూపూ తమ మీదకు తిప్పుకుంటున్నారు.
కామెడీ, సీరియస్, సస్పెన్స్, రియాలిస్టిక్.. ఏ ఫార్మాట్ లో అయినా మలయాళీ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. చిన్న చిన్న ఎమోషన్స్ మీద మూడు గంటల పాటు సినిమాను నడిపించగల వారి నేర్పు.. అన్ని పరిశ్రమలకూ రీమేక్ లకు తగిన కథలను అందిస్తూ ఉంది. తెలుగుతో పోలిస్తే మలయాళీ చిత్ర పరిశ్రమ చాలా చాలా చిన్నది. ఒక్క ఎవరైనా ఒక స్టార్ హీరో రెమ్యూనిరేషన్ తో అక్కడ అరడజను సినిమాలను తీయగలరు. ఆఖరికి మలయాళీ స్టార్లు బయటి భాషల్లో తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ కన్నా.. సొంత రాష్ట్రంలో ఇచ్చేది చాలా తక్కువ!
తమ నటనా ప్రావీణ్యంతో ఇతర భాషల అవకాశాలను సంపాదించుకుంటున్న మలయాళీ స్టార్ హీరోలు సొంత రాష్ట్రంలో తక్కువ రెమ్యూనిరేషన్ కే నటిస్తుంటారు. అందుకే వారు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడానికి కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలా చేస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. కథా, కథనాల విషయంలో మాత్రం వారెంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని, వారి సినిమాలు ఏవి చూసినా అనిపిస్తుంది. తెలుగులో స్టార్ హీరోలు చేసే సినిమాలు ఏడాదికి ఒకటి. అదే మలయాళంలో ఇదే స్థాయి స్టార్ డమ్ ను కలిగి ఉన్న హీరోలు మూడు నాలుగుకు తగ్గరు.
ఇమేజ్, ఫార్ములా.. అనే బేషజాలు లేకుండా వైవిధ్యతకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆ చిన్న పరిశ్రమ నుంచి వచ్చే మరి కొన్ని చిన్న సినిమాలు.. విదేశాల్లో కూడా బోలెడన్ని వ్యూస్ ను పొందే స్థాయిలో నిలుస్తున్నాయి. ఎవరి వరకో ఎందుకు.. తెలుగు వాళ్లే ఇప్పుడు మలయాళానికి సంబంధించి ఓటీటీల్లో ఏ సినిమా విడుదలైనా వీక్షిస్తున్న వారిలో ముందువరసలో నిలుస్తున్నారు. ఇదీ మంచి సినిమాలను అందించే ఇండస్ట్రీకి ఉండే ఆదరణకు రుజువు.
ప్రేక్షకుడిని మరీ తక్కువ అంచనా వేయడం చాలిక!
80లలో కూడా టాలీవుడ్ నుంచి ఎక్కువగా మాస్ ఎంటర్ టైనర్లు, కమర్షియల్ సినిమాలే వచ్చాయి. అయితే అప్పుడు కొంతమంది దర్శకులైనా విభిన్నమైన సినిమాలను రూపొందిస్తూ టాలీవుడ్ ఉనికిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా చాటారు. అయినా.. ఆ గ్యాప్ లో తమిళులు తమ వైవిధ్యమైన సినిమాలతో తెలుగునాట తల దూర్చడం ఆపలేదు. రియలిస్టిక్ సినిమాలతో, వైవిధ్యభరితమైన కథా,కథనాలతో వారు తెలుగు ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించారు. అలాంటి వాటిల్లో కొన్ని తమిళ సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.
బాపు వంటి దర్శకుడు కూడా భారతిరాజా సినిమాను తూర్పు వెళ్లే రైలు పేరిట రీమేక్ చేశారు. భారతిరాజా, బాలచందర్ వంటి దర్శకుల సినిమాలకు తెలుగునాట స్థిరమైన మార్కెట్ ఏర్పడింది. ఇలా తమిళుల దండయాత్ర తెలుగు చిత్రసీమ మీద ఎప్పుడూ ఉంది. కానీ.. తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమా మాత్రం కమర్షియల్ మంత్రాన్నే నమ్ముకుంది. ఈ పోకడ క్రమక్రమంగా విపరీతమే అవుతోంది. దీంతో బ్యాలెన్స్ తప్పడం వింత కాదు. తమిళంలో ఎంతసేపూ ఆఫ్ బీట్ సినిమాలే రాలేదు.
ఒకవైపు మాస్ ఎంటర్ టైనర్లు, ఇంకోవైపు వైవిధ్యతతో కూడిన సినిమాలతో అక్కడి ప్రేక్షకులను తమిళ సినిమా రూపకర్తలు పూర్తి స్థాయిలో ఓన్ చేసుకున్నారు! తెలుగు సినిమా మాత్రం ఈ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎప్పుడో ఫెయిలయ్యింది. అదే ఫెయిల్యూర్ స్టోరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్లు తీసింది చూడటం తప్ప ప్రేక్షకుడికి పెద్దగా చాయిస్ లేని రోజులు పోయిన నేపథ్యంలో అయినా.. హీరోల పోకడలు మారితే వారికే మంచిది! లేకపోతే… హీరోల కథ కంచికే, ప్రేక్షకులు ఇంటికే!