శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు

శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు ( మార్చ్ 25 2020 – ఏప్రిల్ 12 2021) Advertisement మేషం:  వీరికి ఏడాది ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1గా ఉంటుంది.  వీరికి సంవత్సరమంతా గురుడు,…

శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు ( మార్చ్ 25 2020 – ఏప్రిల్ 12 2021)

మేషం:  వీరికి ఏడాది ఆదాయం–5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1గా ఉంటుంది. 

వీరికి సంవత్సరమంతా గురుడు, సెప్టెంబర్​ 23 వరకు రాహువు యోగదాయకులు. శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. 

ప్రారంభం నుంచి అన్ని విధాలా అనుకూల సమయమే. 

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. 

భవిష్యత్తు మరింత బంగారుమయంగా కనిపిస్తుంది. 

ఇతరులు సైతం మిమ్మల్ని మెచ్చుకునే సమయం. 

అందరిలోనూ ప్రత్యేక గౌరవమర్యాదలు పొందుతారు. 

స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది.

చిరకాల ప్రత్యర్థులు కూడా మీకు శిరస్సు వంచుతారు.

దైవ కార్యాలలో పాల్గొంటారు. 

ఆశ్చర్యకరమైన రీతిలో విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఊహించని రీతిలో ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం.

ఉద్యోగస్తులు గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు అధిగమిస్తారు.

వ్యాపారులు మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుట్టి లాభాల దిశగా పయనిస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభసాటిగా ఉంటాయి.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. అత్యుత్తమ పురస్కారాలు సైతం అందుకునే వీలుంది.

రాజకీయవేత్తలకు మరిన్ని పదవులు దక్కే సూచనలు, వీరికి ఏడాది మంచి ఆదరణ లభిస్తుంది.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.

క్రీడాకారులు, న్యాయవాదులకు ఊహించని అభివృద్ధి ఉంటుంది.

సెప్టెంబర్​ 23 నుంచి రాహువు ద్వితీయ రాశిలో ప్రవేశంతో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, వివిధ వృత్తుల వారికి మార్పులు జరిగే వీలుంటుంది. 

వీరు రాహువు, శనికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరారాధన మంచిది.

చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యం.

అదృష్టసంఖ్య–9.

వృషభం: వీరికి ఈ ఏడాది ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం –1గా ఉంటుంది. 

ఇక వీరికి కుటుంబ స్థానంలో సెప్టెంబర్​ 23 వరకు, తదుపరి జన్మ స్థానంలో రాహు సంచారం, అలాగే, మార్చి 29 నుంచి జూన్​ 29 వరకు గురుడు భాగ్య స్థానంలో అతిచారం సంచార కాలం శుభదాయకంగ ఉంటుంది. తదుపరి నవంబర్​ 20 వరకు అష్టమ స్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్య స్థానంలో సంచారం విశేష యోగకాలం.

ఇక శని కొంత వరకూ యోగాన్నిస్తాడు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన పైకం చేతికందుతుంది. 

చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.

తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.

శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండడం మంచిది.

నిరుద్యోగులకు నవంబర్​ నుంచి శుభదాయకంగా ఉంటుంది, 

విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.

వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. 

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. 

ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ద్వితీయార్థంలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగుతారు.

కళాకారులు క్రమేపీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు కొన్ని తప్పిపోయినా అధైర్యపడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

క్రీడాకారులకు అనుకూల సమయమని చెప్పాలి.

వీరు ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ వహించాలి.

గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది.

జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలిస్తాయి. మిగతావి సామాన్యం.

అదృష్టసంఖ్య–6. 

మిథునం: వీరికి  ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్​ 29 వరకు, తదుపరి నవంబర్​ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్​ 29 నుంచి వవంబర్​ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి. 

మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.

ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.

తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.

ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.

మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.

తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.

సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.

అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.

అయితే జూన్​– నవంబర్​ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.

అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి. 

విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.

ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.

కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది. 

టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.

క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.

వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్య 

హృదయం పఠించాలి.

చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–5.

కర్కాటకం: ఈ రాశి వారికి ఆదాయం –11, వ్యయం–8, రాజపూజ్యం–5, అవమానం–4గా ఉంటుంది.

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్​ 29 వరకు శుభుడు, తదుపరి నవంబర్​ 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమ స్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్​ 23 నుంచి రాహువు లాభ స్థానంలో శుభుడు.

మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.

ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి.

ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా హోమాలు, యజ్ఞాల వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. 

ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకుంటారు.

మిత్రులు, బంధువుల నుంచి తరతూ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.

అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగడం వల్ల కొంత అనుకూలత పొందుతారు.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగ లాభం.

