ఇప్పుడు జనం భయంలో వున్నారు. ఏది ముట్టుకుంటే ఏమవుతుందో అనే భయం వెన్నాడుతోంది. ఈ జాబితాలో ప్రింట్ పత్రికలు కూడా చేరాయి. ప్రింట్ చేసిన దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి, రవాణా దగ్గర నుంచి పేపర్ బాయ్ వరకు ఎన్నో చేతులు టచ్ చేసుకుంటూ వచ్చే పత్రికలు అంటే భయపడుతున్నారు జనం. అందుకే కరోనా ఎఫెక్ఠ్ తగ్గేవరకు పత్రికలు వద్దు అనుకునే వారి సంఖ్య మెలమెల్లగా పెరుగుతోంది.జనాలు చూస్తే ఇళ్లలో వున్నారు. టీవీల ముందు వున్నారు. 24 గంటలు టీవీ చూసాక, తెల్లవారి పత్రికల్లో ఏం వుంటుంది కొత్తగా అనే ఆలోచన కూడా వుంది.
ఈ విపత్తును తట్టుకోవడానికి ప్రింట్ మీడియా కిందా మీదా పడుతోంది. అసలే ప్రింట్ మీడియా పరిస్థితి నానాటికీ తీసికట్టు నామం బొట్టు అన్నట్లు వుంది. ఈ పేపర్ లకు ఆదరణపెరుగుతోంది. నెలకు వందలు పోసి పేపర్ కొనే కన్నా, నెట్ బిల్లు కట్టుకుంటే ఈపేపర్లు చదువుకోవచ్చు అన్న కాన్సెప్ట్ పెరుగుతోంది. పైగా తెలుగునాట పత్రికలు ఎవరి బాజా వాళ్లు వాయించడం తప్ప నిస్పక్షపాతంగా వుండేవి కరువైపోయాయి.
నానాటికీ తగ్గుతున్న సర్క్యులేషన్ మీద కరోనా వచ్చి పడింది. అసలే సంస్థలు కూనారిల్లుతున్నాయి. అమ్మకాలు లేవు. ప్రకటనలు వుండవు. ఇంక సర్క్యులేషన్ కూడా తగ్గిపోతే పరిస్థితి దారుణంగా వుంటుంది. ఇప్పటికే చాలా మీడియా సంస్థలు ఈ పరిస్థితి గమనించి గూగుల్ అప్లికేషన్లు, వెబ్ సైట్ల ఫామ్ లోకి ఎంటర్ అయ్యాయి. కానీ వీటన్నింటికి కంటెంట్ కావాలన్నా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎలాగోలా నిర్వహించాలి. అన్నింటికి మించి పొలిటికల్ ఇన్ ఫ్లూయన్స్, ప్రజల్ని ప్రభావితం చేయడం వంటి వాటి కోసమైనా పత్రికలు నడపాల్సిందే.
అందుకే దానివల్ల కరోనా వస్తుంది, దీనివల్ల కరోనా వస్తుంది అంటూ ఊదరకొడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు ముట్టుకుంటే మాత్రం కరోనా రాదు అని జనాలకు నచ్చ చెప్పడానికి కిందా మీదా అయిపోతోంది. పాల పేకట్ కడగాలి, బయట నుంచి తెచ్చిన ఏ కవర్ అయినా కడగాలి. డోర్ నాబ్ ముట్టుకున్నా, లిఫ్ట్ బటన్ ముట్టుకున్నా కడుక్కోవాలి అంటున్న మీడియా పత్రికలు ముట్టుకుంటే మాత్రం ఫరవాలేదు అంటోంది. ఇక్కడ జనం నమ్మలేకపోతున్నారు.
కచ్చితంగా ఈ ఎఫెక్ట్ ప్రింట్ మీడియా మీద వద్దన్నా పడుతుంది. అయితే కరోనా ఏప్రియల్ 15తో అయిపోతే ఫరవాలేదు. లేదూ అంటే మాత్రం ప్రింట్ మీడియా చాలా వరకు ఆంధ్రభూమి దారి పట్టాల్సిందే.