బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి వైరం లేదన్నారు కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఇటీవల డ్రగ్స్ వ్యవహారంలో షారూక్ తనయుడు ఆర్యన్ ను ఎన్సీబీ అరెస్టు చేయడం, అనంతర పరిణామాలపై కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. షారూక్ తనయుడిని ఈ వ్యవహారంలో ఫ్రేమ్ చేశారనే అభిప్రాయాలు గట్టిగా వినిపించిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇలా స్పందించడం ఆసక్తిదాయకంగా ఉంది.
ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ పట్టుబడలేదని ఎన్సీబీనే చెప్పింది. అతడి పక్కనున్న వారి వద్ద ఉన్న డ్రగ్స్ ను అతడు వాడాడు అనేది అభియోగం. అలాగే అతడి ఫోన్ లో డ్రగ్స్ గురించి కోడ్ వర్డ్స్ లో సంభాషణలు జరిగాయని కూడా ఎన్సీబీ కోర్టుకు తెలిపింది. అయితే ఆర్యన్ తరఫు లాయర్ల వాదన మరో రకంగా సాగింది. అక్కడ పట్టుబడిన పరిమాణం డ్రగ్స్ ప్రకారం.. ఆర్యన్ ను అంత కాలం జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని, అలాగే ఫోన్లో ఏదో సంభాషణను పట్టుకుని అది డ్రగ్స్ గురించే అనడం కూడా సరి కాదంటూ ఆర్యన్ తరఫు లాయర్లు వాదించారు.
ఎట్టకేలకూ బెయిల్ వచ్చింది. అనంతర విచారణ ఏ మేరకు సాగుతోందనేది ఇప్పుడు ఎవరికీ అంత ప్రాధాన్యతతో కూడిన అంశంగా లేదు. అయితే షారూక్ ఫ్యామిలీ పట్ల కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రకటించింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ స్పందించారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. షారూక్ పై తమకు ప్రత్యేకమైన కసి, కోపం లేదని, శత్రుత్వాలు ఏవీ లేవని కిషన్ రెడ్డి చెప్పారు.
షారూక్ కు బీజేపీలో కూడా మిత్రులున్నారని ఈ కేంద్ర మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఎన్సీబీ విచారణకూ బీజేపీకి డైరెక్టు సంబంధాలు లేవనేది ఆయన చెప్పదలిచిన అంశంలాగుంది.