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేందుకు చేసే కృషి ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములు ముందుకు రాకపోవడంతో డీలా పడతారు. విస్తరణలోనూ ఆటంకాలు.

ఉద్యోగస్తులకు అదనపు పనిభారం మీదపడుతుంది. అయితే నవంబర్​నుంచి శుభదాయకంగా ఉంటుంది.  కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమైన సమయమని చెప్పాలి.

రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు.

కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

వీరు, శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.

ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–2.

సింహం: ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–1, అవమానం–7గా ఉంటుంది.

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్​ 29 వరకు, తిరిగి నవంబర్​ 20 నుంచి షష్ఠమ స్థానంలో సంచరించిన కాలంలో సామాన్య స్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారంపరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

జూన్​ 29 నుంచి నవంబర్​వరకు గురుని పంచమ స్థానంలో సంచారం శుభదాయకం.  ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే.  

మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి. 

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

కోర్టుల్లో కొన్నేళ్లుగా నలుగుతున్న కేసులు పరిష్కారమయ్యే అవకాశం.

ఆస్తులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే, ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు.

కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం.

ఇంట్లో శుభకార్యాల నిర్వహణ.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకోవడంలో కృతకృత్యులవుతారు.

నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అలాగే, భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయం. ముఖ్యంగా లోహాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం.

ఉద్యోగులకు చిరకాల సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పదోన్నతులు దక్కుతాయి. అలాగే, పై స్థాయి వారి సహాయం సంపూర్ణంగా అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.  వీరికి మరింత గుర్తింపు లభిస్తుంది.

కళాకారులు అనుకున్న అవకాశాలు జాప్యం లేకుండా పొందుతారు. కొందరికి అవార్డులు దక్కవచ్చు.

క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 

వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు.

రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.

గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.

వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి.

చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి సామాన్యం.

అదృష్ట సంఖ్య….1.

కన్య: ఈ రాశి వారికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7గా ఉంటుంది.

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం అంటే జూన్​ 29 నుంచి నవంబర్​ 20వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూలమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూల సమయంగా భావించాలి.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధన లాభాలు ఉండవచ్చు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

తరచూ దైవకార్యాలు చేపడతారు. 

అలాగే, అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.

సంతానపరంగా మరింత సౌఖ్యం, వారి విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు. అలాగే, మంచి ర్యాంకులు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇనుము, కలప, బంగారం వంటి వ్యాపారాలు చేసే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు ప్రథమార్ధంలో ఆకస్మిక బదిలీలు అవకాశాలు. ద్వితీయార్థంలో పదోన్నతులు దక్కే అవకాశం.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు తథ్యం. ముఖ్యంగా కార్యజయం.

రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ, పదవీయోగాలు కలుగుతాయి. 

వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో అధికంగా లాభాలు గడిస్తారు. 

క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాద వృత్తుల వారికి గతం కంటే మరింత మెరుగైన కాలమని చెప్పాలి.

గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్​ 29 నుంచి నవంబర్​ 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లబిస్తుంటుంది.

ఇక వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, శ్రీ కృష్ణాష్టోత్తరం, అన్నపూర్ణాష్టక పఠనం మంచిది.

ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–5.

తుల: ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్​వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్​ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి ఏ కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి. 

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది. 

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్​ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.

చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య –6

వృశ్చికం: వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.

ఇక వీరికి సెప్టెంబర్​ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. 

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి. 

ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు. 

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు. 

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు. 

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి. 

క్రీడాకారులు, టెక్నికల్​ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

వీరు నవంబర్​ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

చైత్రం, వైశాఖం, ఆషాఢం,  శ్రావణం,  ఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య–9.

ధనుస్సు: ఈ రాశి వారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం–3గా ఉంటుంది.

ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్​ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్​ 30 నుంచి నవంబర్​ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయ రాశి సంచారంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు. 

ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉపశమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్​ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురుడు ఒక్కడే వీరికి అనుకూలమని చెప్పాలి. 

ఆర్థికంగా ప్రధమార్థంలోనూ, చివరిలోనూ విశేషంగా కలసివస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే, జ్ఞాతుల నుంచి కొంత సొమ్ము అందుతుంది. 

ఏ కార్యక్రమం చేపట్టినా కొంత శ్రమానంతరం పూర్తి కాగల సూచనలు.

బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

స్థిరాస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో తొలగే సూచనలు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర కలసివస్తాయి.

జీవిత భాగస్వామితో కొంత విభేదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టర్లకు ప్రథమార్థం విశేష లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కించుకునే చాన్స్​

నిరుద్యోగులకు ప్రథమార్థంలో శుభవార్తలు అందుతాయి.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకున్న పదోన్నతులు రావచ్చు. 

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థం చివరిలో మరింత రాణిస్తుంది.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు శుభదాయకంగా గడుస్తుంది. అయితే మధ్యలో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి.

రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదురైనా నెట్టుకొస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి.

వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది.

ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉంటుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి.

అదృష్ట సంఖ్య–3.

మకరం: ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది. 

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్​ 23 నుంచి అనుకూలం. 

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి. 

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది. 

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది. 

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు. 

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు. 

వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.

ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–8.

కుంభం: వీరికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–6గా ఉంటుంది.

ఇక వీరికి ఏల్నాటి శని దోషం అధికంగా ఉంటుంది. అలాగే, వ్యయస్థానంలో అంటే మార్చి 29 నుంచి జూన్​ 29వరకు, తిరిగి నవంబర్​ 20 నుంచి గురు సంచారం కూడా ప్రతిబంధకంగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్​ 20 మధ్య కాలంలో గురుబలం కాస్త ఊరటనిస్తుంది. 

అలాగే, సెప్టెంబర్​ 23 నుంచి అర్థాష్టమ రాహు దోషం కూడా తోడై ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద వీరికి ఏడాది మధ్యకాలం మినహా మిగతా కాలమంతా చికాకులు తప్పవు.

జూలై–నవంబర్​ మధ్య కాలం వీరికి విశేషంగా కలసివస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అలాగే, సంతానపరంగా మరింత సౌఖ్యం. కొందరికి సంతానప్రాప్తి కలిగే అవకాశాలు.

శని ప్రభావం వల్ల ఖర్చులతో పాటు వ్యయప్రయాసలు ఎదురై చికాకు పరుస్తాయి.

ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేయడంలో మీ శక్తిసామర్థ్యాల పై మీకే నమ్మకం సన్నగిల్లి ఇతరుల సాయం కోరతారు.

అనవరస ఖర్చులు మీదపడి ఇబ్బంది పడతారు.

బంధువులు, స్నేహితులతో తరచూ విభేదాలు నెలకొంటాయి.

కొందరు మీ ప్రగతికి ఆటంకాలు కల్పించడం మనోవ్యథ కలిగిస్తుంది.

ఆలోచనలు స్థిరంగా ఉండక డీలా పడతారు.

ఇంటి నిర్మాణాలు చేపట్టినా నెమ్మదిగా కొనసాగుతాయి.

గురుని అనుకూలత వల్ల ఏడాది ద్వితీయార్థం కార్యజయం. స్వల్ప ఆస్తి లాభ సూచనలు. శుభకార్యాల నిర్వహణ వంటి ఫలితాలు పొందుతారు.

విద్యార్థులకు అంచనాలు తప్పినా ఫలితాలు మాత్రం కొంత సంతృప్తినిస్తాయి.

నిరుద్యోగులకు ద్వితీయార్థం కొంత అనుకూల సమయం.

వ్యాపారస్తులకు లాభాలు దక్కినా పెట్టుబడుల్లో జాప్యం వల్ల చికాకులు. ముఖ్యంగా ఇనుము, సిమెంట్​ వ్యాపారస్తులకు నిరాశ తప్పదు.

ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగల అవకాశం. సమర్థతను నిరూపించుకునేందుకు మరింత శ్రమించాలి.

పారిశ్రామికవేత్తలకు కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. విదేశీ పర్యటనలు తరచూ వాయిదా పడతాయి.

రాజకీయవేత్తలకు ద్వితీయార్థంలో పదవీయోగం. 

కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కి ఊరట కలిగిస్తుంది. అయితే పోటీదారులతో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. మొదటి పంట సామాన్యం.

క్రీడాకారులు,న్యాయవాదులు, వైద్య రంగాల వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. 

వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, హనుమాన్​ పూజలు, ఆదిత్యహృదయం పఠనం మంచిది.

ఇక, చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. 

అదృష్టసంఖ్య–8.

మీనం: ఈ రాశివారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్​ 23 వరకు అర్థాష్టమ రాహువుదోషం కొంత చికాకు పరుస్తుంది.

మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి.

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి.

ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది.

మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధించడంలో విజయం పొందుతారు.

వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాల వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగే అవకాశం. వీరి సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. అయితే అర్థాష్ఠమ రాహుదోషం వల్ల ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల యత్నాలు సఫలం కాగలవు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. 

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.

ఇక అర్థాష్టమ రాహు దోషం వల్ల మానసిక అశాంతి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి.

వీరు రాహుకే తువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది.

ఇక,వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–3.

శుభమస్తు

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com